iDreamPost
android-app
ios-app

కీల‌క నిర్ణ‌యం వైపు జ‌గ‌న్ అడుగులు

  • Published Mar 17, 2020 | 6:11 AM Updated Updated Mar 17, 2020 | 6:11 AM
కీల‌క నిర్ణ‌యం వైపు జ‌గ‌న్ అడుగులు

జ‌గ‌న్ మ‌రోసారి కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. తాజా పరిణామాల‌తో అప్ర‌మ‌త్త‌మ‌యిన జ‌గ‌న్ ఇలాంటి ప‌రిస్థితి పున‌రావృతం కాకుండా చూసుకోవాల‌న్న సంక‌ల్పానికి వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. కేవ‌లం అధికారం ద‌క్కితే అన్ని చోట్లా తాము అనుకున్న‌ట్టుగా జ‌రిగిపోతుంద‌నే అంచ‌నాల నుంచి ఆయ‌న బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ట్టు చెబుతున్నారు. దానిఇక త‌గ్గ‌ట్టుగా తాజా వ్య‌వ‌హారాన్ని కొలిక్కి తీసుకురావాల‌నే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు.

ఎస్ఈసీకి రాష్ట్ర ప్ర‌భుత్వానికి మ‌ధ్య వ్య‌వ‌హారం ప్ర‌తిష్టంభ‌నగా మారుతోంది. రాజ్యాంగ సంక్షోభం వైపు ప‌రిణామాలు ఉంటాయ‌ని కొంద‌రు భావిస్తున్నారు. కానీ జ‌గ‌న్ మాత్రం దానికి భిన్నంగా చేజారిపోయింద‌నుకున్న విష‌యంలో న‌ష్ట నివార‌ణ కోసం ఏం చేయాల‌నే దానిపై ఆలోచ‌న సాగిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే మాజీ ఎస్ఈసీ ర‌మాకాంత్ రెడ్డిని పిలిచి చ‌ర్చ‌లు జ‌రిపారు. ముఖ్యంగా బ‌డ్జెట్ వ్య‌వ‌హారం, ఎన్నిక‌ల కోడ్ అమ‌ల‌వుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల వంటి విష‌యాల్లో ప‌క్కా నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.

అందుకు త‌గ్గ‌ట్టుగా కేంద్రంలోని కొంద‌రు కీల‌క నేత‌ల‌తో మంత‌నాలు జ‌రిపిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. పార్టీకి చెందిన‌ సీనియ‌ర్ నేత‌ల‌తో కూడా జ‌గ‌న్ చ‌ర్చ‌లు జ‌గ‌న్ , రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం వ్య‌వ‌హారాన్ని సీరియ‌స్ గానే తీసుకోవాల‌ని సంక‌ల్పించిన‌ట్టు క‌నిపిస్తోంది. దానికి అనుగుణంగా నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ మీద రాజ్యాంగ పరిధిలో అవకాశమున్న చర్యలు ఎలా తీసుకోవాలన్న విష‌యాన్ని కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ట్టు చెబుతున్నారు. వాస్త‌వానికి వ‌చ్చే ఏడాదితో ర‌మేష్ కుమార్ ప‌ద‌వీకాలం పూర్త‌వుతుంది. కాబ‌ట్టి ఈ విష‌యాన్ని కాలానికే వ‌దిలేయాలా లేక చ‌ర్య‌లు దిశ‌గా సాగాలా అనే విష‌యంలో చ‌ర్చోప‌చ‌ర్చ‌లు సాగిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఇక ప్ర‌జ‌ల‌కు సంబంధించిన ఇళ్ల ప‌ట్టాల పంపిణీ, ప్ర‌భుత్వ ఆర్థిక వ్య‌వ‌హారాల్లో బ‌డ్జెట్ విష‌యాన్ని ఏమి చేయాల‌నేది కూడా ప్ర‌భుత్వ పెద్ద‌ల్లో కీల‌కాంశంగా మారింది. అందుకు తోడుగా ఇప్ప‌టికే కొంద‌రు అధికారుల‌పై చ‌ర్చ‌ల‌కు ఎస్ ఈ సీ ఇచ్చిన ఆదేశాలు వెన‌క్కి తీసుకునేలా చేసేందుకు ఉన్న మార్గాలు అన్వేషిస్తున్న‌ట్టు చెబుతున్నారు. వాట‌న్నింటితో పాటుగా భ‌విష్య‌త్ లో ఇలాంటి ప‌రిస్థితి ఉత్ప‌న్నం కాకుండా చూసుకోవ‌డానికి అనుగుణంగా వ్య‌వ‌స్థీకృత మార్పుల వైపు మొగ్గు చూపుతున్న‌ట్టు క‌నిపిస్తుంది. ముఖ్యంగా టీడీపీ అనుకూల మోల్స్ గా భావిస్తున్న వ‌ర్గాల మీద ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టాల‌ని, అన్నింటికీ మించి ఇంటిలిజెన్స్ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసుకోవాల‌నే దిశ‌లో ప్ర‌భుత్వ పెద్ద‌ల ఆలోచ‌న సాగుతున్న ద‌శ‌లో ఎలాంటి కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటార‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. వాటి ప్ర‌భావం ఎలా ఉంటుంద‌న్న‌ది చూడాలి.