iDreamPost
iDreamPost
సినిమా పరిశ్రమలో ఏదైనా సక్సెస్ తర్వాతే. అది ఉన్నప్పుడే ఎవరైనా దగ్గరికి వస్తారు. కానీ మాస్ మహారాజా రవితేజ మాత్రం డిఫరెంట్ గా ఆలోచిస్తూ అదే పనిగా ఫ్లాప్ డైరెక్టర్స్ తో ప్రాజెక్ట్స్ ఓకే చేస్తూ రిస్కుకు రెడీ అంటున్నాడు . ఇప్పుడు నిర్మాణంలో ఉన్న క్రాక్ దర్శకుడు గోపిచంద్ మలినేని గత చిత్రం విన్నర్ డిజాస్టర్. వచ్చి కూడా మూడేళ్లు దాటింది. కాకపోతే అంతకుముందు రవితేజతో చేసిన డాన్ శీను, బలుపు రెండూ హిట్ కావడంతో హ్యాట్రిక్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. దీని తర్వాత రమేష్ వర్మతో ఓ ప్రాజెక్ట్ ఉంది.
అతను గత ఏడాది రాక్షసుడుతో హిట్ అందుకున్నాడు. కానీ అది రీమేక్. కలర్ జిరాక్స్ లా ఉందే తప్ప ఈయన టాలెంట్ గురించి ప్రత్యేకంగా హై లైట్ అయ్యింది లేదు. మరి తాజాగా ఏ కథతో మాస్ రాజాను మెప్పించాడో తెలియదు. డ్యూయల్ రోల్ ఉండొచ్చనే టాక్ ముందు నుంచే ఉంది. క్రాక్ రిలీజయ్యాక దీనికి సంబంధించిన ప్రకటన రావొచ్చు.
ఇక ఈ సినిమా అవ్వగానే వక్కంతం వంశీతో చేసే అవకాశం ఉన్నట్టు తాజా అప్ డేట్. కథ కూడా ఓకే అయ్యిందట. స్టార్ స్టోరీ రైటర్ గా పేరున్న వక్కంతం వంశీ దర్శకుడిగా డెబ్యూ చేసిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా దారుణంగా బోల్తా కొట్టడం రెండో అవకాశం మీద ప్రభావం చూపించింది.
దాని ఫలితం దెబ్బకే బన్నీ ఏకంగా ఏడాది పాటు మేకప్ వేసుకోకుండా బ్రేక్ తీసుకున్నాడు. మరి ఇప్పుడు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటే ఏదో విషయమున్నట్టేగా. రవితేజ గత సినిమాలు డిస్కో రాజా, అమర్ అక్బర్ ఆంటోనీలు కూడా ఆయా డైరెక్టర్లకు వెనుక ఫ్లాపులున్నప్పుడు చేసినవే. మరి మాస్ రాజా ఇన్నేసి రిస్కులు చేయడం వల్లనే విజయం దక్కడం లేదో లేక కథ నచ్చితే చాలు దాని గురించి లోతుగా ఆలోచించకపోవడం వల్లనో ఏదైతేనేం మొత్తానికి గట్టి హిట్టు పడాల్సిన టైం అయితే వచ్చేసింది. లాక్ డౌన్ అయ్యాక ముందు క్రాక్ కు సంబంధించిన బాలన్స్ షూట్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేయాల్సి ఉంటుంది. అందుకే కొత్త ప్రాజెక్టుల ప్రకటన కొంత ఆలస్యం కావొచ్చు