iDreamPost
android-app
ios-app

మాఫియాపై దూకుడు పెంచిన జగన్, ఎస్ ఈ బీ అస్త్రంతో చెక్ పెట్టే యత్నం

  • Published May 15, 2020 | 1:23 PM Updated Updated May 15, 2020 | 1:23 PM
మాఫియాపై దూకుడు పెంచిన జగన్,  ఎస్ ఈ బీ  అస్త్రంతో చెక్ పెట్టే యత్నం

ఏపీలో గత ప్రభుత్వ హయంలో ఇసుక , లిక్కర్ మాఫియా చెలరేగిపోయింది. ఈ విషయాన్ని ప్రజలు కూడా నిర్ధారించారు. దాంతో చివరకు బెల్ట్ షాపుల ద్వారా ఇంటింటికీ మద్యం అందుబాటులో ఉంచిన నాటి బాబు ప్రభుత్వం, ఇసుకను మాత్రం ప్రజలకు దక్కకుండా కొందరు బడాబాబుల ద్వారా పెద్ద స్థాయిలో తవ్వకాలు సాగించిన తీరు ప్రజల్లో వ్యతిరేకతకు కారణం అయ్యిందని చెప్పక తప్పదు . చివరకు ఇసుక తవ్వకాల్లో అడ్డగోలుగా వ్యవహరించి ఎన్జీటీ ద్వారా 100 కోట్ల రూపాయల జరిమానా కట్టే దశకు ప్రభుత్వం చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన జగన్ తన మార్క్ పాలనకు శ్రీకారం చుట్టారు. ఇసుక, లిక్కర్ విషయంలో పగడ్బందీగా వ్యవహరిస్తున్నారు. తాను చెప్పిన దానిని అమలు చేసేందుకు పూనుకున్నారు. ఆ క్రమంలో తొలినాళ్లో కొన్ని అడ్డంకులు వచ్చినా అధిగమించేందుకు పూనుకున్నారు. ఇసుక కొరత కారణంగా ఏర్పడిన సమస్యలను తీర్చి, ఇసుక , లిక్కర్ మాఫియాకు చెక్ పెట్టే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది.

అయినప్పటికీ జగన్ ఎంత ఉన్నత ఆశయాలతో సాగుతున్నప్పటికీ అనేక చోట్ల మాఫియా మళ్ళీ వేళూనుకుంటున్న తీరు అలజడి రేపుతోంది. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా వ్యవహారాలు చక్కదిద్దిన వాళ్లే ఇప్పుడు మళ్లీ కొత్త ఎమ్మెల్యేల చెంతన చేరి కొన్ని చోట్ల హద్దులు దాటుతున్నారు. అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. సీఎం లక్ష్యాలకు విరుద్ధగా వ్యవహరిస్తున్నారు. అనేక చోట్ల అక్రమ తవ్వకాలు, అమ్మకాలు సాగుతున్న తీరు పట్ల సీఎం చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలుకావడం లేదనే అభిప్రాయానికి జగన్ వచ్చారు. అదే సమయంలో లిక్కర్ విషయంలో సారా సహా ఇతర మార్గాల్లో సమస్యలు పెరుగుతుండడ సీఎం దృష్టికి వచ్చింది. ఈ పరిస్థితుల్లో జగన్ దూకుడు పెంచారు. మాఫియా కట్టడికి కొత్త మంత్రం జపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా పోలీస్ యంత్రాంగంలోనే కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు.

జగన్ తన ఆలోచనలకు పదును పెడుతూ మాపియా కట్టడి కోసం కొత్త శాఖను సిద్దం చేశారు. ఆ మేరకు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో రంగంలోకి వచ్చింది. ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ సహా పలు విభాగాలు ఉన్నప్పటికీ ఎస్ ఈ బీ ని తెరమీదకు తీసుకురావడంలో జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. దాని ద్వారా ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారాలు దాదాపుగా పరిమితం చేసేశారు. ఈ నిర్ణయంతో ఎక్సైజ్ శాఖలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన అవినీతి తిమింగలాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టుగా అంతా భావిస్తున్నారు. ఇక విజిలెన్స్ శాఖలో కూడా ప్రక్షాళన ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో సీఎం ఆలోచనలకు భిన్నంగా సాగుతున్న కొందరు ఎమ్మెల్యేలు, ఇతర నేతల వ్యవహారాలను కూడా సహించేది లేదని సీఎం పరోక్షంగా సంకేతాలు పంపినట్టు భావిస్తున్నారు. ఇటు అధికార యంత్రాంగంలోనూ , ఇటు రాజకీయ నేతల్లోనూ జగన్ ఎస్ ఈ బీ ద్వారా కలకలం రేపుతున్నట్టుగానే చెప్పవచ్చు.

అన్నింటికీ మించి ప్రజలకు పూర్తి స్థాయి ప్రయోజనాలు దక్కడమే లక్ష్యంగా యువ ఐపీఎస్ లకు జిల్లాల్లో ఎస్ ఈ బీ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే వివిధ చోట్ల మంచి గుర్తింపు సాధించిన అధికారులకు ఆధ్యతలు అప్పగించారు. తద్వారా నేతలు ఎంతటి వారయినప్పటికీ మాఫియాలను చెల్లుబాటు కానివ్వకుండా చూడాలనే లక్ష్యంతో వారిని ఎంపిక చేసినట్టు కనిపిస్తోంది. ఇక తాజాగా డీజీపీ కూడా వారితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే ఆయా జిల్లాల్లో బాధ్యతలు స్వీకరించిన ఎస్ ఈ బీ అధికారులకు హితబోధ చేశారు. ఇసుక, లిక్కర్ మాఫియాల ఆటకు చెక్ పెట్టేందుకు సన్నద్ధం కావాలని ఆదేశించారు. వారికి అనుగుణంగా సిబ్బంది, కార్యాలయం ఏర్పాటునకు చొరవ తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఎక్సైజ్ శాఖలోని క్షేత్రస్థాయికి చెందిన అత్యధిక సిబ్బందిన ఎస్ ఈ బీ పరిధిలోకి తెచ్చారు. తద్వారా ప్రభుత్వ లక్ష్యాలను సాధించే క్రమంలో జగన్ మరో సారి చొరవ ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తోంది. రెవెన్యూ, పంచాయితీరాజ్ సహా పలు శాఖల్లో మార్పులు తీసుకొచ్చిన తాజాగా పోలీస్, ఎక్సైజ్ శాఖల్లోనూ సమూల మార్పుల ద్వారా ముందడుగు వేస్తున్నట్టు చెబుతున్నారు. సీఎం అయిన తొలినాళ్లోల ఆయన ఊహించిన దానికి తాజాగా దిగువ స్థాయి అనుభవాలను గమనంలో ఉంచుకుని తీసుకొస్తున్న ఈ మార్పులు ఏపీలో పాలనా పరమైన పెద్ద మార్పులకు దోహదపడే అవకాశం ఉంటుందనే అశాభావం వ్యక్తం అవుతోంది.