iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు వేగంగా జరుగుతున్నాయి. అటు పాలనాపరంగానూ, ఇటు రాజకీయంగానూ జగన్ నిర్ణయాలు దానికి దోహదపడుతున్నాయి. ఇప్పటికే పాలన పూర్తిగా మండల కేంద్రాల నుంచి పంచాయతీలకు చేరింది. సచివాలయాలే కేంద్రంగా అనేక వ్యవహారాలు చురుగ్గా సాగుతున్నాయి. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలు కూడా జోరందుకున్నాయి. ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా లబ్దిదారులకు చేరేందుకు ఉపయోగపడుతోంది. అదే సమయంలో రాజకీయంగానూ కొత్త శక్తులను ప్రోత్సహించే ప్రయత్నం సాగుతోంది. ఇప్పటికే క్యాబినెట్ కూర్పు, ఎమ్మెల్యేల ఎంపికలో జగన్ అదే పంథా పాటించారు. బలమైన నేతలకు బదులుగా భవిష్యత్తుకి ఉపయోగపడే ఆలోచనతో యువతను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మంత్రిమండలిలో అరడజను మంది 40 ఏళ్ల లోపు వారే ఉన్నారంటే ఆశ్చర్యపడాల్సి ఉంటుంది.
ఇక రాజ్యసభ సభ్యుల ఎంపికలోనూ గతంలో ఎన్నడూ ప్రాతినిధ్యం దక్కని కులాలకు పెద్ద పీట వేశారు. శెట్టిబలిజ, మత్స్యకార కులస్తులు మొట్టమొదటిసారి పార్లమెంట్ ఎగువ సభలో అడుగుపెట్టడం అందుకు నిదర్శనం. వాటిని కొనసాగిస్తూ మునిసిపల్ పీఠాలపై మహిళలు, బీసీలకు ప్రాధాన్యతనిచ్చారు. తొలిసారిగా మూడొంతుల సీట్లు రిజర్వుడు కేటగిరీ వారికే ఇవ్వడం విశేషం. విజయవాడ వంటి నగరాల్లో జనరల్ సీట్లలో కూడా బీసీలను ప్రోత్సహించడం అందులో భాగమే. ఇక ఇప్పుడు మండల, జిల్లా పరిషత్ పీఠాలపై దృష్టి పెట్టారు. సామాజిక సమీకరణాలతో కొత్త మార్పులకు పునాది వేస్తున్నారు. ఒకే సామాజికవర్గ పెత్తనం కాకుండా అందరికీ అవకాశం ఇచ్చేలా ప్రయత్నాలు ప్రారంభించారు.
ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనూ ఎంపీపీ పీఠాలను ఎమ్మెల్యే కులస్తులకు కాకుండా ఇతరులకు అవకాశం ఇవ్వాలని వైఎస్సార్సీపీ నిర్ణయించడం అనూహ్యమనే చెప్పాలి. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో కులం పెత్తనం చేస్తున్న తరుణంలో ఆయా కులస్తులు కాకుండా ఆ తదుపరి ఎక్కువ మంది ఉండే సంఖ్యాకులకు మండలాధీశులుగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించడం ఓ సంచలనంగానే చెప్పాలి. ఇది రాజకీయంగా పలు మార్పులకు దారితీస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒకే కులం పెత్తనాన్ని చేధించేందుకు మండల స్థాయిలో కొత్త నాయకత్వాన్ని బలపరిచేందుకు మేలు చేస్తుందని చెబుతున్నారు. సుదీర్ఘకాలంగా రాజకీయంగా అన్ని పదవులు తమ చేతుల్లో పెట్టుకునే సెక్షన్ కి చెక్ పెడుతూ జగన్ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా అందరికీ సమాన అవకాశాలకు కలిగించేలా ఉందని భావిస్తున్నారు
ఇటు పాలనాపరంగా, ఇటు రాజకీయంగానూ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో రాబోయే కొన్నేళ్ళలో ఏపీలో అనేక మంది నయా రాజకీయ నేతలు ఆవిర్భవించే అవకాశం ఉంది. ఎన్నడూ అవకాశం ఊహించని వర్గాల నుంచి కొత్త తరం ఎదిగేందుకు దారి ఏర్పడుతోంది. ఇది రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు.
Also Read : జగన్‌కు అంత క్రేజ్..! అందుకేనా..?