Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హస్తిన పర్యటన కొనసాగుతోంది. ఈ రోజు రెండో రోజు ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో భేటీ కాబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రవిశంకర్‌తో సీఎం జగన్ సమావేశమవబోతున్నారు. నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ రాత్రి తొమ్మిదిన్నరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన విషయం తెలిసిందే.
పోలవరం, మండలి రద్దు, నిధులు, రెవెన్యూ లోటు.. తదితర 11 అంశాలపై సీఎం హస్తిన పర్యటన సాగుతున్నా.. ప్రధాన లక్ష్యం మాత్రం మూడు రాజధానుల ఏర్పాటుపైనే అన్నది పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర సమతుల అభివృద్ధి కోసం మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే కృతనిశ్చయంతో వైఎస్ జగన్ సర్కార్ ఉంది. ఇందుకు మండలి రూపంలో చిన్నపాటి అడ్డంకి ఏర్పడింది. ఈ అడ్డంకిని తొలగించుకునేందుకు ఇప్పటికే అవసరమైన మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించింది. ప్రస్తుతం అది కేంద్రం వద్దకు చేరింది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే మండలి రద్దు బిల్లు ఆమోదించుకునేందుకు సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా మూడు రాజధానులు ఏర్పాటుకు ఉన్న అడ్డంకిని అధిగమించేందుకు పావులు కదుపుతున్నారు.
విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ సర్కార్ సంకల్పించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టు అమరావతిలో ఉంది. దీన్ని ఇక్కడ నుంచి కర్నూలుకు తరలించాలి. ఇందు కోసం కేంద్ర న్యాయశాఖ, సుప్రిం, ఆపై రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి. అందుకే ఈ విషయాన్ని సీఎం జగన్ నిన్న హోం మంత్రి అమిత్ షా వద్ద ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ అంశంపైనే మరికొద్ది సమయంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తోనూ సీఎం జగన్ భేటీ కాబోతున్నారు. బుధవారం సీఎం జగన్ ప్రధానితో సమావేశమైన విషయం విధితమే.