స్టార్‌స్పోర్ట్స్ ఐపీఎల్ బెస్ట్ కెప్టెన్ రేసులో కోహ్లీని వెనక్కి నెట్టిన ధోని,రోహిత్

ఐపీఎల్ ప్రారంభమై 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ 50 మంది జ్యూరీ సభ్యుల అభిప్రాయాల ఆధారంగా వివిధ కేటగిరీలో అత్యుత్తమ ఆటగాళ్లని ఎంపిక చేసింది.ఉత్తమ కెప్టెన్‌ల విభాగములో ఐపీఎల్ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ కెప్టెన్‌లుగా మహేంద్రసింగ్ ధోనీ,రోహిత్ శర్మ సంయుక్తంగా ఎంపికయ్యారు.మిస్టర్ కూల్ ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్‌లో ఆడిన 10 సీజన్‌లోనూ ప్లేఆఫ్‌ దశకు చేరుకొని మూడు సార్లు టోర్నీ ఛాంపియన్‌గా నిలిచింది.అలాగే రోహిత్ శర్మ సారథ్యంలో ముంబయి ఇండియన్స్ టోర్నీ చరిత్రలోనే అధికంగా నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా అవతరించింది.

ఇప్పటివరకూ జరిగిన ఐపీఎల్‌ 12 సీజన్‌లలో అద్భుత ప్రతిభ కనపరిచిన ఆటగాళ్లని వివిధ కేటగిరీలో జ్యూరీ సభ్యులు ఎంపిక చేశారు.ఐపీఎల్ గ్రేటెస్ట్ బ్యాట్స్‌మెన్‌ అవార్డు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్,ఆర్బీబీ హిట్టర్ ఏబీ డివిలియర్స్ సొంతం చేసుకున్నాడు.బౌలర్ల కేటగిరీలో శ్రీలంక ప్లేయర్ లసిత్ మలింగ అగ్ర స్థానం సంపాదించగా,ఆల్‌రౌండర్ కోటాలో ఆసీస్ ఆటగాడు షేన్ వాట్సన్‌ అవార్డు గెలిచాడు.

బ్యాట్స్‌మెన్ కేటగిరీలో డివిలియర్స్‌కి భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా గట్టి పోటీనిచ్చారని స్టార్ స్పోర్ట్స్ ప్రకటించింది. ఐపీఎల్ గ్రేటెస్ట్ ఇండియన్ బ్యాట్స్‌మెన్‌గా భారత సారథి కోహ్లీ ఎంపికైనట్లు వెల్లడించింది. ఐపీఎల్‌లో ఆర్సిబీ సారధి విరాట్ కోహ్లీ 177 మ్యాచ్‌లు ఆడి 5,412 పరుగులు సాధించి బ్యాట్స్‌మెన్‌గా టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.

ఐపీఎల్ అవార్డుల కోసం ఏర్పాటు చేసిన జ్యూరీలో మొత్తం 50 మంది ఉండగా అందులో 20 మంది మాజీ క్రికెటర్లు,10 మంది స్పోర్ట్స్ జర్నలిస్ట్‌లు,10 మంది క్రికెట్ విశ్లేషకులు,7 మంది బ్రాడ్‌కాస్టర్స్,ముగ్గురు యాంకర్స్ ఉన్నట్లు స్టార్‌స్పోర్ట్స్ వెల్లడించింది. ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ మ్యాచ్‌లు లాక్‌డౌన్‌ కారణంగా బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Show comments