Idream media
Idream media
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనాపై యుద్ధానికి ఎంతో మంది దాతలు ముందుకొచ్చి విరాళాలు ఇస్తున్నారు. మన దేశంలోనూ అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు తమకు తోచిన సహాయాన్ని అందిస్తున్నారు. వీరందరినీ మించి టాటా గ్రూపు అతి పెద్ద మనసుతో భారీ విరాళాన్ని ప్రకటించింది.
టాటా ట్రస్టు చైర్మన్ రతన్‌టాటా రూ. 500 కోట్లు ప్రకటించగా, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ రూ. 1000 కోట్లు ప్రకటించారు. మొత్తంగా 1500 కోట్ల రూపాయాలు కేటాయించినట్లయింది. తద్వారా దేశానికి అవసరమున్నప్పుడు టాటా గ్రూపు ఎల్లప్పుడూ ముందు ఉంటుందని మరోసారి చాటి చెప్పింది. దీనిపై రతన్‌టాటా ట్విట్టర్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అత్యవసర చర్యలు అవసరమని పేర్కొన్నారు. మానవాళికి ఎదురైన క్లిష్టమైన సవాల్ అని అభిప్రాయపడ్డారు. గతంలో దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు టాటా సంస్థలు తమ సాయంతో ముందుకు వచ్చాయని, ఇప్పుడు కూడా అలానే విరాళాన్ని ప్రకటించామన్నారు. ప్రధానంగా వైద్య పరికరాలు కొనుగోలుకు, శ్వాసకోస వైద్యానికి కావాల్సిన పరికరాలు, వెంటిలేటర్లకు, టెస్టింగ్ కిట్ల కోసం, రోగులకు మంచి వైద్యం అందించడానికి అవసరమైన సదుపాయాల కల్పనకు, కరోనాపై ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.