iDreamPost
iDreamPost
కమ్యూనిస్టులంటే చాలామందికి పోరాడేవాళ్లుగా గుర్తుకొస్తారు. కానీ కొందరు మాత్రం ప్రచారం కోసమే ఉంటారు. ప్రచారం వస్తుందంటే ఏదయినా చేసేందుకు సిద్ధపడే సెక్షన్ కమ్యూనిస్టులలో కూడా పెరుగుతుండడమే వర్తమాన వాస్తవం. అందుకు మంచి ఉదాహరణ సీపీఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఆయన తీరు గత రెండు దశాబ్దాలుగా తెలుగు ప్రజలందరికీ సుపరిచితమే. ప్రతీ సందర్భంలోనూ ఆయన ప్రచారం కోసం చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అది వారి పార్టీ విధానాలకు భిన్నమైనప్పటికీ నారాయణ మాత్రం వెనకడుగు వేయరు. మాట ద్వారాను, చేతల ద్వారానూ నిత్యం జనం దృష్టిలో పడే ప్రయత్నం మాత్రం ఆపరు.
నారాయణ లాంటి నాయకుల వల్ల కమ్యూనిస్టు పార్టీకి ప్రయోజనమా.. కమ్యూనిస్టుల పార్టీ వల్ల నారాయణకు మేలు జరుగుతుందా అనేది ఇప్పటికే చాలాకాలంగా ఉన్న చర్చ. ఇప్పుడు తాజాగా దేశమంతా దీపాలు వెలిగించాలని ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన పిలుపులో స్వయంగా సీపీఐ నారాయణ కూడా భాగస్వామి కావడం విశేషంగా మారింది. పలువురు కమ్యూనిస్టు పార్టీ అభిమానులను కూడా విస్మయానికి గురిచేసింది.సిపిఐ జాతీయ నాయకత్వం ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం ఇక్క గమనార్హం . వాస్తవానికి ఇప్పటికే మోడీ ఇచ్చిన పిలుపులో భాగంగా నారాయణ స్వయంగా కంచాలు వాయించి సంఘీభావం తెలిపారు. ఇప్పుడు దీపం వెలిగించి మోడీ పిలుపుని అమలు పరిచారు.
ఇలాంటి వ్యవహారం నారాయణకు కొత్త కాదు. చిత్తూరు జిల్లా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, తిరుపతి కేంద్రంగా తొలి అడుగులు వేసిన నారాయణకు నాటి నుంచే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో స్నేహం ఉంది. దానికి అనుగుణంగా నారాయణ రాజకీయాలు ఉంటాయనేది ఆయన మీద చాలాకాలంగా విమర్శ. దానిని పక్కన పెడితే రాజకీయ విమర్శల విషయంలో కూడా ఆయన వ్యక్తిగత ధోరణి ప్రదర్శిస్తూ ఉంటారు. కమ్యూనిస్టు పార్టీ మౌలిక సూత్రాల ప్రకారం రాజకీయ విమర్శల్లో కూడా హూందాతనం, కేవలం విధానాల పరంగా మాత్రమే ఉండాలి. కానీ నారాయణ వాటిని పక్కన పెట్టి ఇటీవల జగన్ మీద చేసిన విమర్శలు గానీ అంతకుముందు కేసీఆర్ , మన్మోహన్ సింగ్ వంటి వారీ మీద చేసిన వ్యాఖ్యలు గానీ పెద్ద చర్చకు దారితీశాయి. కమ్యూనిస్టు విధానాలకు విరుద్ధంగా నారాయణ వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం బలపడేందుకు దోహదపడుతుంటాయి.
కేవలం నోటితో మాత్రమే కాకుండా తన చర్యలతో కూడా నారాయణ నిత్యం వార్తల్లో ఉండడం ఆనవాయితీగా వస్తోంది. 2008లో గాంధీ జయంతి నాడు చికెన్ ఆరగించి చికెన్ నారాయణగా ఆయన పేరు పొందారు. ఆ తర్వాత భౌతికవాదిగా చెప్పుకుంటూ తిరుపతిలో పూజలు చేయడం, బొట్టు పెట్టుకోవడం వంటి చర్యలతో స్వయంగా కమ్యూనిస్టు కార్యకర్తలను కూడా గందరగోళానికి గురిచేశారు. అన్నింటికీ మించి తాజాగా మోడీ పిలుపులపై కమ్యూనిస్టు శ్రేణులంతా పెదవి విరుస్తుంటే నారాయణ మాత్రం ప్రధాని చెప్పింది చేస్తూ సొంత పార్టీ వారికి కూడా మింగుడుపడని రీతిలో వ్యవహరిస్తున్నారు. వైద్యులకు సదుపాయాలు కల్పించడం, తగిన నిధులు విడుదల చేయడం కాకుండా కేవలం చప్పట్లు కొట్టి, పళ్లాలు వాయిస్తే ఏమొస్తుందని కమ్యూనిస్టు శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. కానీ నారాయణ మాత్రం పళ్లాలు వాయించి, చప్పట్లు కొట్టి మోడీ తానా అంటే తందాన అన్నట్టుగా వ్యవహరించడం సీపీఐ శ్రేణులను సైతం చిక్కుల్లో పడేస్తోంది. దానితో సరిపెట్టకుండా ఇంట్లో దీపం ఆర్పేసి, వీధిలో దీపం వెలిగించే పనిలో కూడా నారాయణ పాల్గొన్నారు. ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపులను తాను అమలు చేసినట్టు ఆయన చెప్పుకున్నారు. దేశ ప్రధానిగా అది తన బాధ్యతగా కూడా ఆయన ప్రకటించారు.
నారాయణ మాటల ప్రకారం ప్రధాని, ముఖ్యమంత్రుల మాటను ఆచరించడమే కమ్యూనిస్టుల కర్తవ్యం అయితే ఇక ఆ పార్టీలెందుకు అనే ప్రశ్న ఉదయిస్తోంది. కమ్యూనిస్టు అంటే పోరాటం..పోరాటం అంటే ధిక్కారం.. పాలకులను ధిక్కరించి ప్రజలతో కలిసి ఉద్యమించడం ద్వారా మార్పు సాధించాలని ఆశించే కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకుడు పాలకులకు వంత పాడడమే తన పనిగా పేర్కొంటే ఇక ఆయా పార్టీల మనుగడకే అర్థం ఉండదనే విషయం ఆయనకు అర్థమయ్యిందో లేదో అంతుబట్టడం లేదు. ఏమయినా దేశంలో మతం పేరుతో చిచ్చు పెడుతున్నారని నిత్యం మోడీని విమర్శించే నారాయణే ఇప్పుడు మోడీ సమైక్యత కోసం పిలుపునిచ్చారని, తాను పాటించానని చెప్పడం ఆయన పార్టీ అనుచరులకు కూడా అంతుబట్టకుండా ఉంది.
నిజానికి నారాయణ గత ఏడాది దిశ కేసులో ఎన్ కౌంటర్ ని సమర్థించడం కూడా ఆయన పార్టీలో చర్చకు దారితీసింది. చివరకు స్వయంగా నారాయణ క్షమాపణలు కూడా చెప్పారు. ఇప్పుడు మరోసారి అలాంటి చర్చ కోసమే నారాయణ ఇలాంటి కార్యక్రమానికి పూనుకున్నట్టు కనిపిస్తోంది. మొత్తంగా రాజకీయాల్లో ప్రచారమే పరమావధిగా సాగే నారాయణ చర్యలపై సోషల్ మీడియాలో నిత్యం ఆయన్ని వ్యతిరేకించే ఆర్ఎస్ఎస్ వర్గీయుల నుంచి సానుకూల స్పందన వస్తుండగా, కమ్యూనిస్టులు, వారిని అభిమానించే వారు మాత్రం జీర్ణం చేసుకోలేని స్థితిలో ఉండడం గమనార్హం.