వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య ఎప్పుడూ లేనంత సానుకూల వాతావరణం ఏర్పడింది. జగన్, కేసీఆర్ లు పలు దఫాలుగా సమావేశమై అపరిష్కృత అంశాలపై చర్చించారు…ఒకరి పట్ల ఒకరు ఆత్మీయత ప్రదర్శించారు. ఐతే తాజాగా లాక్ డౌన్ అమలు, కరోనా కార్యాచరణలో తమ పనితీరు బాగుందని చెప్పుకొనే క్రమంలో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కర్నూలు, గుంటూరులను పోల్చడం వివాదాస్పదమవుతోంది.
టీఎస్ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ తన శాఖ లేదా తన పనితీరు బాగుందని చెప్పుకుంటే పెద్దగా అభ్యంతరాలు వచ్చిండేవి కాదు. కానీ ఆయన ఏపీని ఇందులోకి లాగడంతో విషయం కాస్త వివాదస్పదమైంది. దీంతో ఈటెలకు కౌంటర్ గా తెలంగాణ ప్రభుత్వ విధానాలపై విమర్శలు వస్తున్నాయి. కేవలం19 వేల పైచిలుకు టెస్టులు చేసి…లక్షకు పైగా టెస్టులు చేసిన రాష్ట్రంతో పోల్చుకోవడం ఎంతవరకు సమంజసమనే వాదనలు తెరపైకి వస్తున్నాయి.
తెలంగాణ కరోనా టెస్టుల సంఖ్యపై తొలి నుంచీ విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకి 4 లేదా 6 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదవుతుండటంపై పలువురు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సైతం కేవలం ప్రైమరీ కాంటాక్ట్ లకు మాత్రమే కరోనా పరీక్షలు చేస్తామని ప్రకటించింది. ఇది కరోనా కట్టడిలో ఒకింత రాజీ ధోరణే అని చెప్పుకోవచ్చు. కానీ, ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లతోపాటు సామాజిక కుటుంబ సర్వేలో అనుమానితులుగా తేలిన వారందరికీ టెస్టులు చేస్తోంది. ఏపీ రోజుకి 7000 నుంచి 9000 మందికి టెస్టులు చేస్తుండగా తెలంగాణలో మాత్రం ఆ సంఖ్య 200 నుంచి 300కు మించి దాటకపోవడం గమనార్హం. ఇదే విషయమై తెలంగాణ డాక్టర్లు ఏపీ ప్రభుత్వాన్ని మెచ్చుకున్న విషయం కూడా తెలిసిందే.
ఏపీ ప్రతి పది లక్షల మందికి దాదాపు 2 వేల(1919) టెస్టులు చేసి…దేశంలోనే అగ్ర భాగాన నిలిచింది. ఈ విషయంలో తెలంగాణ చాలా వెనుకబడి ఉంది. ఏపీ విదేశాల నుంచి సైతం ర్యాపిడ్ కిట్లను దిగుమతి చేసుకోగా తెలంగాణ కేంద్రం పంపిన కిట్లనే పూర్తి స్థాయిలో వాడట్లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోకుంటే కర్నూలు, గుంటూరు పరిస్థితులు తలెత్తి ఉండేవి అంటూ ఈటెల మాట్లాడటంతో ఆయా జిల్లాల్లో ఎన్ని టెస్టులు చేశారు…కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్ లలో ఎన్ని టెస్టులు చేశారో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కేవలం 19 వేల పైచిలుకు టెస్టులకే 1100 కేసులు నమోదైతే ఏపీలా లక్ష టెస్టులు(ఏపీలో 1400 ప్లస్) చేస్తే ఇంకెన్ని కేసులు బయటపడతాయో అంటూ సందేహాలు వ్యక్తంచేస్తున్నారు.
తొలుత తెలంగాణలో కరోనా ఉధృతి ఎక్కువగా కనిపించింది
… ఆ సమయంలో ఏపీలో చాలా స్వల్ప కేసులే నమోదయ్యాయి. అప్పుడు కానీ, ప్రస్తుతం తెలంగాణ టెస్టింగ్ విధానంపై కానీ ఏపీ మంత్రులు లేదా ప్రభుత్వంలోని వారు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఈటెల మాత్రం కొంత అత్యుత్సాహం ప్రదర్శించి… ఏపీ ప్రతిపక్షానికి ఉపయోగపడేలా వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి కాస్త ఆలోచించి మాట్లాడటం ఈటెల వంటి వారికి ఎంతైనా అవసరం.