Idream media
Idream media
ప్రతి అంశంలో మంచి – చెడు, లాభం – నష్టం.. ఉన్నట్లు కరోనా వైరస్‌లో కూడా లాభం– నష్టం రెండూ ఉన్నాయి. వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం స్తంభించింది. అప్పటి వరకూ స్వేచ్ఛా విహంగాలు మాదిరిగా విహరించిన ప్రజలు కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. లాక్‌డౌన్ ఎత్తి వేసినా.. కరోనా భయం వెంటాడుతుండడంతో ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టాలంటే వణికిపోతున్నారు. ఇది నాణేనికి ఒక వైపు. కరోనాకు కూడా రెండో కోణం ఉంది.
కరోనా కట్టడికి భౌతిక దూరం పాటించడమే ప్రస్తుతం ఉన్న ఏకైక మార్గం. దీంతో ప్రపంచ దేశాలు.. తమ ఖారాగారాల్లో ఉన్న ఖౌదీలను తాత్కాలికంగా విడుదల చేస్తున్నాయి. సాధారణ సమయంలో పెరోల్, బెయిల్ కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోని జైళ్ల శాఖ.. తాజాగా తనంతటతానుగా పెరోల్, బెయిల్‌లు ఇస్తూ ఖైదీలను విడుదల చేస్తున్నాయి. మన దేశంలోనూ పలు రాష్ట్రాలు భారీ సంఖ్యలో ఖైదీలను విడుదల చేస్తున్నాయి. భౌతిక దూరం ఖచ్చితంగా పాటించేందుకు, కరోనా నుంచి బయటపడేందుకు ఈ దారిని ఎంచుకున్నాయి.
ఉత్తర ప్రదేశ్‌లో 16 వేల మంది ఖైదీలను విడుదల చేశారు. ఇక మహారాష్ట్రలో కూడా 7,200 మందిని విడుదల చేయగా మరో 10 వేల మందిని విడుదల చేసేందుకు చర్యలు చేపట్టారు. మధ్యప్రదేశ్‌లో 6,500 మంది, తమిళనాడులో 6 వేల మంది, అసోంలో 3,577 మంది ఖైదీలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేశాయి. కరోనా వైరస్ సాధారణ ప్రజల స్వేచ్ఛను హరించగా.. అదే సమయంలో ఖైదీలకు స్వేచ్ఛ కల్పించిందని చెప్పవచ్చు. అనుకోకుండా వచ్చిన స్వేచ్ఛతో ఖైదీలు ఆనందంతో ఉబ్చితబ్బిబ్బవుతున్నారు. కుటుంబంతో గడిపేందుకు కరోనా వల్ల సమయం దొరికిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.