iDreamPost
android-app
ios-app

ఎన్పీఆర్‌పై శాసనసభలో తీర్మానము చేస్తాం…

ఎన్పీఆర్‌పై శాసనసభలో తీర్మానము చేస్తాం…

జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్‌)పై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మొదటి సారి స్పందించారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీలపై దేశ వ్యాప్తంగా ఓ వర్గం ప్రజల్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. వీటిని వ్యతిరేకిస్తూ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తాయి. పలు రాష్ట్రాలు ఆయా చట్టాలను అమలు చేయబోమని ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ కూడా ఎన్పీఆర్‌పై తన వైఖరిని వెల్లడించడం విశేషం.

ఎన్పీఆర్‌లో ప్రతిపాదించిన కొన్ని ప్రశ్నలు రాష్ట్రంలోని మైనారిటీల్లో అభద్రతా భావాన్ని కలుగుజేస్తున్నాయని సీఎం జగన్‌ ఆందోళన వెలిబుచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ.. ఎన్పీఆర్‌ఫై తమ పార్టీలో విస్తృతమైన చర్చ జరిగిందని తెలిపారు. ఎన్పీఆర్‌కు సంబంధించి 2010లోని నిబంధనలనే ఇప్పుడు కూడా పాటించాలని తాము కేంద్రాన్ని కోరుతామని సీఎం జగన్‌ తెలిపారు. ఈ విషయంపై అసెంబ్లీలో కూడా తీర్మానం చేస్తామని వెల్లడించారు.

సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా, మద్ధతుగా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. ఇటీవల ఈ అంశాలపై దేశ రాజధాని ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. దాదాపు 46 మంది చనిపోయారు. అంతకు ముందు కర్ణాటక రాష్ట్రంలో కూడా అల్లర్లు జరిగాయి. ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు స్తంభిస్తున్నాయి. అల్లర్లపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. దేశ వ్యాప్తంగా సీఏఏ, ఎన్సీర్సీ, ఎన్పీఆర్‌లపై వ్యతిరేకత వస్తున్నా కూడా వెనక్కి తగ్గేది లేదని కేంద్రం ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేసింది.