Pakka Commercial : మాస్ రూట్ లోకి కామెడీ దర్శకుడు

నిన్న సాయంత్రం విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు రెస్పాన్స్ బాగానే ఉంది. కేవలం దీన్ని బట్టి అదిరిపోయే ఓపెనింగ్స్ వస్తాయని కాదు కానీ ఎంటర్ టైన్మెంట్ కి పెద్ద పీఠ వేసే దర్శకుడు మారుతీ ఈసారి పూర్తిగా మాస్ రూటు తీసుకోవడమే ఆశ్చర్యపరుస్తోంది. హీరో పాత్ర న్యాయవాదిగా కనిపించే ఈ కోర్ట్ రూమ్ డ్రామా మొదట జాలీ ఎల్ఎల్బి 2 రీమేక్ అనే ప్రచారం జరిగింది కానీ అది నిజమో కాదో క్లారిటీ లేదు. ఒకవేళ వాస్తవమే అనుకుంటే ఆ ఛాయలు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఒకవేళ ఇది పూర్తి వేరే వెర్షన్ అయితే విడుదల టైంకి క్లారిటీ వచ్చేస్తుంది. మొత్తానికి టైటిల్ కి తగ్గట్టు పూర్తి కమర్షియల్ గా ఉన్నది మాత్రం స్పష్టం చేశారు.

దీని విజయం గోపిచంద్ కు చాలా కీలకం. భారీ బడ్జెట్ తో సంపత్ నందితో చేసిన సీటిమార్ ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయింది. మొదటి వారం వసూళ్లు బాగానే వచ్చినా చివరికి మూడు నాలుగు కోట్ల నష్టం తప్పలేదు. ఈ మాచో హీరో నుంచి ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ వచ్చి ఏళ్ళు దాటుతోంది. లాస్ట్ బ్లాక్ బస్టర్ ఏదంటే ఎప్పుడో లౌక్యం దాకా వెనక్కు వెళ్లాల్సి వస్తోంది. ఒకప్పుడు మీడియం రేంజ్ మాస్ హీరోలను మించి ఓపెనింగ్స్ సాధించిన గోపిచంద్ కు ఈ పరిస్థితి ఊహించనిది. అందుకే ఆశలన్నీ పక్కా కమర్షియల్ మీద పెట్టుకున్నాడు. రాశి ఖన్నా హీరోయిన్ గా చేసిన ఈ మూవీకి జేక్స్ బెజోయ్ సంగీతం అందించారు.

కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయిన నేపథ్యంలో మార్కెట్ చాలా సంక్లిష్టంగా మారింది. గోపిచంద్ రేంజ్ హీరోలకు పాతిక కోట్ల షేర్ అనేది అందని ద్రాక్షగా మారిపోయింది. అద్భుతంగా ఉందనే టాక్ వస్తే తప్ప ఆ ఫిగర్ ని ఊహించుకోవడానికి లేనట్టు అయిపోయింది. అందులోనూ వరుస ఫ్లాపులు తన ఇమేజ్ ని ప్రభావితం చేశాయి. పక్కా కమర్షియల్ లోనూ రిస్క్ చేయకుండా రొటీన్ ఫార్ములా హీరోయిజంనే జొప్పించినట్టు కనిపిస్తోంది కానీ మరి అసలు కంటెంట్ లో ఏదైనా కొత్తగా ప్రయత్నించారేమో చూడాలి. గీత యువి సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ ఎంటర్ టైనర్ విడుదల తేదీ ఇంకా ఫిక్స్ చేయాల్సి ఉంది

Also Read : Box Office Weekend Collections :బాక్సాఫీస్ వారాంతపు వసూళ్లు ఎలా ఉన్నాయి

Show comments