ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా ఉంటాయనే విషయం అందరికి తెలిసిందే. దేశంలో ఎక్కడ లేని విధంగా ఏపీ రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. నిత్యం అధికార, ప్రతి పక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. ఇటీవల ప్రతి పక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. సీఎం జగన్ పై, ఆయన పరిపాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అలానే సీఎం జగన్ కూడా వివిధ కార్యక్రమాల సందర్భంగా వారిద్దరిపై మాటల బాణాలు వదులుతుంటారు. తాజాగా కురుపాంలో జరిగిన అమ్మ ఒడి నిధుల విడుదల కార్యక్రమంలో కూడా సీఎం జగన్…చంద్రబాబు,పవన్ లపై ఫైర్ అయ్యారు.
బుధవారం ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా.. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్.. అమ్మ ఒడి నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ.. చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కల్యాణ్‌పైనా మండిపడ్డారు. ప్రజలకు ఇంత మంచి చేస్తుంటే.. చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని, అబద్ధాలు.. మోసాలతో మళ్లీ ప్రజలను మభ్యపెట్టేందుకు వస్తున్నాడని సీఎం అన్నారు.
ఇక సీఎం మాట్లాడుతూ..” చంద్రబాబు.. తన 45 ఏళ్ల రాజకీయంలో ఏనాడూ మంచి గురించి ఆలోచించలేదు. టీడీపీని తినుకో.. దండుకో.. పంచుకోగా అనేలా మార్చేశారు. దోచుకున్న సొమ్ముతో వాళ్లు బొజ్జలు పెంచుకున్నారు.14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏ మంచీ చేయని ఈ బాబు, ఏ ప్రాంతానికీ ఏ మంచీ చేయని ఈబాబు, ఏ సామాజిక వర్గానికీ కూడా ఏ మంచీ చేయని బాబు. ఎలక్షన్లకు ముందు మేనిఫెస్టో పుస్తకం తెస్తారు. దానిని నమ్మి ప్రజలు ఓటు వేసి అధికారం ఇస్తే.. ఆ మేనిఫెస్టోను చెత్త బుట్టలో పడేస్తారు. ఇదీ వాళ్ల ట్రాక్ రికార్డు. ఇదే బాబు.. మరోసారి అధికారం ఇవ్వండంటూ మరో మేనిఫెస్టోతో మళ్లీ మోసం చేయడం ప్రారంభించారు. ఈసారి డ్రామాలకు కొంచం రక్తి కట్టించారు. ప్రతి ఇంటికీ కిలో బంగారం, బెంజ్ కారంటూ మోసం చేసే దానికి ఒక హద్దులు లేకుండా పోయాడు. జగన్ కంటే కాస్త ఎక్కువ చెప్పాలని మోసం చేయడంలో రక్తి కట్టిస్తున్నాడు” అంటూ చంద్రబాబుపై సీఎం ఫైర్ అయ్యారు.
ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విరుచకు పడ్డారు. “చంద్రబాబుకు ఓ దత్తపుత్రుడు ఉన్నాడు. ఆ పుత్రుడు 2014లోనూ చంద్రబాబుకు మద్దతు ఇచ్చాడు. మరి ఆ తర్వాత చంద్రబాబు చేసిన మోసాన్ని ఎందుకు ప్రశ్నించలేదు. ఆ ప్యాకేజీ స్టార్.. వారాహి అనే ఓ లారీ ఎక్కి ఊగిపోతూ తనకు నచ్చనివారిని.. చెప్పుతో కొడతానంటూ, తాట తీస్తానంటూ ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. ఆ మనిషి నోటికి అదుపు లేదు, నిలకడా లేదు. వారిలా నలుగురు నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్లకోసారి భార్యనూ మార్చలేం. ఆ దత్తపుత్రుడిలా తొడలు కొట్టలేం.. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ బూతులు తిట్టలేం. అవన్నీ వారికి చెందిన పేటెంట్” అంటూ పరోక్షంగా పవన్ పై విమర్శలు చేశారు. మరి.. సీఎం చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.