కరోనా వైరస్ ఇప్పుడు దేశాన్ని,అధికారులను, సామాన్య ప్రజలనూ వణికిస్తుంది. వైరస్ ధాటికి చైనా,ఇటలీ,ఇరాన్ దేశాలు అతలాకుతలం అయ్యాయి. చైనాలో వైరస్ వ్యాప్తి తగ్గింది కానీ ఇటలీలో మాత్రం కట్టడి కావడం లేదు. అలాంటి పరిస్థితి రాకుండా భారత దేశ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన ఆంక్షలను అమలు చేస్తూ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని చూస్తున్నాయి.
అందులో భాగంగా ఇప్పటికే ఢిల్లీ,నాగపూర్ వంటి నగరాల్లో కర్ఫ్యూ విధించాయి. కాగా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో కరోనా కేసు బయట పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తాజాగా లండన్ నగరం నుండి ఒంగోలుకు చేరుకున్న ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రిజల్ట్ రావడంతో జిల్లా కలెక్టర్ తో పాటు, పోలీసులు, వైద్య శాఖాధికారులు అప్రమత్తమయ్యారు.
కరోనా సోకిన వ్యక్తి ఒంగోలు ZP కాలనీకి చెందిన వాడిగా గుర్తించడంతో రెండు శాఖలతో పాటు తెల్లవారు జాము వరకూ పరిస్థితిని జిల్లా కలెక్టర్ భాస్కర్ సమీక్షించి ఒంగోలు ZP కాలనీలో కర్ఫ్యూ విధించారు. కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రజలందరికీ అనౌన్స్ చేసి ప్రజలను తమ ఇళ్లలోనే ఉండాలని అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
ఒంగోలులో బయటపడిన కరోనా పాజిటివ్ కేసుతో ఆంధ్రప్రదేశ్ లో రెండో కేసుగా నమోదయ్యింది. తొలుత మొదటి పాజిటివ్ కేసు నెల్లూరులో బయటపడిన విషయం తెలిసిందే. దాంతో అక్కడ థియేటర్లు మాల్స్ మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
కరోనా నివారణకు జగన్ ప్రభుత్వం బ్రిటీష్ ప్రభుత్వ కాలం నాటి 1897 చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టానికి ఆంధ్రప్రదేశ్ అంటు వ్యాధి కోవిడ్ -19 రెగ్యులేషన్ 2020గా నామకరణం చేశారు. ఈ చట్టానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. శుక్రవారం నుంచే ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఏడాది పాటు ఈ చట్టం అమల్లో ఉంటుంది.ఈ చట్టాన్ని బట్టి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సంస్థలు, ఆస్పత్రులు కరోనా వైరస్ నియంత్రణ కోసం పనిచేయాలి. అవసరమైన చోట ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలి. కరోనా లక్షణాలతో ఉన్న అనుమానితులకు స్క్రీనింగ్, చికిత్స అందించాలి.
విదేశాల నుంచి ఎవరైనా రాష్ట్రానికి వస్తే… వారికి వ్యక్తులకు దగ్గు, జలుబు, శ్వాస సంబంధ వ్యాధులు లేకపోయినా 14 రోజుల పాటు ఇంటిలోనే ఐసోలేషన్‌లో ఉండాలి. ఆ సమయంంలో కుటుంబ సభ్యుల్ని , బయట వ్యక్తుల్ని కలవడానికి వీల్లేదు. విదేశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా వస్తే… కాల్ సెంటర్ 0866 2410978 నెంబర్‌కు లేదా 104 హెల్ప్ లైన్ నంబర్‌కు సమాచారం అందించాలి.
కరోనాను జగన్ సర్కార్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చింది. అనుమానితులకు వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక వార్డులు సిద్ధంగా ఉంచుకోవాలి ఆదేశించింది. అనుమానితులకు వైద్యం అందిస్తే.. ఖర్చుకు అదనంగా 10 వేలు, పాజిటివ్ కేసులకు వైద్యం అందిస్తే 20 వేలు ఇస్తామని ప్రభుత్వం అన్ని ఆస్పత్రులకు సర్కులర్ జారీ చేసి కరోనా పై అత్యంత అప్రమత్తంగా ఉంది.