Dhamaka Review ధమాకా రివ్యూ

నెలరోజులకు పైగానే బాక్సాఫీస్ వద్ద ఏమంత జోష్ కనిపించడం లేదు. కారణం సరైన మాస్ బొమ్మ లేకపోవడమే. యశోద, మసూద లాంటివి హిట్ అయినప్పటికీ అవన్నీ కొన్ని వర్గాలకే పరిమితం కావడంతో అందరి చూపు ధమాకా వైపే ఉంది. అవతార్ 2 సైతం వసూళ్ల పరంగా ఎన్ని రికార్డులు సృష్టించినా సామాన్య ప్రేక్షకుడికి కావాల్సింది తెలుగు స్టైల్ ఎంటర్ టైన్మెంట్. అందులోనూ రవితేజ లాంటి స్టార్ అయితే ఇక చెప్పేదేముంది. పైగా ట్రైలర్ కట్, పాటలు జనంలోకి బాగా వెళ్లిపోయాయి. హలో గురు ప్రేమ కోసమే తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ధమాకా టైటిల్ లో ఉన్నట్టు పటాసులు పేల్చిందా లేదా చూసేద్దాం

కథ

స్వామి(రవితేజ)చేస్తున్న ఉద్యోగంలో కుదురుగా ఉండలేక ఖాళీగా తిరుగుతున్న టైంలో చెల్లి స్నేహితురాలు ప్రణవి(శ్రీలీల)ని చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమె తండ్రి(రావు రమేష్)కోటీశ్వరుడైన ఆనంద్ చక్రవర్తి(రవితేజ)సంబంధం తీసుకొస్తాడు. ఇద్దరూ ఒకటే అనుకున్న లీల తర్వాత వేర్వేరు అని తెలిసి షాక్ తింటుంది. మరోవైపు నగరంలో కంపెనీల యజమానులకు చంపుతూ వాటిని ఆక్రమించుకుంటున్న జెపి(జయరాం)ఆనంద్ తండ్రి(సచిన్ కెడ్కర్)జోలికి వస్తాడు. స్వామి, ఆనంద్ లో ఒకరు మాయమైపోతారు. తర్వాత జరిగే పరిణామాల్లో స్వామి సిఈఓగా మారాల్సి వస్తుంది. ఆపై స్టోరీ ఏంటో వెండితెర మీద చూడాల్సిందే

నటీనటులు

మాస్ మహారాజా రవితేజ మరోసారి ఎనర్జీని ఇందులోనూ పూర్తిగా చూపించాడు. ముఖ్యంగా పాటల్లో, కామెడీ సీన్స్ లో తన టైమింగ్ ఇప్పటికీ అలాగే ఉందని నిరూపించాడు. అయితే వయసు ప్రభావం క్లోజప్ షాట్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. అయినా సరే అభిమానులను మెప్పించడంలో తన వరకు శక్తివంచన లేకుండా కష్టపడ్డాడు.రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు కొత్తేమి కాదు, విక్రమార్కుడు, వీర, ఖిలాడీ, అమర్ అక్బర్ ఆంటోనీ ఇలా లెక్కలేనన్ని సార్లు చూపించినవే కావడంతో ఇందులో ఫలానా వెరైటీ అని చెప్పడానికి ఏమీ లేకపోయింది. ఫ్యాన్స్ వరకు విజిల్స్ వేసే మూమెంట్స్ కి లోటు లేవు కానీ సగటు పబ్లిక్ కి మాత్రం రెగ్యులరే అనిపిస్తాయి

ఈ మధ్య యూత్ ని బాగా కట్టిపడేస్తున్న శ్రీలీల ధమాకాలో మంచి జోష్ తో కనిపించింది. స్కిన్ షో చేయకుండానే గ్లామర్ ఒలకబోయడం ఒక ఆర్ట్. అది బాగా వంటబట్టేసుకుంది. పాటల్లో హుషారుగా స్టెప్స్ వేసింది. జయరాం చాలా హుందాగా చేశారు కానీ అల వైకుంఠపురములో లాంటి సినిమాల్లో పాజిటివ్ క్యారెక్టర్స్ చూసిన కళ్ళతో క్రూరంగా చూపించడం అంతగా అనలేదు అనిపిస్తుంది. రావు రమేష్, తనికెళ్ళ భరణి, తులసి, హైపర్ ఆది తదితరులు ఎన్నోసార్లు వేసిన వేషాల్లోనే మళ్ళీ కనిపించారు. మరీ ఒకటే డైలాగు ఉన్న సైడ్ రోల్ కి ఆలీ లాంటి నోటెడ్ ఆర్టిస్టుని తీసుకోవడం ఎందుకో అర్థం కాదు. మెయిన్ విలన్స్ క్యాస్టింగ్ మిస్ ఫైర్ అయ్యింది.

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు త్రినాథరావు నక్కినకు మంచి మాస్ పల్స్ ఉంది. అందులో అనుమానం లేదు. సినిమా చూపిస్తా మావా లాంటి లవ్ స్టోరీలోనూ కమర్షియల్ టచ్ ఇచ్చి విజయం సాధించడం, నాని లాంటి ఫ్యామిలీ హీరోతో నేను లోకల్ అంటూ మాస్ అవతారం చూపించడం ఆయన సాధించిన విజయాలు. అలాంటి డైరెక్టర్ కి ఏకంగా మాస్ మహారాజా దొరికితే ఎలా ఉంటుందో అని అంచనాలు పెట్టుకోవడం సహజం. ధమాకాకు అదే జరిగింది. క్రాక్ తర్వాత రెండు డిజాస్టర్లు తిన్న రవితేజకు అర్జెంట్ గా హిట్ పడాల్సిన టైంలో సరైన కాంబో సెట్ అయ్యిందనే అందరూ అనుకున్నారు. థియేటర్ కు వెళ్లేముందు వరకు అదే అభిప్రాయం ఉంది

కానీ త్రినాథరావు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా రొటీన్ స్టోరీకి వెళ్లిపోయారు. ఒక పెద్ద కార్పొరేట్ కంపనీ, దాని మీద కన్నేసిన ఓ విలన్, అతన్ని అడ్డుకునే హీరో. ఈ ట్రయాంగిల్ థ్రెడ్ మీద రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ ఏదేదో అల్లుకుంటూ పోయాడు. ముందు మంచి లైన్ అనుకుని దానికి తగిన సన్నివేశాలు రాసుకోవడం ఒక కళ. అలా కాకుండా ముందు నాలుగైదు సీన్లు ఫిక్స్ చేసుకుని దాని పైన స్టోరీ సెట్ చేయాలనుకుంటే అసలుకే మోసం వస్తుంది. ధమాకాలో అదే జరిగింది. డబుల్ రోల్ పరిచయంతో మొదలుపెట్టి హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్, జెపి ఎంట్రీ, కార్పొరేట్ వ్యవహారాలు ఇవన్నీ ఎన్నోసార్లు చూసిన టెంప్లేట్ లోనే సాగుతాయి.

డైరెక్టర్ రైటర్ ఇద్దరూ కొన్నిసార్లు చక్కగా నవ్వించారు. అందులో డౌట్ లేదు. ఇంద్రలో ప్రకాష్ రాజ్ చిరంజీవిలు కలుసుకునే సీన్ ని రీ క్రియేట్ చేయడం బ్రహ్మాండంగా పేలింది. ఫస్ట్ హాఫ్ లో హైలైట్ గా నిలిచిన ఎపిసోడ్ అదే. కానీ దానికి ముందు వెనుకా కావాల్సిన బలమైన సెటప్ మాత్రం సరైన రీతిలో సెట్ చేయలేకపోయారు. ఇంటర్వెల్ దాకా ఏదో టైం పాస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది కానీ ఫుల్ మీల్స్ తింటున్న భావన ఉండదు. ఏం జరుగుతుందో ఈజీగా గెస్ చేయొచ్చు. విశ్రాంతికి ముందు వచ్చే ఫైట్ లో ట్విస్టు సైతం ఎన్నోసార్లు చూసిందే. రెగ్యులర్ గా సినిమాలు చూసే సగటు తెలుగు ప్రేక్షకుడు ఎవడైనా సరే ముందే పసిగడతారు.

సరే పోన్లే అసలు విషయం సెకండ్ హాఫ్ లో ఉంటుందన్న నమ్మకంతో కొంచెం బెటర్ గా ఎక్స్ పెక్ట్ చేస్తాం. కానీ అంతగా ప్రయోజనం ఉండదు. స్వామి ఆనంద్ లకు సంబంధించిన కీలక మలుపుని ముందే ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ దాని చుట్టే విలన్ ని బకరా చేయడం కోసం సృష్టించిన కామెడీ అతకలేదు. పైగా అదంత నవ్వించే వ్యవహారంలానూ ఉండదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ని అనిల్ రావిపూడిని మిక్స్ చేసి ఏదో కొత్త స్టైల్ ని ట్రై చేసిన త్రినాథరావు చాలా చోట్ల వాళ్ళను ఇమిటేట్ చేసినట్టు అనిపించడం ఇబ్బంది పెడుతుంది. అసలు రవితేజని పదే పదే మాస్ లోనే చూడాలని అభిమానులు డిమాండ్ చేయడం లేదు. అలాంటప్పుడు కొత్తగా చేయొచ్చుగా

త్రినాథరావు ఇంత గ్యాప్ తీసుకోవడానికి సరైన న్యాయం జరగలేదు. గతంలో చాలాసార్లు చెప్పుకున్నట్టు జబర్దస్త్ కామెడీలకు ఉచితంగా అలవాటు పడిపోయిన ట్రెండ్ లో సింపుల్ జోకులతో జనాన్ని థియేటర్ కు రప్పించలేం. అల్లరి నరేష్ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చింది ఇందుకే. అలాంటప్పుడు రవితేజ ఆ ట్రాప్ లోకి తిరిగి వెళ్లడం కరెక్ట్ కాదుగా. క్రాక్ లోనూ కొత్తగా కనివిని ఎరుగని స్టోరీ లేదు. కానీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో బాగా కుదిరిన ట్విస్టులు ఉన్నాయి. సరే ధమాకా ఉద్దేశం కేవలం నవ్వించడమే కావొచ్చు. దానికి రౌడీ అల్లుడు, జంధ్యాల సినిమాల అనుకరణ ఎందుకు. అవి యూట్యూబ్లో ఫ్రీగా చూస్తాంగా. మళ్ళీ అవే చూపిస్తామంటే ఎలా

ఇవన్నీ కాసేపు పక్కనపెడితే మాకో రెండు కిక్ ఇచ్చే పాటలు, నాలుగైదు నవ్వించే సీన్లు ఉంటే చాలు సంతృప్తి పడతాం అనుకుంటే ధమాకా తీవ్రంగా నిరాశపరచదు. అలా కాకుండా కిక్, రాజా ది గ్రేట్, మిరపకాయ్ టైపు పైసా వసూల్ కంటెంట్ కావాలంటే మాత్రం కొంచెం కష్టమైన వ్యవహారమే. సంగీతం, కొరియోగ్రఫీ విషయంలో త్రినాథరావు శ్రద్ధ తీసుకున్నారు. దండకడియాల్, జింతాక్ జితజిత పాటలు స్క్రీన్ మీద బాగా పేలాయి. ఫ్యాన్స్ వాటికి ఫుల్ హ్యాపీ. ఆడియన్స్ అభిరుచులు వేగంగా మారిపోతున్న టైంలో ఊహాతీతంగా ఎవరూ చూపించలేని విధంగా కథాకథనాలు ఉంటేనే థియేటర్లు నిండుతాయి. చూసిందే చూపిస్తామంటే చెల్లడానికి ఇది 1990 కాదు.

దర్శకులు ఎవరైనా సరే అడ్వాన్స్ గా ఆలోచించాల్సిందే. వందల కోట్ల బడ్జెట్ లు లేకపోవచ్చు. ప్రమోషన్లకు విదేశాలకు తిప్పే బ్యానర్లు దొరక్కపోవచ్చు. కానీ కంటెంట్ రాజ్యమేలుతున్న జమానాలో కథ చరిత్రలో ఎప్పుడూ రానిదై ఉండాల్సిన అవసరం లేదు. కూర్చున్న రెండున్నర గంటల పాటు నవ్వించో భయపెట్టో ఈలలేయించో ఏదో విధంగా టికెట్ డబ్బులకు న్యాయం చేకూరిస్తే చాలు. హిట్టు చేసి పెడతారు. దానికి విజువల్ ఎఫ్ఫెక్ట్స్, సిజిలు అక్కర్లేదు. కూసింత నవ్యత, హీరో ఫ్యాన్స్ కు తగినంత కమర్షియల్ మసాలా, విసిగించకుండా నడిచిపోయే స్క్రీన్ ప్లే. ఇవి సరిగా కుదిరితే ధమాకా టైటిల్ కు సార్ధకత కుదిరేది. కానీ ఛాన్స్ మిస్ అయ్యింది

భీమ్స్ సంగీతంలో రెండు పాటలు ఆల్రెడీ ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి. తెరమీద కూడా విజువల్ గా బాగా చిత్రీకరించడంతో మాస్ కి ఎక్కేస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్లేదు. కొన్ని కొత్త సౌండ్స్ ట్రై చేశారు. బాగా కుదిరాయి. కార్తీక ఘట్టమనేని చాయాగ్రహణం భారీతనాన్ని కళ్ళముందు చూపించింది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ లో లోపమేమీ లేదు. అసలు మ్యాటరే అటుఇటుగా ఉన్నప్పుడు ఆయన మాత్రం ఏం చేయగలరు. ప్రసన్న కుమార్ పెన్ను పెద్దగా మేజిక్ చేయలేదు. శేఖర్, జానీ, యష్ ల డాన్సులు బాగున్నాయి. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మాణ విలువలు రాజీ పడలేదు. సబ్జెక్టు డిమాండ్ చేసినంత మేరకు అవసరమైనంత ఖర్చు పెట్టారు.

ప్లస్ గా అనిపించేవి

రవితేజ ఎనర్జీ
శ్రీలీల
రెండు మాస్ పాటలు
ఫస్ట్ హాఫ్

మైనస్ గా తోచేవి

రొటీన్ స్టోరీ
రెండో సగం
క్యారెక్టరైజేషన్స్

కంక్లూజన్

ఏదైనా ఊరికి ఎగ్జిబిషన్ వచ్చినప్పుడు పిల్లలు పెద్దలు ఉత్సాహంగా వెళ్లి ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఏడాదికి ఒకటి రెండుసార్లు మాత్రమే వస్తుంది కాబట్టి. అలా కాకుండా సంవత్సరం పొడవునా ఉందనుకోండి దాని మీద మోజు తీరిపోయి ఏం వెళతాంలే అంతా చూసిందే కదాని వదిలేస్తాం. రొటీన్ సినిమాల పరిస్థితి కూడా ఇంతే. వందలసార్లు చూసేసిన కథలతో ఎంత రవితేజ లాంటి స్టార్ హీరో అయినా ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించడం కష్టంగా ఉంది. ఉట్టి ఇమేజ్ లతో ఆడే రోజులు ఎప్పుడో పోయాయి. అయినా పర్లేదు అనుకుంటే ధమాకా ట్రై చేయొచ్చు. కేవలం పాటల కోసం నాలుగైదు సరదా సీన్ల కోసం. అంతకన్నా అంతకు మించి ఏమీ అడగకండి

ఒక్కమాటలో : రొటీన్ పటాకా

రేటింగ్ : 2.5/5

Show comments