Idream media
Idream media
తన ప్రజా సంకల్ప పాదయాత్రలో రైతుల బాధను చూసి, భూముల రీ సర్వే కార్యక్రమం చేపడుతున్నానని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చెప్పారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో సరిహద్దు రాయి వేసి సర్వేను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ అనంతరం జగ్గయ్యపేటలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.
‘‘ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం దేశంలో ఏ రాష్ట్రం కూడా సాహసించని కార్యక్రమం. ఇది జరగాలి, ప్రజలకు మంచి జరగాలనే లక్ష్యంతో చేస్తున్నాం. 16 వేల మంది సర్వేయర్లను నియమించాం. వీరికి అత్యుత్తమ శిక్షణ ఇచ్చాం. సర్వే ఆఫ్ ఇండియా భాగస్వామంతో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. బిడ్డ మీద తల్లికి ఎంత మమకారం ఉంటుందో.. భూమి మీద అంతే మమకారం ఉంటుంది. రైతు ఒక్కరే కాదు కష్టపడి పైసా పైసా కూటబెట్టుకుని కట్టుకున్న ఇళ్లు, కొనుక్కున్న ఇళ్ల స్థలంపై కూడా అంతే మమకారం ఉంటుంది. ఆ భూమి రైతుకు, ఇళ్లు ఆ కుటుంబానికి ప్రాణ సమానం. సంపాధించిన ఆస్తి వివాదంలోకి వెళితే ఆ బాధ ఎలా ఉంటుందో పాదయాత్రలో చూశాను. గట్టు జరిపి భూమి ఆక్రమిస్తే.. ఆ రైతు బాధ చెప్పలేనిది. రాబంధుల్లాంటి వారు భూములు కాగేస్తే.. పోరాడే శక్తిలేని ఆ పేద వారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు. ఆ పరిస్థితి మార్చాలని, ప్రజల ఆస్తిపై వారికి శాశ్వత హక్కులు కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. భవిష్యత్‌లో సరిహద్దులు మార్చే ప్రయత్నం చేసినా.. రికార్డుల్లో శాశ్వతంగా ఉంటుంది. కోర్టులకు వెళ్లే పరిస్థితి లేకుండా.. పరిష్కారం అవుతుంది..’’ అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
పరుల సొమ్ము పాము అని పెద్దలు చెప్పేవారు. కానీ ఇప్పుడు పరాయి వాళ్ల భూములు కబ్జా చేసి కోట్లకు ఎలా పడగలెత్తాలని చూస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకే నా ప్రయత్నం. అందులో భాగమే వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకానికి శ్రీకారం చుడుతున్నాం.
ప్రస్తుత వ్యవస్థలో ఏదైనా భూమికి సంబంధించిన వ్యవహారం, వివరాలు కావాలంటే.. నాలుగు శాఖల పరిధిలో ఉన్నాయి. రెవెన్యూ, సర్వే సెటిల్‌మెంట్, రిజిస్ట్రేషన్, స్థానిక సంస్థల్లో ఉన్నాయి. భూమికి హక్కుదారుడు ఎవరనేది తెలుసుకునేందుకు రెవెన్యూ శాఖకు, తాకట్టు పెట్టారా అని తెలుసుకునేందుకు రిజిస్ట్రేషన్ శాఖ వద్దకు, సబ్ డివిజన్ జరిగిందో తెలుసుకునేందుకు సర్వే శాఖకు, పన్నులకు సంబంధించిన విషయం తెలుసుకోవాలంటే.. స్థానిక సంస్థల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నాలుగు శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల సమస్యలు పెరిగిపోయాయి. ఒక భూ సమస్య పరిష్కారం కావాలంటే.. సామాన్యుడు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి. ఆర్డీవోలు, పోలీసులు, సివిల్ కోర్టుల చుట్టూ ప్రజలు తిరుగుతున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్నా.. ఆ భూమి సదరు వ్యక్తిదేనా అంటే.. ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితిలో వ్యవస్థలు లేవు. ఇప్పటి వరకూ ఉన్న చట్టాల ప్రకారం భూమి కొనుగోలు చేసే వ్యక్తే.. ఆ భూమి ఎవరిదో తెలుసుకోవాల్సి ఉండడమే సమస్య. భూ వివరాలు, కొలతలు తెలుసుకోకుండానే రిజిస్ట్రేషన్లు జరిగాయి. భూమి ఒకరి నుంచి మరొకరి మారినప్పుడు.. సర్వే, యాజమన్యా మార్పిడి, రికార్డుల్లో నమోదు జరగలేదు. అందువల్ల అసలైన పట్టాదారు ఎవరు..? సాగుదారు ఎవరు..? రికార్డుల్లో ఎవరున్నారు..? అనే వివరాలు లేవు. ఒక భూమిని ఒకరికన్నా ఎక్కువ మందికి అమ్మిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి లేకుండా.. రాబోయే రోజుల్లో బూతద్దం వేసి వెతికినా.. చిన్న తప్పు లేకుండా ఉండేలా ఈ కార్యక్రమం చేపడుతున్నాం.
Read Also : సర్వే రాయి పాతిన సీఎం జగన్ .. చారిత్రక ఘట్టానికి వేదికైన తక్కెళ్లపాడు..
భూ శాశ్వత హక్కు పత్రం ఇస్తాం. భూ సరిహద్దులు, సర్వే వివరాలతో కూడిన మ్యాప్ ఇస్తాం. ప్రతి రెవెన్యూ గ్రామంలో మ్యాప్ ఉంటుంది. ప్రతి ఒక్కరి భూమికి ఒక నంబర్ కేటాయిస్తాం. ఆధార్ లాంటి ఈ నంబర్‌తో ఆ భూమి ఎక్కడ ఉందో కనుక్కొవచ్చు. సర్వే వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో పెడతారు. ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే.. శాశ్వత హక్కు కల్పిస్తూ పత్రాలు ఇస్తాం. ఈ కార్యక్రమం తర్వాత రిజిస్ట్రేషన్ సేవలు కూడా గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి వస్తాయి.
రాష్ట్రంలోని ప్రతి అంగులాన్ని కొలిచే ఈ కార్యక్రమం మూడు దశల్లో జరుగుతుంది. పైసా ఖర్చు రైతుపై పడకుండా.. ప్రభుత్వమే భరిస్తుంది. సర్వే రాళ్లు కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. సర్వే ఆఫ్ ఇండియా, సర్వే, రెవెన్యూ, పంచాయతీ రాజ్, పురపాలక శాఖల సంయుక్తంగా ఈ సర్వేలో పాల్గొంటున్నాయి. 4500 సర్వే బృందాలతో.. 17,600 గ్రామాల్లో సర్వే జరుగుతుంది.
గ్రామ సభల ద్వారా సర్వే విధానాన్ని, షెడ్యూల్‌ను, సర్వే వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తారు. గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శి నేతృత్వంలోని బృందం సర్వే చేస్తారు. ప్రతి స్తిరాస్తిని అక్షాంకాలు, రేఖాంశాల సమాచారంతో కొలుస్తారు. ఈ వివరాలను 9(2) నోటీసు ద్వారా తెలియజేస్తారు. అభ్యంతరాలు గ్రామ సచివాలయంలో తెలియజేస్తే.. ప్రతి మండలానికి ఏర్పాటు చేసే ఒక మేజిస్ట్రేట్ బృందం ఆ సమస్యలను పరిష్కరిస్తుంది. భూ కమతం పటంతోపాటు, గ్రామ భూముల పటం, 1బీ రిజిస్టర్ తదితర వివరాలు నాలుగు చోట్ల ఉంటాయి. వాటిని ట్యాంపర్ చేసే అవకాశం ఎవరికీ ఉండదు.
ఆస్తులు కొనుగోళ్లు, అమ్మకాలు ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పడుతుంది. ఏ రైతు అయినా, యజమాని అయినా.. ల్యాండ్ టైలింగ్ యాక్ట్ ద్వారా భూమి హక్కు పత్రం పొందిన తర్వాత హక్కు లేదని తేలితే.. రాష్ట్ర ప్రభుత్వమే నష్ట పరిహారం ఇస్తుంది. ఈ చట్టం దేశంలో ఎక్కడా లేదు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత.. ఏపీలో భూములు కొంటే.. అది గోల్డ్ స్టాండర్డ్ అని తేలుతుంది. భూములపై ప్రస్తుతం యజమానులకు ఊహాజనిత హక్కులు మాత్రమే ఉన్నాయి. వైఎస్సార్ జగనన్న శాశ్వత హక్కు ద్వారా శాశ్వతమైన, నిజమైన హక్కులు లభిస్తాయి. పారదర్శకత, వివాదాలకు, అవినీతికి ఎక్కడా తావులేకుండా భూ లావాదేవీలు గ్రామాల్లో జరుగుతాయి. వాస్తవంగా ఉన్న భూమి ప్రకారం రికార్డుల తయారవుతాయి. సరిహద్దు తగాదాలు పరిష్కారం అవుతాయి. కొంత మందికి భూమి రికార్డులు ఒక చోట ఉంటే.. అనుభవం మరో చోట ఉంది. ఈ సమస్య పరిష్కారం అవుతుంది. తరతరాల సమస్యలకు పరిష్కారం చూపే కార్యక్రమం ఇది. అంగులాలే కాదు మిల్లీమీటర్లతో సహా కొలుస్తాం. రాబోయే తరాల వారికి, వారసులకు శాశ్వత హక్కులు లభిస్తాయి..’’ అని సీఎం వైఎస్ జగన్ వివరించారు.
ఇది యజ్ఞం లాంటిది. దీనికి ఆటంకాలు కలిగించే దెయ్యాలు, రాక్షసులు ఉన్నారు. ఎల్లో మీడియాను పెట్టుకుని తప్పుడు రాతలు, ప్రసారాలు చేస్తారు. అవన్నీ నమ్మవద్ద’’ని సీఎం జగన్ కోరారు. ప్రజల దీవెనతో ఏర్పడిన తన ప్రభుత్వం ప్రజలకు మంచి మాత్రమే చేస్తుందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
Read Also : ఏపీ చరిత్రలో మరో మైలు రాయికి నేడు నాంధి