iDreamPost
android-app
ios-app

విజయవాడ గ్యాంగ్ వార్ కేసు- అతిచేస్తే నగర బహిష్కరణ వేటు- డీసీపీ హెచ్చరిక

విజయవాడ గ్యాంగ్ వార్ కేసు- అతిచేస్తే నగర బహిష్కరణ వేటు- డీసీపీ హెచ్చరిక

విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో గ్యాంగ్ లీడర్ పండు తల్లిపై కూడా కేసు నమోదు చేస్తున్నట్లు డీసీపీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. కుమారుడిలో నేర ప్రవృత్తిని పెంచినందుకు పండు తల్లిపై కేసును నమోదు చేసినట్లు తెలిపారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పండును డిశ్చార్జ్ కాగానే అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. వివాదానికి కారణమైన ల్యాండ్ ఓనర్స్ శ్రీధర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డిలతో పాటు డీల్ మాట్లాడిన నాగబాబునూ విచారిస్తున్నామని తెలిపారు.

విజయవాడలో జరిగిన గ్యాంగ్ వార్ కేసుని అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని, ఇప్పటికే పండు గ్యాంగులో 18 మందిని అరెస్ట్ చేశామని, సందీప్ గ్యాంగులో 15 మందిని రిమాండుకు పంపినట్లు మీడియాకు డీసీపీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. మరో 15 మంది నిందితులు పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. నిందితుల కోసం ఆరు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని వెల్లడించారు.

త్వరలోనే పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేసి గ్యాంగ్ వార్ లో పాల్గొన్న నిందితులపై రౌడీ షీట్లు ఓపెన్ చేయనున్నట్లు డీసీపీ తెలిపారు. ఇప్పటికే రెండు గ్యాంగుల్లోని సభ్యులతో సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేశామని పేర్కొన్నారు. ఎవరైనా విజయవాడలో మళ్ళీ గ్యాంగ్ వార్లు చేస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. . నేర ప్రవృత్తి ఎక్కువగా ఉన్నవారిపై నగర బహిష్కరణ వేటువేస్తామని డీసీపీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.