iDreamPost
iDreamPost
కరోనా వైరస్ విషయంలో మొదట్లో కేంద్రప్రభుత్వం చూపించిన నిర్లక్ష్యమే జనాల కొంపముంచుతోందా ? అంటే అవననే సమాధానం వస్తోంది అందరి దగ్గర నుండి. ఒకసారి కాస్త చరిత్రను చూస్తే కేంద్ర నిర్లక్ష్యం స్పష్టంగా అర్ధమవుతుంది. అప్పట్లోనే కాస్త జాగ్రత్తలు తీసుకుని ఉండుంటే జనాలు ఇపుడింత అవస్తలు పడాల్సిన అవసరం ఉండేది కాదేమో అని అనిపిస్తోంది. ఇంతకీ కేంద్రం నిర్లక్ష్యం ఏమిటి ?
ఏమిటంటే చైనాలోని వూహాన్ లో మొదటి కేసు బయటపడింది 2019, డిసెంబర్ 31వ తేదీన. మనదేశంలో మొదటి కేసు బయటపడింది కేరళలో 2020, జనవరి 30వ తేదీన. చైనాలో వైరస్ బయటపడగానే చైనా నుండి వచ్చేవారు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిక చేసి వదిలేసింది. చైనా నుండి వచ్చేవారికి స్క్రీనింగ్ టెస్టులు చేయాలని గాని, క్వారంటైన్ లేదా ఐసొలేషన్ ఏర్పాట్లని కానీ ఏమీ చెప్పలేదు. అప్పటికే వూహాన్ లో కేసులు విపరీతంగా పెరిగిపోయినా కేంద్రం పట్టించుకోలేదు.
అదే సమయంలో వూహాన్లో చిక్కుకుపోయిన విద్యార్ధులు గోల కూడా అప్పటికి పెరిగిపోయింది. దాంతో ఫిబ్రవరి 26-మార్చి 16 మధ్య కేంద్రం చేసిన హెచ్చరికల్లో విదేశాల నుండి వచ్చే ప్రయాణీకులకు స్క్రీనింగ్ టెస్టులు, క్వారంటైన్ కు పంపుతామని హెచ్చరికలు చేసింది. హెచ్చరికలైతే చేసింది కానీ సీరియస్ గా తీసుకోలేదు. అదే సమయంలో ఫిబ్రవరి 16-మార్చి మధ్యలో విదేశాల నుండి వచ్చిన వారంతా స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలని, క్వారంటైన్లలోకి వెళ్ళాలని చెప్పి వదిలేసిందంతే.
కేంద్రం పదే పదే హెచ్చరికలు ఎందుకు చేసిందంటే వూహాన్ తో పాటు ఇటలీ, స్పెయిన్, ఇరాన్ లాంటి దేశాల్లో వైరస్ ప్రభావం పెరిగిపోతోంది కాబట్టే. హెచ్చరికలు చేసిన కేంద్రం మళ్ళీ ఎందుకు సీరియస్ గా అమలు చేయలేదో ఎవరికీ తెలీదు. అయితే మార్చి 13వ తేదీన తర్వాత మాత్రమే విదేశాల నుండి వచ్చిన వారికి స్క్రీనింగ్ టెస్టులు చేయటం మొదలుపెట్టింది. ఎప్పుడైతే కేరళలో కూడా కేసులు బయటపడటం మొదలైందో అప్పుడే కేంద్రానికి వైరస్ తీవ్రత అర్ధమైంది.
అయినా సరే విదేశాల నుండి ఒడిస్సా, బెంగుళూరుకు వచ్చిన ఇద్దరు ప్రయాణీకులను వదిలిపెట్టేసింది. వాళ్ళిద్దరు ఢిల్లీ, ముంబాయ్ లాంటి ప్రాంతాల్లో చక్కర్లు కొట్టి తమ ప్రాంతాలకు చేరుకున్నారు. అప్పటికి వాళ్ళకు జ్వరం పెరిగిపోవటంతో ఆసుపత్రుల్లో చేరారు. పరీక్షలు చేయిస్తే కరోనా వైరస్ ఉందని తేలింది. అప్పటికే విదేశాల్లో వైరస్ ప్రభావం పెరిగిపోవటంతో వెంటనే కేంద్రం మేల్కొన్నది. దాంతో అప్పటికప్పుడు మార్చి నుండి కఠిన చర్యలు తీసుకోవటం మొదలు పెట్టింది. మొదట్లోనే వైరస్ తీవ్రతను గుర్తించి కఠిన చర్యలు తీసుకునుంటే దేశానికి ఇపుడీ అవస్తలు తప్పేదేమో ?