iDreamPost
android-app
ios-app

ఇది క్లైమాక్స్‌… ఎవరినీ ఉపేక్షించం.. ప్రజలు ఆలోచించాలి : సీఎం జగన్‌

ఇది క్లైమాక్స్‌… ఎవరినీ ఉపేక్షించం.. ప్రజలు ఆలోచించాలి : సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దేవునితో చెలగాటమాడే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోందన్నారు. దేవుడు అంటే భక్తి, భయం లేకుండాపోయిన పరిస్థితి నేడు కనిపిస్తోందన్న సీఎం వైఎస్‌ జగన్‌.. దాడులు చేసే వారుఎవరైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రైవేటు, ప్రతిపక్ష నేతల పర్యవేక్షణలో ఉన్న ఆలయాలపైనే దాడులు జరుగుతున్నాయని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఆలయాలను కూడా వదిలపెట్టకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు.

తిరుపతిలో జరుగుతున్న రాష్ట్ర పోలీస్‌ డ్యూటీ మీట్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ వర్చువల్‌ విధానంలో ప్రసంగించారు. రాష్ట్రంలో రాజకీయ గెరిల్లా యుద్ధం జరుగుతోందని, దీన్ని పోలీసులు అడ్డుకోవాలన్నారు. రాష్ట్రంలో 20 వేల ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా.. దేవాదాయ శాఖ పరిధిలోలేని ఆలయాల్లో దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం జరుగుతున్న ఈ గెరిల్లా యుద్ధాన్ని పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు. ఉద్రేకాలు రెచ్చగొట్టి హింసకు పాల్పడితే ఎవరికి లాభం ఉంటుందని ప్రశ్నించారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో ప్రజలు ఆలోచించాలని సీఎం జగన్‌ విన్నవించారు.

Read Also : ‘బాధ్యులు’ వాళ్ళే..! ఆరోపించేదీ వారే..!!

రాజకీయాల కోసం దేవుళ్లను కూడా వదలని పరిస్థితి చూస్తుంటే.. కలియుగం క్లైమాక్స్‌కు చేరినట్లుగా ఉందని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. దేవుని ద్వారా రాజకీయ లబ్ధి పొందే దారుణమైన పరిస్థితి కలియుగంలో కనిపిస్తోందన్నారు. ప్రజలకు మేలు చేస్తున్నా ఓర్వలేని పరిస్థితి నెలకొందని సీఎం జగన్‌ మండిపడ్డారు. సంక్షేమ పథకాలు ప్రారంభించిన సమయంలోనే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని సీఎం గుర్తు చేశారు. కులం, మతం, పార్టీ అనే భేదాలు లేకుండా 18 నెలలుగా పాలన సాగిస్తున్నామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

Read Also : గవర్నర్‌తో భేటీ కాబోతున్న సీఎం జగన్‌