iDreamPost
android-app
ios-app

ఢిల్లీ లో ట్రంప్ ఉన్న వేళ.. ఘర్షణలతో అట్టుడికిన రాజధాని..

ఢిల్లీ లో ట్రంప్ ఉన్న వేళ.. ఘర్షణలతో అట్టుడికిన రాజధాని..

సీఏఏ కి వ్యతిరేకంగా దాదాపు రెండు నెలల నుండి ప్రశాంతంగా జరుగుతున్న ఆందోళనలు సోమవారం సీఏఏ అనుకూల బిజెపి కార్యకర్తల పోటాపోటీ ఆందోళనలతో ఒక్కసారిగా వేడెక్కింది. సీఏఏ అనుకూల వ్యతిరేక ఉద్యమకారుల మధ్య తీవ్ర ఘర్షణలు చేసుకోవడంతో ఈశాన్య ఢిల్లీ రోడ్లన్నీ రణరంగంగా మారాయి. ఇరువర్గాల పరస్పర దాడులు, తీవ్ర హింసాత్మక ఘటనలతో ఈశాన్య ఢిల్లీ దద్దరిల్లింది. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు ఆరుగురు పౌరులు తో పాటు ఒక హెడ్ కానిస్టేబుల్ మృతిచెందారు. కాగా షుమారు నూట అరవై మందికి పైగా గాయపడ్డారు. ఈ ఆందోళనలలో అల్లరిమూకలు రెచ్చిపోయి దాడులకు తెగబడ్డారు. కనపడిన వాహనాలకు నిప్పు పెట్టారు, పెట్రోల్ బంకులు, ఇళ్ళతోపాటు పలు ఆస్తులను ధ్వంసం చేశారు. పోలీసుల మీద రాళ్ళ వర్షం కురిపించారు. వరుసగా రెండు రోజుల నుండి సాగుతున్న ఈ హింసాత్మక ఘటనలతో ఈశాన్య ఢిల్లీలోని జఫ్రాబాద్, మౌజ్పూర్ లు అట్టుడికాయి.

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. జఫ్రాబాద్, మౌజ్పూరి లతో పాటు కర్ధంపూరి, చాంద్ బాగ్, దయాల్ పూర్ లలో హింస చెలరేగినట్టు పోలీసులు తెలిపారు. మౌజ్ పూర్ లో ప్రదర్శనకారులను చెదరగొట్టడానికి ప్రయత్నించిన కానిస్టేబుల్ పై అల్లరిమూక దాడి చెయ్యడంతో తీవ్రగాయాలుపాలయిన అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందారు. షాహ్ధారా డిసిపి అమిత్ శర్మ తలకు, చేతికి గాయాలు కావడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గోకుల్ పూరి ఎన్సీపీ అనూజ్ కుమార్ మరొ ఇద్దరు సీఆర్పీఎఫ్ పోలీసులకు కూడా గాయాలయ్యాయి.

ఈ అల్లర్ల నేపథ్యంలో 9 మెట్రో స్టేషన్లను మూసివేశారు. ఈశాన్య ఢిల్లీలోని పది ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. 8 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను ఈశాన్య ఢిల్లీ అంతటా మోహరించారు. కాగా ఒకపక్క అమెరికా అధ్యక్షుడు డిల్లీ పర్యటన నేపథ్యంలోనే ఈ ఘర్షణలు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు పలు రాజకీయ పార్టీల నేతలు ఈ ఘటనని తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో శాంతిభద్రతలను పునరుద్దరించాలని లెఫ్ట్నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, హోం మంత్రి అమిత్ షా ను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అభ్యర్ధించారు.

సోమవారం రాత్రి కూడా భజన్ పూర్, మాజ్ పూర్, జఫ్రాబాద్ లలో అల్లర్లు చోటు చేసుకోవడంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇదే సమయంలో మీడియా పై పలు ఆంక్షలు విధించారు. గత రెండురోజుల నుండి జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెఫ్టనెంట్ గవర్నర్, పోలీస్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ ఉదయం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అల్లర్లు జరిగిన ప్రాంతాలలలోని ఎమ్మెల్యేల తో సమావేశమయ్యారు. తాజా అల్లర్ల నేపథ్యంలో 50 రోజులపాటు ఎటువంటి ఆందోళనలకు అనుమతి లేదని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.

ఈరోజు మోడీ, ట్రంప్ మధ్య జరగనున్న చర్చల్లో ఢిల్లీ అల్లర్ల అంశాన్ని ట్రంప్ ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందే ట్రంప్ అజెండా లో సీఏఏ అంశం ఉన్నట్టుగా తెలిసింది. ఈ అంశం పై ఇదివరకే ట్రంప్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజా అల్లర్ల నేపథ్యంలో మోడీ అంతర్జాతీయ సమాజానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.