iDreamPost
android-app
ios-app

వైఎస్సార్ బాటలో జగన్, కీలక పథకాలన్నీ అక్కడి నుంచే ప్రారంభం..

  • Published Dec 23, 2020 | 4:27 AM Updated Updated Dec 23, 2020 | 4:27 AM
వైఎస్సార్ బాటలో జగన్, కీలక పథకాలన్నీ అక్కడి నుంచే ప్రారంభం..

ఆంధ్రప్రదేశ్ కి అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పటికీ సామాన్య ప్రజల్లో హృదయాల్లో చిరస్థాయిగా నిలిచేపోయే స్థాయికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎదిగారు. అందుకు ఆయన చేపట్టిన పథకాలే పునాదులయ్యాయి. ముఖ్యంగా నేటికీ చాలామంది గుర్తుపెట్టుకునే వాటిలో ఆరోగ్య శ్రీ, ఫీజురీయంబెర్స్ మెంట్ కీలకమైనవి కాగా, ఇందిరమ్మ వంటి పథకాన్ని ప్రవేశపెట్టి క్షేత్రస్థాయిలో సమూల మార్పుల కోసం ఆయన శ్రీకారం చుట్టారు. మూడు విడతల్లో ఎంపిక చేసిన ప్రాంతాలను సమగ్రాభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచించారు. పేదలందరికీ ఇళ్లు, గ్రామీణ రోడ్లు, ఇతర సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిచ్చారు. ఫలితంగా అనేక మందికి అంతకుముందు ఎన్నడూ దక్కనంత ప్రయోజనం కలగింది. వైఎస్సార్ ని వారంతా హృదయంలో నిలుపుకునేందుకు అవకాశం ఏర్పడింది.

అలాంటి కీలకమైన ఇందిరమ్మ పథకాన్ని వైఎస్సార్ నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలో తూర్పు గోదావరి జిల్లాలోనే శ్రీకారం చుట్టారు. 2005లో తూగో జిల్లా కపిలేశ్వరపుర మండలం పడమరఖండ్రిగ నుంచి శ్రీకారం చుట్టారు. ఆ పథకం వైఎస్సార్ కి ఎంత కీర్తి తెచ్చిందన్నది చాలామందికి తెలిసిన విషయమే. ఇక వైఎస్సార్ తర్వాత మళ్లీ దశాబ్దంన్నర కి ఆయన తనయుడు వైఎస్ జగన్ మరోసారి అలాంటి పథకానికే సిద్ధమయ్యారు. రాజశేఖర్ రెడ్డి హయంలో పూర్తికాని కలను నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అరుదైన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఏకకాలంలో 30లక్షల మందికి సొంత ఇంటి కలను నెరవేర్చే ప్రయత్నానికి ఒడిగట్టారు. అది కూడా స్థలం కేటాయించి, ఇంటిని నిర్మించే యత్నం చేయడం అసాధారణమైనదిగా చెప్పవచ్చు. అంతటి కీలకమైన కార్యక్రమానికి జగన్ ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. దానికి కరోనా ఒక కారణమయితే విపక్షాల కుయత్నాలు మరో కారణంగా చెప్పాలి. ముఖ్యంగా చంద్రబాబు తన కుట్రలతో కేసులు నమోదు కావడంతో పలు చోట్ల పేదల ఇళ్ల స్థలాలు వివాదాల్లో ఇరుక్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ జగన్ అనేక సమస్యలను అధిగమించి ముందుడగు వేసేందుకు డిసెంబర్ 25ని ముహూర్తంగా నిర్ణయించారు.

జగన్ కూడా తన లక్ష్యాల సాధనలో కీలక పథకాన్ని తూర్పు గోదావరి జిల్లా నుంచే ప్రారంభిస్తుండడం విశేషం. ఇప్పటికే గ్రామ సచివాలయ వ్యవస్థకు కూడా జగన్ 2019 అక్టోబర్ 2న తూర్పు గోదావరి జిల్లాలోనే ప్రారంభించారు. కాకినాడ రూరల్ మండలం కరప గ్రామం ఉంచి ప్రారంభించిన ఆ పథకం ఇప్పుడు దేశమంతటినీ ఆకర్షిస్తోంది. గ్రామీణ పాలనను పూర్తిగా మార్చేసి ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వమని చాటుతోంది. అదే సమయంలో అందరికీ ఇళ్లు పథకం కూడా అదే జిల్లాలోని యూ కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో ప్రారంభంకాబోతుండడం ఆసక్తికరమే. తండ్రి లానే ప్రధాన పథకాలకు జగన్ కూడా తూగో జిల్లానే ఎంచుకుంటుండడం ఆసక్తికరంగా మారింది. గడిచిన 9 నెలల కాలంలో జగన్ అనేక కొత్త పథకాలను కేవలం వర్చువల్ సమావేశాల ద్వారా ప్రారంభించాల్సి వచ్చింది. అయినప్పటికీ ప్రజల మధ్య ప్రారంభించే అతి పెద్ద పథకాన్ని ఆ జిల్లా నుంచే ప్రారంభిస్తుండడం గమనార్హం.