Idream media
Idream media
ప్రభుత్వ ప్రతిష్టను మంటగలపడమే లక్ష్యంగా అసత్య అభియోగాలు మోపిన ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, తప్పుడు వార్తలు ప్రచురించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు పరువు నష్టం దావాతోపాటు చట్ట ప్రకారం ప్రభుత్వం తీసుకునే సివిల్, క్రిమినల్ చర్యలకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ హెచ్చరించింది.
ఈ మేరకు మాజీ సిఎం చంద్రబాబుతోపాటు ఉషోదయా పబ్లికేషన్స్ (ఈనాడు), ఆమోద పబ్లికేషన్స్ (ఆంధ్రజ్యోతి)కి లీగల్ నోటీసులు జారీ చేసినట్లు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సంచాలకులు వెంకటరెడ్డి తెలిపారు. వాస్తవాలను దాచిపెట్టి ప్రభుత్వంపై దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడం.. అసత్య కథనాలు ప్రచురించడాన్ని వారు తప్పుబట్టారు.
కనీసం తమ వాదన (వాస్తవాలను) ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు చోటు కల్పించనందునే తాము మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని వారు వివరించారు. గుంటూరు జిల్లాలో సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్‌కు సున్నపురాయి మైనింగ్ లీజును కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారమే 50 ఏళ్లకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వందకు వంద శాతం కేంద్రం నిబంధనల ప్రకారమే జీఓ ఇచ్చామని తెలిపారు.
వాస్తవం ఇది కాగా.. ప్రభుత్వానికి, గనుల శాఖకు చెడ్డపేరు తెచ్చేలా ‘’సొంత సంస్థకు లీజు పెంపా?’’ అంటూ ‘’ఈనాడు’’.. ‘’సొంత కంపెనీకి మేలు సిగ్గుచేటు’’ అంటూ ఆంధ్రజ్యోతి ఈనెల 10న తప్పుడు కథనాలు ప్రచురించాయి. ‘’సరస్వతి’’కి వందకు వంద శాతం చట్టబద్ధంగానే ప్రభుత్వం లీజును పొడిగించిందని చంద్రబాబుకు తెలుసు.
ఆయన కుట్రతోనే అసత్య అభియోగాలు చేశారు. ఈ రెండు పత్రికలూ కూడా దురుద్దేశంతో ఈ తప్పుడు కథనాలు ప్రచురించాయి. ప్రభుత్వాన్ని అప్రదిష్టపాల్జేయాలనే కుట్రే ఇందుకు కారణమని విమర్శించారు.
అందువల్ల 15 రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో చట్టపరంగా ప్రభుత్వం సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటుందంటూ చంద్రబాబుతోపాటు ఆ రెండు సంస్థలకు లీగల్ నోటీసులు జారీచేశామన్నారు. ఒక పత్రిక (ఈనాడు) ఖండన వార్త ప్రచురించినా అది ఏమాత్రం సంతృప్తిగా లేదు. మరో పత్రిక అసలు రిజాయిండర్‌నే ప్రచురించలేదని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ సవరణ చట్టం–2015 ప్రకారం.. ఇప్పటి వరకూ 31 సంస్థలకు మైనింగ్ లీజులను 50 ఏళ్లకు పెంచుతూ జీఓలు ఇచ్చాం. ఇందులో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కూడా ఒకటి. ఇందులో ఏమీ తప్పులేకపోయినా ఆ పత్రికలు తప్పుడు వార్తలు ప్రచురించాయన్నారు.
అసత్య ఆరోపణలు చేసిన చంద్రబాబు, తప్పుడు.. నిరాధార వార్తలు ప్రచురించిన ఆ పత్రికలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే చట్టపరంగా పరువు నష్టం దావా వేయడంతోపాటు ప్రభుత్వం క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్‌కు 2009 మే 18న అప్పటి ప్రభుత్వం 613 హెక్టార్ల సున్నపురాయి మైనింగ్ లీజును మంజూరు చేస్తూ జీఓ జారీ చేసిందని, 2014లో టిడిపి అధికారంలోకి వచ్చాక ఆ ఏడాది అక్టోబర్ 9న దీనిని రద్దుచేస్తూ ఉత్తర్వులిచ్చిందని అని తెలిపారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం 2015లో గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) సవరణ (ఎంఎండీఆర్–2015) చట్టం తెచ్చిందని, ఇది అమల్లోకి వచ్చిన నాటికే మైనింగ్ లీజులున్న సంస్థలు దరఖాస్తు చేసుకుంటే లీజును 50 ఏళ్లకు కచ్చితంగా పొడిగించాలని ఈ చట్టంలోని సెక్షన్ 8ఎ (3) స్పష్టంగా చెబుతోందని అన్నారు.
అప్పట్లో టిడిపి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం లో భాగస్వామి కూడా. దీని ప్రకార మే చంద్ర బాబు అనేక సంస్థలకు మైనింగ్ లీజులను 50 ఏళ్లకు పొడిగిస్తూ జీఓలు ఇచ్చారని, ఇలా ఇప్పటి వరకు 31 సంస్థలకు అనుమతులు జారీ అయ్యాయి. వీటిల్లో రాంకో సిమెంట్స్, జైపే బాలాజీ సిమెంట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్ వంటి సంస్థలకు వందలాది ఎకరాల లీజును 50ఏళ్లకు చంద్రబాబు సర్కార్ పొడిగించిందని తెలిపారు.
ఈ నేపథ్యంలో.. కక్షపూరితంగా తమ లీజును రద్దుచేశారంటూ ‘’సరస్వతీ పవర్’’ హైకోర్టుకు వెళ్లగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చిందని, హైకోర్టు ఆదేశాల మేరకు గనుల శాఖ “సరస్వతి’’ లీజు పునరుద్ధరిస్తూ 2019 డిసెంబరు 12న జీఓ 109 జారీ చేసిందని అన్నారు.
‘‘సరస్వతి పవర్’’ లీజును 50 ఏళ్లకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 8న జీఓ ఇచ్చిందని, ఇందులో ఏమైనా తప్పు ఉంటే విపక్ష నేతగా చంద్రబాబు ఏదైనా మాట్లాడవచ్చుని, కానీ ఇది కేవలం సిఎం వైఎస్ జగన్‌ది అయినందున లీజు పొడిగించారని ఆయన ఇష్టమొచ్చిన రీతిలో ఆరోపణలు చేశారని అన్నారు.
నాణ్యమైన బియ్యం పంపిణీ కోసం ఉద్దేశించిన సంచులను సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సంస్థ నుండి ప్రభుత్వం టెండర్లు వేయకుండానే కొనుగోలు చేసిందంటూ ఆరోపణలు చేసిన చంద్రబాబు, ఆ వార్తను ప్రచురించినందుకు ఈనాడు ఫౌండర్ డైరెక్టర్ సిహెచ్ రామోజీ రావు, ఎడిటర్ ఎం.నాగేశ్వరరావులకు రాష్ట్ర ప్రభుత్వం లీగల్ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసు అందిన ఏడు రోజుల్లోగా క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం కింద పరిగణించి దావా వేస్తామని హెచ్చరించింది. తప్పుడు ఆరోపణలు చేసినందుకుగాను ఐపిసి 499, 500, 501, 502 సెక్షన్ల కింద శిక్ష తప్పదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసరెడ్డి పేరిట జారీచేసిన నోటీసులో పేర్కొన్నారు.
ఈనాడు, టైమ్స్ ఆఫ్ ఇండియాలో టెండర్ ప్రకటన
నిజానికి పాలీ ప్రొపెలిన్ సంచుల కొనుగోలుకు సంబంధించి పౌర సరఫరాల శాఖ గత ఏడాది డిసెంబర్ 3న ఈనాడు, టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో టెండరు ప్రకటన ఇచ్చింది. ఈ–రివర్స్ టెండరు విధానాన్ని పౌర సరఫరాల శాఖ పక్కాగా నిర్వహించి పాలీ ప్రొపలిన్ సంచులను కొనుగోలు చేసింది. కానీ ‘‘తన సొంత పాలిమర్స్ సంస్థ నుంచి టెండరు లేకుండా సంచులు సరఫరా చేస్తున్నారు’’ అంటూ సిఎం వైఎస్ జగన్ ప్రతిష్టను దిగజార్చే విధంగా చంద్రబాబు ఆరోపించారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలను ఈనాడులో ప్రచురించారని ఆ నోటీసులో వివరించారు. కానీ, సంచుల కొనుగోలులో పౌర సరఫరాల శాఖ ఏ సంస్థకూ అనుకూలంగా వ్యవహరించలేదని అధికారులు అందులో పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోపణలు చేసినట్లు ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి, వారి అనుబంధ సంస్థలకు ఎటువంటి ప్రమేయం లేకపోయినా తప్పుడు ఆరోపణలు చేశారన్నారు.