iDreamPost
android-app
ios-app

నిఖార్సైన ఎన్నికల అంచనాలు ఇచ్చిన CPS వేణుగోపాల రావు మృతి

  • Published Apr 01, 2020 | 2:43 PM Updated Updated Apr 01, 2020 | 2:43 PM
నిఖార్సైన ఎన్నికల అంచనాలు ఇచ్చిన CPS వేణుగోపాల రావు మృతి

ఇది మీడియా యుగం… మీడియా మద్దతు ఉంటే ఎవరైనా సుప్రసిద్ధులు అయిపోతారు, ఆయా రంగాలలో నిష్ణాతులుగా పేరు కూడా సంపాదిస్తారు.

తొలి రోజుల్లో అంటే దూరదర్శన్ రోజుల్లో ఎన్నికల ఫలితాలను అంచనా వేసే సెఫాలజీ లో మన రాష్ట్రానికే చెందిన GVL నర్సింహా రావ్ కి చాలా పేరుండేది. ఆ తరువాత ఆయన బీజేపీ లో రాజకీయంగా క్రియాశీలకం కావటంతో సెఫాలజీని వదిలేశారు.

2004 ఎన్నికల నుంచి లగడపాటి రాజగోపాల్ ఎన్నికల సర్వేల నిజం కావటంతో ఆయన సర్వేల కోసం అందరు ఎదురు చూసేవారు. తొలి రోజుల్లో ఆయన సర్వేలు నిజమయినా 2016 తమిళనాడు ఎన్నికల్లో ఆయన అంచనాలు తప్పాయి. కానీ 2018 తెలంగాణా ఎన్నికల్లో లగడపాటి సర్వే పేరుతో ఆంధ్రజ్యోతి చేసిన హంగామా తెరాస శ్రేణులను కూడా ఒత్తిడికి గురిచేసింది. ఆంధ్రజ్యోతిలో పెద్ద పెద్ద అక్షరాలతో “ఆంధ్రా ఆక్టోపస్” అంటూ లగడపాటి సర్వే ఇప్పటి వరకు తప్పలేదని ప్రచారం చేసింది. ఫలితం అందరికి తెలిసిందే .. అయినా కానీ “కౌంటింగ్”లో ఎదో జరిగింది అంటూ కవరింగ్ ఇచ్చారు…

అంతటితో అయిపోలేదు .. ఆంద్ర ఎన్నికల్లో మళ్ళీ లగడపాటిని లేపారు,టీడీపీదే విజయం అంటూ మరోసారి ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు .టీడీపీ చరిత్రలో అతి భారీ ఓటమిని చవిచూసిన తరువాత “ఇంకా సర్వేలు” చెయ్యను అని లగడపాటి ప్రకటించారు.

ఇప్పుడు ఈ విషయాలు గుర్తుచేసుకోవటం ఎందుకు అంటే వేణుగోపాల రావ్ అనే ఒక సెఫాలజిస్ట్ 2004 ఎన్నికల నుంచి CPS (సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్) అనే సంస్థను ఏర్పాటు చేసి ఎన్నికల సర్వేలు నిర్వహిస్తున్నారు. కానీ మీడియా మద్దతు లేకపోవటంతో పెద్దగా గుర్తింపు రాలేదు.

2015 GHMC ఎన్నికల నుంచి వేణుగోపాల్ రావ్ సర్వేలకు మంచి గుర్తింపు రావటం మొదలైంది . సోషల్ మీడియాలో CPS సర్వేలు బాగా ట్రెండ్ అయ్యేవి. 2018 తెలంగాణా ఎన్నికల్లో లగడపాటి తో సహా చాలా సంస్థలు తెరాస ఓడిపోతుందని చెప్పినా వేణుగోపాల్ గెలుపు తెరాస దే అని లెక్కలతో సహా చెప్పారు..ఫలితాలు ఆయన చెప్పిన లెక్కలకు చాలా దగ్గరగా వచ్చాయి.

ఇంకా 2019 ఆంద్ర ఎన్నికల అంచనాలలో మళ్ళీ లగడపాటితో సహా CSDS ఇంకా మరి కొన్ని సంస్థలు టీడీపీదే గెలుపు అంటూ చేసిన ప్రచారానికి CPS తరుపున వేణుగోపాల్ సర్వే గట్టి సమాధానం ఇచ్చింది. ఆ ఎన్నికల్లో వైసీపీ 130 స్థానాలు గెలుచుకుంటుందని వేణుగోపాల్ రావ్ సర్వే చెప్పింది. వారు నియోజకవర్గాల వారీగా వివిధ పార్టీల ఓటింగ్ శాతాలు , విజయాలు అంచనా వేశారు. వైసీపీ అందరి ఊహలను దాటి 151 స్థానాలు సాధించింది.. అన్ని సర్వేల కన్నా వేణుగోపాల్ రావ్ చెప్పిన నంబర్ వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉంది.

జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత వేణుగోపాల్ రావ్ ను విజయవాడ ఆహ్వానించి సన్మానం చేశారు . తెలంగాణా మరియు ఆంధ్రా ఎన్నికల ఫలితాల తరువాత వేణుగోపాల్ రావ్ సంస్థ CPS కు మంచి గుర్తింపు వొచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా సర్వేలు చెయ్యమని వారికి ప్రాజెక్ట్స్ వచ్చాయి.

దాదాపు 2 దశాబ్దాల కృషికి ఇప్పుడు మంచి గుర్తింపు వస్తున్న సమయంలో ఆరోగ్య సమస్యలతో వేణు గోపాల్ రావ్ ఈ రోజు మరణించారు . దీర్ఘ కాలిక డయాబెటిక్ ప్రభావంతో కిడ్నీ సమస్య రావటంతో గత కొంత కాలంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వేణు గోపాల్ రావ్ ఈ రోజు NIMS లో మరణించారు.

వేణు గోపాల్ రావ్ ఢిల్లీ JNU లో చదివారు. JNU లో చదివే రోజుల్లో మాజీ చీఫ్ సెక్రెటరీ LV సుబ్రహ్మణ్యం , వేణు గోపాల్ రావ్ రూమ్ మేట్స్ . ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ JNU లో వీరికి సహాధ్యాయి.కర్నూల్ జిల్లా ఫ్యాక్షన్ ప్రభావం మీద వేణుగోపాల్ రావ్ ప్రొఫసర్ హరగోపాల్ గైడెన్స్ లొ చేసిన పరిశోధనకు హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రధానం చేసింది.

వేణుగోపాల్ రావ్ అకాల మరణం సెఫాలజీ రంగానికి తీరని లోటు .