Idream media
Idream media
తహసీల్దార్ వనజాక్షి మరోసారి వార్తల్లో నిలిచారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే పథకానికి సంబంధించి భూములు సేకరించేందుకు తహసీల్దార్ వనజాక్షి కృష్ణా జిల్లా తాడేపల్లి గ్రామానికి వెళ్లారు. భూములు ఇచ్చేందుకు సుముఖంగా లేని రైతులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ లక్ష్యాన్ని వివరిస్తూ భూములు ఇవ్వాలని కోరారు. అయితే పలువురు భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. భూముల సేకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ క్రమంలో ఎమ్మార్వో వనజాక్షి.. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వెనక్కి వెళ్లాలని అన్నట్లుగా సమాచారం. తమను బ్రోకర్లు అంటరా..? అంటూ స్థానిక రైతులు, మహిళలు ఎమ్మార్వోను చుట్టు ముట్టారు. ఆమెపై దాడికి ప్రయత్నించారు. రౌడీ ఎమ్మార్వో అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని ఎమ్మార్వో వనజాక్షిని అక్కడ నుంచి తరలించేందుకు యత్నించారు. ఈ సమయంలో రైతులకు పోలీసులు, తహసీల్దార్‌కు మధ్య స్పల్ప తోపులాట చోటుచేసుకుంది. అతికష్టం మీద పోలీసులు వనజాక్షిని అక్కడ నుంచి తరలించారు.
టీడీపీ ప్రభుత్వ హాయంలో దెంతులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేస్తున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని వనజాక్షి వార్తల్లో నిలిచారు. వనజాక్షిపై చింతమనేని దాడి చేయడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఈ వివాదం అప్పట్లో ముఖ్యమంత్రి వద్దకు చేరింది. చింతమనేనిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే.. వనజాక్షిని మందలించారని ప్రచారం జరిగింది. కాగా, ప్రస్తుతం వనజాక్షి.. రాష్ట్ర తహసీల్దార్ అసోసియేషన్‌కు అధ్యక్షురాలుగా ఉన్నారు.