iDreamPost
android-app
ios-app

ప్రజల కోసమే ఈ తెగింపు..

  • Published Oct 12, 2020 | 9:37 AM Updated Updated Oct 12, 2020 | 9:37 AM
ప్రజల కోసమే ఈ తెగింపు..

తమకు మేలు కలిగే విషయమైతే ఎంత దాకా అయినా నిలబడతారని వైఎస్‌ కుటుంబంపై ప్రజలకు ఎంతో విశ్వాసం. అందుకే ప్రతిపక్షాలు, ముప్పాతిక శాతం మీడియా గొంతుచించుకుని ఎన్ని రంకెలు వేసినా పట్టించుకోకుండా వైఎస్‌ జగన్‌కు ఏపీ సీయంగా వారు పట్టం కట్టారు. ఇక్కడ అన్ని వయస్సుల పౌరులకు జగన్‌ విషయంలో నచ్చింది ఒకే ఒక్కటంటే అతిశయోక్తి కాదు. అదే ఏటికి ఎదురీదే ఆయన తత్వం. నాయకులు వస్తుంటారు, పోతుంటారు కానీ ప్రజలతో ముడిపడి ఉన్న తన లక్ష్యం నెరవేర్చుకునేందుకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధీరోదాత్తంగా నిలబడగలిగే జగన్‌ పట్ల ప్రజల్లో ఒక ఆరాధ్యభావమే ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మరోసారి అదే లక్షణంతో జగన్‌ ప్రజల మనస్సులు గెల్చుకున్నారు.

ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వానికి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రధానమైనది. ఈ క్రమంలో ప్రభుత్వం చేపట్టే అనేక పనులను ప్రతిపక్షాలు నియంత్రిస్తూ ఉంటే చూస్తు ఊరుకోవడం ఏ సీయంకైనా కుదరనిపని, అందులోనూ ఏటికి ఎదురీదే తత్వమున్న జగన్‌ విషయం చెప్పనే అక్కర్లేదు. పేద ప్రజలకు ఇళ్ళస్థలాలు ఇచ్చి దాదాపు రెండు పుష్కరాలైపోయింది. కనీసం వాళ్ళకు ఇంటి స్థలం ఇద్దామనుకున్నాగానీ కోర్టు కేసుల ద్వారా ప్రతిపక్షం అడ్డుకుంటోంది. ఇదే విధంగా పలు పాలనా పరమైన విషయాల్లో కూడా ప్రతిపక్షం సొంత ప్రయోజనాల కోసం కోర్టు కేసులతో అడ్డుకుంటుంది .

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని సక్రమంగా పనిచేసుకోనీయకుండా ప్రతిపక్షం పెత్తనం చేసే విధంగా కోర్టు లో వెలువడుతున్న పలు నిర్ణయాలపై తన ఉద్దేశాన్ని కుండబద్దలు కొట్టినట్టు లేఖద్వారా చెప్పేసారు. దేశ వ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి కూడా చేయని సాహసాన్ని జగన్‌ చేసారని పలువురు మేథావులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఒకరిద్దరు ముఖ్యనేతలు కోర్టుల అంశంలో వినీ వినపడనట్టు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసారు తప్పితే, ఇలా నేరుగా బైటపడింది మాత్రం ఎవ్వరూ లేరంటున్నారు.

ఇప్పటికే తన సంక్షేమ పాలనతో విభిన్నమైన ప్రాముఖ్యతను దేశ వ్యాప్తంగా పొందుతున్న జగన్‌ ప్రస్తుత అంశంతో మరోసారి జాతీయస్థాయిలో ప్రధాన టాపిక్‌గా నిలిచారు. ప్రజాస్వామ్య, న్యాయవ్యస్థల మధ్య స్వయం నియంత్రణతో కూడిన అధికారాలు ఒకరిపై ఒకరికి సహజంగానే ఉంటాయి. ఇప్పటి వరకు ఇదే తరహాలో వ్యవస్థలు ముందుకు నడిచాయి. కానీ ఒకరిపై ఒకరికి పరిమితికి మించిన జోక్యం చేసుకుంటున్న నేపథ్యంలోనే లేఖల వరకు విషయం చేరింది. ఇది ఒక రకంగా జగన్‌ మొండిధైర్యమన్నా.. ఇంకేమైనాగానీ అనుకోనీయండి కానీ అంతర్లీనంగా ప్రజాప్రయోజనాలు ఉన్నాయడనంలో ఎటువంటి సందేహం లేదు.