Idream media
Idream media
రెండు నెలలుగా సినిమా థియేటర్లు లేవు. కరోనా ఇప్పుడే వెళ్లదు. ఒకవేళ వెళ్లినా మళ్లీ జనం వస్తారో లేదో తెలియదు. అంటే ఊళ్లలోని అనేక థియేటర్లు మూతపడుతాయి. అవి కల్యాణ మంటపాలుగానో, లేదా సరుకుల గోడౌన్లగానో మారిపోతాయి. షాపింగ్ కాంప్లెక్స్‌లు, అపార్ట్‌మెంట్లగా రూపం మార్చుకుంటాయి. జనం , సందడి , కలలు , ఎమోషన్స్ అన్నీ మాయమై కేవలం మనుషులు తిరిగే ఒకచోటుగా మిగిలిపోతాయి. థియేటర్ కూలిపోయినా జనం మాత్రం ఆ సెంటర్‌ని థియేటర్ పేరుతోనే పిలుస్తారు.
ఒకప్పుడు థియేటర్ యజమాని అంటే గౌరవం, హోదా. ఇపుడు బరువు. మా ఊళ్లో శీనయ్య అనే ఆయన కిరాణా కొట్టులో బాగా సంపాదించాడు. ఒక స్టూల్ మీద కూర్చొని రెండు చేతులతో, నలుగురు గుమాస్తాలతో వ్యాపారం చేసేవాడు. ఆయనకి సినిమాలంటే ఇష్టం. కొట్టుని కొడుకుకి వదిలేసి థియేటర్‌ని లీజుకి తీసుకున్నాడు. సాయంత్రం అయితే థియేటర్ కాంపౌండ్‌లో కుర్చీలేసుకుని వచ్చిపోయే ప్రేక్షకుల్ని ఆనందంగా చూసేవాడు. టికెట్ల కోసం జనం కొట్టుకుంటుంటే ఒకటే సంతోషం. కొట్టులో సంపాదించిందంతా థియేటర్‌లో పోగొట్టాడు.
థియేటర్ కడుతున్నప్పుడు కొన్ని వందల మంది పనిచేస్తారు. అదో ఉత్సవంలా ఉంటుంది. ఎంతో మంది మేస్త్రీలు , వడ్రంగుల కల అది. అడవిలో పక్షులకి జోలపాట పాడే ఎన్నో వృక్షాలు ఇక్కడ కుర్చీలు, బెంచీలుగా మారుతాయి. జనం ఎక్కడ మూగితే అక్కడ బతుకుంటుంది. కూలీల కోసం ఒక టీ కొట్టు, సిగరెట్ల అంగడి , టిఫెన్ బండి వస్తాయి. జీవించడం ఎలాగో జీవితమే నేర్పుతుంది. కూలీల్లో ఒక తుంటరి కుర్రాడు ఉంటాడు. బండి మీద దోశలు పోసే అమ్మాయి కూడా ఉండే ఉంటుంది. సినిమా కథ కంటే ముందే వీళ్ల ప్రేమ కథ ప్రారంభమవుతుంది. సినిమాలో రియాల్టీ లేకపోవచ్చు. రియల్ లైఫ్‌లో సినిమాకి మించిన డ్రామా ఉంటుంది.
థియేటర్ ప్రారంభం నాటికి వీళ్లెవరూ ఉండరు. మడత నలగని తెల్ల చొక్కాతో ఒక నాయకుడు వచ్చి రిబ్బన్ కట్ చేస్తాడు. గేట్‌కీపర్లు , స్వీపర్లు, ఆపరేటర్లు , బుకింగ్ క్లర్కులు ప్రత్యక్షమవుతారు.
వర్షం వచ్చినప్పుడు వచ్చే రెక్కల పురుగుల్లా జనం వస్తారు. తెర మీద బొమ్మ కనిపిస్తే విజిళ్ల వాన.
కలలు కలర్‌లో ఉండవు. బ్లాక్ అండ్ వైట్‌లోనే ఉంటాయి. కలలో ప్రేక్షకుడు మనమే, పాత్రధారి మనమే.
ఎన్టీఆర్ మాంత్రికుడితో యుద్ధం చేస్తుంటే ఆ హీరో మనమే. ఏఎన్ఆర్ విషాద గీతం పాడుతుంటే ఆ పాట మనమే. కృష్ణ చేతిలో తుపాకీగా , శోభన్ చేతిలో కొరడాగా మారిపోతాం.
అమ్మాయిలు జయలలిత ముక్కుపుడకగా , వాణిశ్రీ చీరగా మారిపోయి కలల రాకుమారుడి కోసం వెతుక్కుంటారు. ప్రతి యువరాణికి ఒక యువరాజు ఉంటాడు. అది ప్రకృతి సెటప్.
జీవితంలోని డొల్లతనం, నిరాశ, ఆకలి, పేదరికం అన్నీ మరిపించే మ్యాజిక్ బాక్స్ థియేటర్. కుండలు చేసే కుమ్మరికి కూడా కత్తి పట్టుకునే ఎమోషన్ ఇస్తుంది. పగలంతా బస్తాలు మోసిన కష్టజీవికి పగలబడి నవ్వే కామెడీ అందిస్తుంది. థియేటర్ గోడలు కొన్ని వేల మంది కన్నీళ్లతో తడుస్తాయి. ప్రేమ కథలతో మెరుస్తాయి. ప్రేక్షకుల్ని చూసి ఫ్యాన్ కూడా ఆనందంతో రాగం తీస్తూ తిరుగుతుంది. ప్రేక్షకులు లేకపోతే అది ఒక నిశ్శబ్ద ఇనుప వస్తువు మాత్రమే.
ఫోన్లు లేని కాలంలో ప్రేమికులు చూసుకోడానికి , కలుసుకోడానికి క్షణకాలం పాటు కాఫీ షాప్‌లు ఈ థియేటర్లే.
మా ఇంట్లో పనిచేసే లక్ష్మికి సినిమాలంటే పిచ్చి. ఆత్మీయులు అనే సినిమాకి నన్ను భుజం మీద ఎత్తుకుని వెళ్లింది. మొదటి సీన్‌లో గుమ్మడి తల పగిలిపోతుంది. నన్ను కూడా కొడతారని నేను గావు కేకలు పెట్టాను. అది భరించలేక నన్ను ఇంటికి తెచ్చేసింది. వస్తూ వస్తూ కోపంతో రెండు మొటిక్కాయలు వేసింది. ఆ విషయం ఇంట్లో చెప్పకుండా ఉండటానికి చాక్లెట్లు కొనిపెట్టింది. నాకు చాక్లెట్లే గుర్తున్నాయి. మొటిక్కాయలు గుర్తు లేవు.
హీరోలాంటి మొగుడొస్తాడని లక్ష్మి కలలు కనింది. పేదవాడైన తండ్రి రెండో పెళ్లి వాడికి ఇచ్చి చేశాడు. లక్ష్మి దుక్కపడలేదు. జీవితాన్ని మరిచిపోవడానికి ఆమెకు సినిమా ఉంది. కర్నాటకలోని మారుమూల ఊళ్లో మొగుడితో కలిసి కంకర కొడుతూ చాలా కాలం జీవించి ఉండటానికి అక్కడున్న సినిమా టెంటే కారణం.
చిన్నప్పుడు తెరమీద బొమ్మ కనిపిస్తే పిచ్చి కేకలతో అందరినీ హడలకొట్టిన నేను , తర్వాత సినిమా పిచ్చోడిగా మారిపోయాను. అదే జీవితంలోని ట్విస్ట్.
స్కూల్, ట్యూషన్ కాకుండా నా బాల్యాన్ని ఎక్కువగా మింగేసిన అజీజియా థియేటర్‌ని ఈ మధ్య కూల్చేశారని తెలిసింది. ఎన్టీఆర్ ఒక పిచ్చి గౌన్, టైట్ ప్యాంట్ వేసుకుని , వూచలాంటి కత్తిని సక్‌సక్‌మని తిప్పితే గంతులేసింది అక్కడే. కృష్ణ రివాల్వర్ పేల్చితే, నా చేతి వేళ్లని గన్‌లా పట్టుకుని పొగ ఊదింది కూడా అక్కడే. తొలిసారిగా బీడి పీల్చి ముకేశ్ కంటే ఎక్కువ దగ్గింది, జగమే మాయ అనే హారర్ సినిమా చూసి చలి జ్వరం తెచ్చుకుంది కూడా అక్కడే.
అన్నీ జ్ఞాపకాలే. మనుషుల్లాగే థియేటర్లకి కూడా ఎక్స్‌ఫైరీ డేట్ ఉంటుంది. బాల్యం గుర్తులు మనసులో ఉంటాయి. భూమి మీద ఉండవు. కరోనా తర్వాత చాలా థియేటర్లు ల్యాండ్ మార్క్‌లుగా మిగిలిపోతాయి. అయినా మనషులు కలలు కంటూనే ఉంటారు. కలల్ని పొదుగుతూనే ఉంటారు. గూడు మారుతుంది అంతే!
జీవితానికి రంగులద్దిన థియేటర్లు కూలిపోతాయి. ధ్వంసమవుతాయి. కానీ మనం జీవించినంత కాలం బతికే ఉంటాయి.