Idream media
Idream media
దేశంలో కరోనా మహమ్మారి తన కోరలతో విషం విరజిమ్ముతూనే ఉంది.ప్రతిరోజూ నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా గురువారం నాడు కొత్తగా 1229 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది.ప్రస్తుతం భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 21,700కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ వెల్లడించింది.ఈ వైరస్ సోకి ఇప్పటివరకు 686 మంది మృత్యువాతపడ్డారు.దేశవ్యాప్తంగా కరోనా బారినపడి కోలుకుంటున్న వారి సుమారు 20 శాతంగా ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
మహారాష్ట్రలో వేగంగా వ్యాపిస్తున్న కరోనా
ఇక మహారాష్ట్రలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దేశంలోనే కరోనా వైరస్ సోకినా బాధితుల సంఖ్య ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉంటుంది.గడిచిన 24 గంటలలో మరో 778 మంది వైరస్ బారిన పడగా,ఒక్క ముంబై నగరంలోనే 478 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ముంబైలో కరోనా సోకిన బాధితుల సంఖ్య 4,232 చేరుకోగా,రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 6,427కు పెరిగాయి.ముంబైలోని ధారావి ప్రాంతంలో నిన్న మరో 25 మందికి వైరస్ నిర్ధారణ కావడంతో ఆ ప్రాంతంలో కేసుల సంఖ్య 214కు పెరిగింది. ఇప్పటివరకు మహారాష్ట్రలో 269 మంది కరోనాతో మరణించారు. దేశఆర్థిక రాజధానిలో కరోనాబారినపడి 167మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.