Krishna Kowshik
Krishna Kowshik
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వాడీ వేడిగా మారుతున్నాయి. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఊవిళ్లూరుతోంది ప్రతిపక్ష టీడీపీ. ప్రజా సంక్షేమ పథకాలే పరమావధిగా చూపెడుతూ.. తామే ఈ సారి అధికారంలోకి రాబోయేది అనే కాన్ఫిడెంట్‌తో ఉంది అధికార వైసీపీ. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందాలన్న ఉద్దేశంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేపడుతున్న సంగతి విదితమే. ప్రస్తుతం ఆయన పర్యటన పశ్చిమగోదావరి జిల్లాల్లో కొనసాగుతుంది. అయితే ఈ పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ.. వైసీపీ నేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇతర మంత్రులు, నేతలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను సైకో అంటూ ఆరోపించడంపై వైసీపీ కార్యకర్తలు, నేతలు మండిపడుతున్నారు.
సీఎం జగన్ పై అనుచిత పదజాలాన్ని వినియోగిస్తున్న నారా లోకేష్ ను తక్షణమే అరెస్టు చేసి, కటకటాల వెనక్కు తోయాలని ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ నూరుద్దీన్ డిమాండ్ చేశారు. జగన్‌తో పాటు పర్యాటక శాఖ మంత్రి రోజాతో పాటు మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలపై కూడా లోకేష్ ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకుంటున్నారని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూరుద్దీన్ మాట్లాడుతూ.. లోకేష్‌పై విజయవాడ పడమట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. లోకేష్‌నే కాదూ.. టీడీపీ నేతలు అయ్యన్న పాత్రుడు, యార్లగడ్డ వెంకట్రావుని కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన నారా లోకేష్, టీడీపీ బలోపేతానికి యువగళం పాదయాత్ర చేస్తున్నాడని అనుకున్నాము కానీ.. జగన్‌ను తిట్టడానికి అనుకోలేదని అన్నారు. ఆయన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన రూ. 118 కోట్ల అవినీతిపై నోరు మెదపాలని అన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని, జగన్ నేతృత్వంలో రాష్ట్రం ముందుకు వెళుతుందని అన్నారు.