iDreamPost
android-app
ios-app

కరోనా కు ఇంట్లోనే చికిత్స..!

  • Published May 23, 2020 | 5:10 AM Updated Updated May 23, 2020 | 5:10 AM
కరోనా కు ఇంట్లోనే చికిత్స..!

కరోనా అలియాస్‌ కోవిడ్‌ 19 వచ్చింది మొదలు ప్రపంచ వ్యాప్తంగా అందరికీ సరికొత్త విషయాలను నేర్పుతోంది. ఇప్పటి వరకు వైద్యరంగం అనుసరిస్తున్న విధానాలతో పాటు, సామాజిక వ్యవహారశైలిని కూడా మార్చేస్తోంది. ఈ వ్యాధి చికిత్సలో వైద్య వర్గాలు చేపడుతున్న ప్రతీ చర్యా మొట్టమొదటిదే అయ్యుంటుంది. ప్రజల ప్రాణాలు కాపాడాలన్న ఆతృతతో ప్రపంచ ఆరోగ్య సంస్థలాంటి వ్యవస్థలు కూడా అతి జాగ్రత్తలకు పాటించాయి. రానురాను తమ నిర్ణయాలను సమీక్షించుకుని సరళతరం చేస్తున్నాయి. వాటికి అనుగుణంగానే ఐసీయంఆర్‌ వంటి సంస్థలు కూడా ఎప్పటికప్పుడు అంతర్జాతీయ పరిస్థితులను బేరీజు వేసుకుంటూ స్థానికంగా ఉన్న వనరులను బట్టి వైద్యవిధానాలపై వైద్యులు, క్షేత్రస్థాయి సిబ్బందికి సూచనలు జారీ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కోవిడ్‌ సోకిన వ్యక్తులకు తమ ఇంట్లోనే ఉండనిచ్చి వైద్యం అందించే ప్రక్రియకు ప్రయోగాత్మకంగా ఆంధ్రప్రదేశ్‌ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రయోగాత్మక పరిశీలనకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. అయితే ఈ విధంగా ఇంటి వద్ద చికిత్స పొందాలనకునే వ్యక్తులకు ప్రత్యేక గది, ప్రత్యేక వాష్‌రూమ్‌ వంటి సదుపాయాలు తప్పకుండా ఉండాలి. వాటిని వైద్య బృందం పరిశీలించి సంతృప్తి చెందితేనే హోం క్వారంటైన్‌కు అనుమతిస్తారు. 24గంటలూ ప్రత్యేక వైద్య బృందాలు రోగికి అందుబాటులో ఉండే విధంగా ఈ విధానాన్ని సిద్ధం చేస్తున్నారు.

ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో హోం క్వారంటైన్‌లోనే చికిత్స పొందేందుకు వ్యాధి లక్షణాలున్నవారు ముందుకు వస్తారన్న భావన అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. కోవిడ్‌ రోగుల పట్ల వివక్ష చూపొద్దని ప్రభుత్వం ఎంత మొత్తుకుంటున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి. వ్యాధి పట్ల ఉన్న భయంతో ప్రజల స్పందన ఆందోళన కలిగించే విధంగా ఉంది. వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఆ విషయాన్ని బైటపడనీయకుండా దాయడం, ఒక వేళ తెలిస్తే చుట్టుపక్కల వారి నుంచి తలెత్తే ఇబ్బందుల నేపథ్యంలోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని యంత్రాంగం చెబుతున్న సమస్య.

దీంతో ఎవరికైనా అనుమానిత లక్షణాలుంటే చికిత్సకు చొరవగా ముందుకు రావడం లేదని చెబుతున్నారు. ఇటువంటి సమస్యలను అధిగమించేందుకు హోం క్వారంటైన్‌ తోడ్పడుతుందని వివరిస్తున్నారు. ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ విధానం సక్సెస్‌ అయితే కరోనా చికిత్సలో మరో సరికొత్త విధానం వైపు అడుగులు పడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.