Idream media
Idream media
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. కొత్తగా కరోనా బారినపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరిచేస్తూ రూల్ తీసుకొచ్చింది.
బుధవారం నుంచి ఈ నిబంధన అమలు చేయాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (డీడీఎమ్ఏ) ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ పెట్టుకోని వారికి రూ.500 జరిమానా విధించాలని కూడా నిర్ణయించింది. ప్రస్తుతం కోవిడ్ అదుపులో పెట్టేందుకు ఈ నిర్ణయం తప్పనిసరి అని డీడీఎమ్ఏ భావించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ రూల్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు కరోనా నిబంధనలు పాటిస్తూ స్కూల్స్ నడిపేందుకు, వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు సంస్థలకు అనుమతినిచ్చింది.
కరోనా కేసుల్ని గుర్తించేందుకు మెట్రో స్టేషన్స్, మార్కెట్లు, పబ్లిక్ ప్లేసుల్లో కరోనా టెస్టులు నిర్వహించనున్నారు. ప్రస్తుతం కోవిడ్ కొత్త వేరియెంట్ బి.1.10, బి.1.12 వైరస్‌లు ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 17,701 కరోనా టెస్టులు చేయగా, 1,009 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. మంగళవారం నమోదైన కేసులతో పోలిస్తే, బుధవారం 377 కేసులు ఎక్కువ నమోదవడం గమనార్హం. తాజా అంచనాల ప్రకారం ఢిల్లీలో పాజిటివిటీ రేటు 5.70 శాతానికి చేరింది.
కరోనాతో తాజాగా ఒకరు మరణించగా, 314 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది ఫోర్త్ వేవ్‌కు దారితీస్తుందా అని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం కరోనాను అదుపు చేసే చర్యలు చేపట్టింది. సభలు, సమావేశాలు, ఫంక్షన్లపై దృష్టి సారించింది. మాస్క్ తప్పనిసరి చేస్తూ రూల్ తీసుకొచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.