iDreamPost
android-app
ios-app

కరోనా వల్ల ఆ ఆరోగ్యశాఖ మంత్రికి 10 కోట్లు నష్టమట

కరోనా వల్ల ఆ ఆరోగ్యశాఖ మంత్రికి 10 కోట్లు నష్టమట

కరోనా వైరస్‌ వల్ల ప్రభావితం కాని రంగాలు ఏవి లేనట్లుగా ఉంది. విమానయానం నుంచి పౌల్ట్రి పరిశ్రమ వరకూ వైరస్‌ భయం వల్ల నష్టపోయిన రంగాలే. రిలయన్స్‌ యజమాని నుంచి చికెన్‌ కొట్టు యజమాని వరకు అందరూ తమ తమ స్థాయిలో నష్టపోయారు. కరోనా వల్ల నష్టపోయిన వారి జాబితాలో ఓ మంత్రి కూడా ఉన్నారు. తనకు జరిగిన నష్టాన్ని స్వయంగా ఆయనే అసెంబ్లీలో వెల్లడించి బావురమన్నారు. ఇంతకూ ఆయన ఎవరో కాదు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌.

ఈటెల రాజేందర్‌ కరోనా బాధితుడిగా మారారు. వైరస్‌పై భయాందోళన వల్ల ప్రజలు చికెన్‌ తినడం మానేయడంతో మంత్రికి 10 కోట్ల నష్టం వచ్చిందట. పౌల్ట్రి పరిశ్రమను నిర్వహిస్తున్న ఈటెల రాజేందర్‌.. చికెన్‌ వ్యాపారం పడిపోవడంతో తనకు 45 రోజుల్లో 10 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో వాపోయారు.

తెలంగాణ వ్యాప్తంగా పౌల్ట్రి పరిశ్రమ 1000 కోట్ల రూపాయలు నష్టపోయిందని మంత్రి ఈటెల చెప్పారు. తెలంగాణలో కరోనా వైరస్‌ ప్రభావం లేదని సీఎం కేసీఆర్‌ కూడా చెప్పారని గుర్తు చేసిన ఈటెల.. ప్రజలు చికెన్‌ తినాలని కోరారు. పౌష్టికాహారమైన చికెన్‌ కిలో 15 లేదా 20 రూపాయలకు ఇస్తున్నామని.. దయచేసి అందరూ చికెన్‌ తినాలని విన్నవించారు. పౌల్ట్రి పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని కూడా మంత్రి ఈటెల ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.