Idream media
Idream media
దేశంలో ఏ రాష్ట్రం చేపట్టనటువంటి బృహత్తర పథకాలు ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ సర్కార్ అమలు చేస్తోంది. అమ్మ ఒడి, రైతు భరోసా, వైద్యం ఖర్చు వెయి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు, జగనన్న వసతి దీవెన.. ఇలా ప్రతి పథకం ఒక చరిత్రే. వీటి సరసన మరో కొత్త పథకం తెలుగు సంవత్సరాదిన చేరబోతోంది. అదే పేదలందరికీ ఇళ్ల స్థలాలు. రాష్ట్రంలో ఇంటి స్థలం లేని కుటుంబం అంటూ ఉండకూడదనే మహోన్నతమైన ఆశయంతో జగన్ సర్కార్ ఒకే సమయంలో 25 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వబోతోంది.
పట్టణాలల్లో ఒక సెంటు (48 గజాలు), పల్లెటూర్లలో ఒకటిన్నర సెంటు (72 గజాలు) స్థలం ఆ ఇంటి మహిళ పేరుపై రిజిస్ట్రేషన్ చేసి మరీ జగన్ సర్కార్ ఇవ్వబోతోంది. గత సర్కారులు.. ప్రభుత్వ భూమి ఉంటే తప్పా ఇళ్ల స్థలాలు ఇచ్చేవి కావు. అవి కూడా ప్రభుత్వాసరాలు తీరిన తర్వాతే పేదల గూడు గురించి ఆలోచించేవి. ఒకటి అరా స్థలాలు ఇచ్చినా.. తహసీల్దార్ సంతకంతో పట్టాను జారీ చేసేవారు. అవసరానికి వాటిని విక్రయించేందుకు వీలుండేది కాదు.
అయితే జగన్ సర్కార్ ఇస్తున్న ఇళ్ల స్థలాలు పక్కాగా రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వనున్నారు. లబ్ధిదారుల పేరుపైన తహసీల్దార్లే స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 10 రూపాయల స్టాంప్ పేపర్‌పై రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వనున్నారు. ఈ స్థలం వంశపారంపర్యంగా బదిలీ అవుతుంది. ఆ స్థలాన్నితాకట్టు పెట్టుకోవడంతోపాటు, అమ్ముకునే అవకాశం కూడా జగన్ ప్రభుత్వం ఇస్తోంది. బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ఆ స్థలంపై రుణం తీసుకొవచ్చు. ఐదేళ్ల తర్వాత కావాలంటే విక్రయించుకునే అవకాశాన్ని కూడా ఇస్తోంది.
వంశపారంపర్యంగా బదిలీ అవడం, తాకట్టు పెట్టి రుణం తెచ్చుకోవడం వరకు బాగానే ఉన్నా.. ఐదేళ్ల తర్వాత విక్రయించుకునే వెలుసుబాటు ఇవ్వడంపైనే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్థలం తీసుకున్న వారు ఇళ్లు నిర్మించుకోకుండా విక్రయించుకుంటే.. మళ్లీ వారు ఇళ్ల స్థలం, ఇళ్లు లేని వారుగా మిగులుతారు. ఇది ఇళ్ల స్థలం/ఇళ్లు లేని కుటుంబం ఉండకూడదనే ప్రభుత్వ మహోన్నతమైన లక్ష్యానికి గండికొట్టే అకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్న మాట. అయితే ప్రభుత్వం ఈ నిబంధన విధించడం వెనుక దూరదృష్టి ఉందని కూడా వారంటున్నారు. ఇళ్ల స్థలాల లబ్ధిదారులందరూ పేదలే కాబట్టి.. భవిషత్య్‌లో ఎదురయ్యే అవసరాలకు అమ్ముకునే అవకాశం ఇవ్వడం వల్ల ఆ స్థలాన్ని ఓ ఆస్థిగా వారికి ఉపయోగపడుతుందన్న ఆలోచనతోనే ఈ నిబంధన పెట్టినట్లు సమాచారం. ప్రభుత్వం ఎంతో సదుద్ధేశంతో అమలు చేస్తున్న ఇళ్ల స్థలాల పథకం అక్రమార్కుల పాలిట వరంలా మారకుండా ఉంటే జగన్ సర్కార్ లక్ష్యం నెరవేరినట్లే.