iDreamPost
iDreamPost
కరోనా విపత్తు వేళ అన్నార్తులకు కడుపు నింపే క్రమంలో కొందరు చేస్తున్న అతి అందరికీ వెగటు పుట్టిస్తోంది. దాంతో ఏదయినా పంపిణీకి సిద్ధమవుతున్న సమయంలో ఫోటోలకు అవకాశం ఇవ్వొద్దని ఇప్పటికే రాజస్తాన్ వంటి రాష్ట్రాల్లో కోర్టులు సూచనలు చేయాల్సి వచ్చింది.
ఇలాంటి వ్యక్తిగత అంశాలు పక్కన పెడితే తాజాగా వలస కూలీల విషయంలో అందరూ క్రెడిట్ గేమ్ ప్రారంభించారు. ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్రలో చిక్కుకున్న మత్స్యకారులను సొంత ప్రాంతాలకు తరలించేందుకు చేసిన ప్రయత్నాలు తమ వల్లనే అంటే తమ వల్లనే అని భుజాలు చరచుకోవడం ప్రారంభించారు.
వాస్తవానికి ఉత్తరాంద్రలో విశాఖ తర్వాత ఇచ్చాపురం వరకూ ఎక్కడా జెట్టీలు గానీ, పోర్టులు గానీ లేవు. కళింగపట్నం, భావనపాడు వంటి పోర్టుల నిర్మాణం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపింది. అనివార్యంగా ఏడాదిలో ఏడెనిమిది నెలల పాటు ఉపాధి కోసం ఉత్తరాంద్ర మత్స్యకారులు అరేబియా సముద్ర తీరానికి వలసలు వెళుతున్నారు. అటు కేరళ నుంచి ఇటు గుజరాత్ వరకూ చాలా ప్రాంతాలకు వెళుతూ ఉంటారు. అందులో అత్యధికంగా గుజరాత్ లోని వేరావల్ కి వెళుతుంటారు. ఇప్పుడు అలా వెళ్ళిన వారంతా లాక్ డౌన్ లో ఇరుక్కున్నారు. తీవ్ర సమస్యలు ఎదుర్కోవడంతో అది అందరినీ కలచివేసింది.
ఈ విషయంలో జగన్ ప్రభుత్వం చొరవ చూపింది. గతంలో శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశం గ్రామస్తులు పాకిస్తాన్ జైళ్లలో బంధీలుగా ఉన్న సమయంలో కూడా వారిని విడిపించే క్రమంలో కొంత ప్రయత్నం చేయడం ఫలితాన్నిచ్చింది. అప్పట్లో జైలు నుంచి వచ్చిన వారంతా నేరుగా సీఎంని కలిసి కృతజ్ఞతలు కూడా చెప్పారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో మత్స్యకారుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగా తొలుత సముద్రమార్గంలో తీసుకురావాలని ఆలోచన చేసింది. దానికి అనుగుణంగా గుజరాత్ సీఎంతో ఏపీ ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆమె కూడా సానుకూలంగా స్పందించడంతో చివరకు రోడ్డు మార్గంలో బయలుదేరారు.
మత్స్యకారులు ఇరుక్కున్న అంశంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా చొరవ చూపారు. ఏపీ కి చెందిన వారికి తగిన వసతి ఏర్పాటు చేయాలని, వారిని సొంత ప్రాంతాలకు తరలించే అవకాశాలు అన్వేషించాలని సూచించారు. చివరకు వారంతా బస్సులలో సొంత రాష్ట్రానికి బయలుదేరడంతో కథ సుఖాంతం అవుతుందని అంతా భావిస్తున్న తరుణంలో టీడీపీ నేతలు క్రెడిట్ గేమ్ మొదలు పెట్టారు. ఒక్క జెట్టీ కూడా నిర్మించకపోవడం ద్వారా వారంతా వలస బాట పట్టడానికి కారణం అయిన టీడీపీ నేతలే ఇప్పుడు తాము రాసిన లేఖతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి కాబట్టి, అంతా చంద్రబాబు చలవేనని చెప్పుకునేందుకు వెనుకాడడం లేదు.
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా వారి తీరు ఉన్నట్టు ఈ విషయంలో స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. అంతటితో సరిపెట్టుకోకుండా మరోవైపు సుజనా చౌదరి సిద్ధమయ్యారు. ఒకనాటి చంద్రబాబు శిష్యుడు అయిన సుజనా మాటల ప్రకారం మత్స్యకారుల సమస్యను ఆయన ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లడంతో, ఆయన ఆదేశాల మేరకు ఇప్పుడు బస్సులు సిద్ధం కావడం వెనుక తన కృషి కూడా ఉందని చెప్పుకోవడం విశేషం..విస్మయకరం కూడా.
ఇలా ఎవరికి వారు తమకే ఈ క్రెడిట్ దక్కాలని కరోనా వేళ పడుతున్న తపన నిజంగా నవ్వు రప్పిస్తోంది. కానీ అసలు విషయం ఏమంటే ఏపీ ప్రభుత్వం ఏకంగా రూ.3 కోట్ల రూపాయలను సీఎంఆర్ఎఫ్ నుంచి విడుదల చేసి వారికి అన్ని ఏర్పాట్లు చేసింది. గుజరాత్ నుంచి నేరుగా స్వగ్రామాలకు వెళ్లేందుకు తగ్గట్టుగా బస్సులు సిద్ధం చేసింది. మార్గం మధ్యలో అన్ని జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకున్నారు. ఇన్ని చేసిన ప్రభుత్వం సైలెంట్ గా ఉంటే, ఒక్క లేఖతో అంతా అయిపోయిందని ప్రతిపక్షం చెప్పుకోవడమే పెద్ద విడ్డూరంగా బావించాల్సి ఉంటుంది. ఇంకో కొసమెరుపు ఏమంటే తాము ప్రచురించిన వార్తల మూలంగా వాళ్లందరికీ విముక్తి కలిగిందంటూ ఈనాడు కూడా చెప్పుకోవడం. చంద్రబాబు, సుజనా, రామోజీ..ఇలా మొత్తానికి ఎవరూ తక్కువ వారు కాదులే అన్నట్టుగా ఉంది.