iDreamPost
android-app
ios-app

నష్టం ఎంత..?

  • Published Oct 15, 2020 | 3:29 PM Updated Updated Oct 15, 2020 | 3:29 PM
నష్టం ఎంత..?

వర్షాల ఉపద్రవం వచ్చిపడ్డ నేపథ్యంలో ఏపీలో పంట నష్టం నమోదుకు యంత్రాంగం సిద్ధమైంది. ఒక పక్క భారీ వర్షాల కారణంగా ఇబ్బందుల పడుతున్న జనానికి సహాయసహకారాలు అందిస్తూనే మరోవైపు పంట, ఆస్తినష్టం అంచనాలు వేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈ మేరకు ఏపీ సీయం జగన్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. దీంతో యంత్రాంగా గ్రామాల బాట పట్టింది.

వర్షాలు తెరిపిచ్చిన ప్రదేశాల్లో నష్టమోదుకును ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. గత పంటల దిగుబడి బాగుండడం, ప్రభుత్వం నుంచి కూడా సహకారం లభించడంతో ఈ సారి సాగుకు రైతు ఉత్సాహంగానే ప్రారంభించాడు. అయితే పంటలు చేతికొచ్చే సమయంలో వర్షాలు తీవ్రంగానే దెబ్బతీసాయి. ఇప్పటి వరకు 71,821 హెక్టార్లలో వివిధ రకాల పంటలకు నష్టం ఏర్పడినట్టు ఆయా శాఖలు నివేదికలు స్పష్టం చేసాయి. ఇంకా పంట నష్ట నమోదు ప్రక్రియ కొనసాగుతోంది.

వర్షాలు, తుఫానుల ముప్పు ఎప్పుడు వచ్చినా ప్రధానంగా వరి పంటదే ఎక్కువ విస్తీర్ణంలో నష్టపోతుంటుంది. ఈ సారి కూడా దాదాపు 54వేల హెక్టార్లకుపైగా వరి పంటకు ఈ సారి వర్షాలు నష్టం తెచ్చాయని అధికారులు అంచనా వేసారు. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో వరి పంట ఎక్కువగా దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. అలాగే 12వేల హెక్టార్లలో పత్తిపంటకు కూడా నష్టం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో 29వేల హెక్టార్లు, పశ్చిమలో 13,900 హెక్టార్లు, కృష్ణాలో 12,466, విశాఖలో 4,400 హెక్టార్లులో పంట నష్టం నమోదైంది. ఇంకా పలు జిల్లాల్లో వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పశ్చిమగోదావరి జిల్లాలో సాంఘిక సంక్షేమశాఖా మంత్రి తానేటి వనితలు పలు ప్రాంతాల్లో పర్యటిం, ముంపులో చిక్కుకున్న ప్రజలను కలుసుకున్నారు. రైతులతో మాట్లాడారు. నష్టపోయిన వాళ్ళను ప్రభుత్వం ఆదుకుంటుందని బాధితులకు భరోసానిచ్చారు.

కాగా, ప్రస్తుతం ఉన్న వాతావరణపరిస్థితులను అంచనా వేస్తే ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు మూడు రోజుల పాటు కురుస్తాయని వాతావరణ కేంద్రం ద్వారా తెలుస్తోంది. శనివారం కూడా ఆయా ప్రాంతాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర, తెలంగాణా, దక్షిణ మధ్య మహారాష్ట్రలను ఆనుకుని తీవ్ర అల్పపీడన ద్రోణి ఏర్పడుతున్నందున వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.