iDreamPost
android-app
ios-app

తమిళ హీరో ప్లానింగ్ మాములుగా లేదు

  • Published Sep 14, 2021 | 10:24 AM Updated Updated Sep 14, 2021 | 10:24 AM
తమిళ హీరో ప్లానింగ్ మాములుగా లేదు

ఈ మధ్య అరవ హీరోలు తెలుగు దర్శకులతో గట్టిగానే టైఅప్ అవుతున్నారు. ఒకప్పటి డబ్బింగ్ మార్కెట్ ఇక్కడ మళ్ళీ పుంజుకునేలా కనిపిస్తుండటంతో మల్టీ లాంగ్వేజ్ మూవీస్ మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అప్పట్లో కమల్ హాసన్, రజనీకాంత్, సూర్య లాంటి హీరోలవి మనకు గట్టి పోటీ ఇస్తూ భారీ ఎత్తున రిలీజ్ అయ్యేవి. ఒకదశలో అక్కడి పెద్ద హీరో చిత్రం ఇక్కడ వస్తోందంటే మనవాళ్ళు రిలీజ్ డేట్లను వాయిదా వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇదంతా గతం. మధ్యలో డబ్బింగులు హవా బాగా తగ్గిపోయింది. ఇప్పుడు గత రెండు మూడేళ్లుగా చెప్పుకోదగ్గ స్థాయిలో వీటికి వసూళ్లు వస్తుండటంతో తమిళ స్టార్లు ఫోకస్ పెంచుతున్నారు.

ఇక అసలు విషయానికి రజినీకాంత్ అల్లుడు కం మనకు రఘువరన్ బిటెక్ గా బాగా పరిచయమున్న ధనుష్ తెలుగులో వరసబెట్టి సినిమాలు ఒప్పేసుకుంటున్నట్టు చెన్నై టాక్. ఆల్రెడీ దర్శకుడు శేఖర్ కమ్ములతో ప్రాజెక్టు అఫీషియల్ గా లాక్ అయిపోయింది. బడ్జెట్ కూడా భారీగానే కేటాయించబోతున్నారు. దీని తర్వాత వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సితార సంస్థ ఓ మూవీ ప్లాన్ చేసిందని గతంలోనే ప్రచారం జరిగింది. త్వరలోనే అధికారికంగా ప్రకటన రావొచ్చు. ఇవి కాకుండా ఆరెక్స్ 100, మహాసముద్రం ఫేమ్ అజయ్ భూపతి చెప్పిన లైన్ కు సైతం ధనుష్ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడని, ఇదీ ఓకే కావొచ్చని ఇన్ సైడ్ టాక్.

దీన్ని బట్టి చూస్తే తమిళ హీరోలకు తెలుగు మార్కెట్ సత్తా ఏంటో అర్థమైనట్టు కనిపిస్తోంది. అసలు ఇక్కడ పెద్దగా గుర్తింపు లేని శివ కార్తికేయన్ సైతం టాలీవుడ్ ఎంట్రీ కోసం చూస్తున్నాడంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఒక దెబ్బకు రెండు పిట్టలు సూత్రాన్ని ఫాలో అవుతూ ఇలా టార్గెట్ చేసుకోవడం బాగానే ఉంది కానీ మన హీరోలను మాత్రం అక్కడి దర్శకులు తమిళంలో సినిమాలు తీసేలా ప్రేరేపించకపోవడం గమనించాల్సిన అంశం. పైపెచ్చు మనవాళ్లే కోరిమరీ వాళ్ళను పిలుచుకొచ్చి హిట్లు డిజాస్టర్లు కొట్టిన సందర్భాలు కోకొల్లలు. తెలుగు దర్శకులు సైతం అక్కడి హీరోలతో హిట్లు కొడితే తమిళ ఆఫర్లు కూడా వస్తాయనే లెక్కలో ఉన్నారు మరి

Also Read : సిఎం జగన్ తో భేటీకి టాలీవుడ్ సిద్ధం