iDreamPost
android-app
ios-app

మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఉదయం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండలి రద్దు తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం వరకు జరిగిన సమావేశంలో మండలి రద్దుపై సభ చర్చించింది. చివరగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడిన తర్వాత సభలో ఓటింగ్‌ జరిగింది. సభ్యులందరూ మండలి రద్దుకు తమ సీట్లలో నిలబడ్డారు. 133 మంది మండలి రద్దుకు అనుకూలంగా ఓటేశారు. వ్యతిరేకంగా, తటస్థంగా ఒక్కరూ లేరు. కాగా, ఈ రోజు సభకు ప్రతిపక్ష టీడీపీ గైర్హాజరైంది. సభలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలతోపాటు జనసేన ఎమ్మెల్యే ఉన్నారు.

ఓటింగ్‌కు ముందు సీఎం జగన్‌ మండలి రద్దు ఎందుకు చేయాలో చెప్పారు. ప్రజలకు ఉపయోగపడని మండలికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసేందుకు అర్హత లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 60 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. మండలి చేసే సూచనలను కూడా శాసన సభ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేనప్పుడు దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. బిల్లులను రాజకీయ కోణంతో అడ్డుకోవడం తప్పా మండలి చేసేంది ఏమీ లేదని పెదవి విరిచారు. మండలి రద్దుకు సభ్యులందరూ మద్దతు తెలపాలని కోరారు. కాగా, ఓటింగ్‌ తర్వాత సభను నిరవదికంగా వాయిదా వేశారు.