iDreamPost
android-app
ios-app

ఈ గవర్నర్ మాకొద్దు… బాబోయ్!

ఈ గవర్నర్ మాకొద్దు…  బాబోయ్!

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత అప్రతిష్ట పాలై, వివాదాస్పద వ్యవస్థగా మారిన రాజ్యాంగ వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఒక గవర్నర్ వ్యవస్థ మాత్రమే. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా మారి ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్న నాయకులను కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు రాష్ట్ర గవర్నర్ గా నియమించడంతో వారు తమ పార్టీ రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ పూర్తి మెజారిటీ సాధించకుండా హంగ్ ఏర్పడినప్పుడు గవర్నరు తన విచక్షణ అధికారాన్ని ఉపయోగిస్తూ ముఖ్యమంత్రి నియామకం చేపడతారు.

మొన్న కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ మరియు జనతాదళ్ (సెక్యులర్) పార్టీలు కూటమిగా ఏర్పడి తమకు బలం ఉందని గవర్నర్ కి విన్నవించుకున్నప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపి నాయకుడు యడ్యూరప్పకు అవకాశం ఇవ్వడం తర్వాత అసెంబ్లీలో తనకు బలం లేదని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయటం విదితమే. నిన్నటి మహారాష్ట్ర వ్యవహారంలో కూడా రాత్రికి రాత్రే బిజెపి నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ తో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించిన మూడు రోజులకే సుప్రీంకోర్టు తీర్పుతో బలపరీక్ష నిరూపణకు సిద్ధపడాల్సి రావటంతో అసెంబ్లీకి వెళ్లకుండానే తన పదవికి రాజీనామా చేయడంతో గవర్నర్ వ్యవస్థ మరొకసారి అపహాస్యం పాలయ్యింది.

కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది గవర్నర్లు తమ రూటు మార్చి మంత్రి మండలి నిర్ణయాల అమలులో జోక్యం చేసుకుంటూ విపక్ష పార్టీల నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పాలు చేస్తున్నారు.కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా లేదనే నెపంతో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పని చేయకుండా ఇబ్బంది పెడుతున్న సందర్భంలో సుప్రీంకోర్టు చీవాట్లతో లెఫ్టినెంట్ గవర్నర్ వెనక్కి తగ్గారు.

ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బిజెపి పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో ఉండి, ఆ రాష్ట్రంలో ఓటమి చెందిన తరువాత మరో కేంద్రపాలితమైన పుదుచ్చేరి గవర్నర్ గా నియమించబడిన కిరణ్ బేడి గారు ముఖ్యమంత్రి వి. నారాయణస్వామి నాయకత్వంలో మంత్రిమండలి తీసుకున్న ప్రతి నిర్ణయం అమలులో జోక్యం చేసుకుంటూ ఇబ్బంది పెడుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి స్వయంగా కిరణ్ బేడీను పుదుచ్చేరి గవర్నర్ గా తొలగించాలని రాష్ట్రపతికి నేరుగా ఫిర్యాదు చెయ్యడం రాజకీయవర్గాలలో పెను దుమారం లేపింది. స్వతంత్ర భారతంలో మునుపెన్నడూ జరగని విధంగా ఒక ముఖ్యమంత్రి తమ రాష్ట్ర గవర్నర్ ను తొలగించమని రాష్ట్రపతిని కోరడం సంచలన విషయంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.