iDreamPost
android-app
ios-app

థియేటర్లలో పాత మెగా సినిమాల సందడి

  • Published Aug 16, 2022 | 4:54 PM Updated Updated Aug 16, 2022 | 4:54 PM
థియేటర్లలో పాత మెగా సినిమాల సందడి

రీ రిలీజ్ లో పోకిరి ర్యాంపేజ్ చూశాక పాత సినిమాలు మళ్ళీ థియేటర్లకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. దానికొచ్చిన రెస్పాన్స్ కేవలం ఫ్యాన్స్ నుంచే కాక మూవీ లవర్స్ నుంచి కూడా తోడవ్వడంతో అప్పుడప్పుడు వీటిని వేస్తే మంచి ఫలితాలొస్తాయని అర్థమైపోయింది. ఇప్పుడు ఇతర హీరోల అభిమానులు రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 2 జల్సాని 500 స్క్రీన్లలో ప్రీమియర్ చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రీ మాస్టర్ ప్రింట్ తో ఫోర్ కె రెజోల్యూషన్ ని జోడిస్తున్నారు. యుట్యూబ్ అఫీషియల్ గీతా ఆర్ట్స్ ఛానల్ లోనే ఇది అందుబాటులో ఉంది. అలాంటిది మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు ఇంతగా ఎదురు చూడటం అంటే విశేషమే. ఆల్రెడీ ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేశారు.

దీనికన్నా ముందు ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఘరానా మొగుడుని దించబోతున్నారు. 1992లో వచ్చిన ఈ మెగా బ్లాక్ బస్టర్ టాలీవుడ్ లో మొదటి 10 కోట్ల గ్రాసర్. అప్పటిదాకా ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టి ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోయింది. తమిళ మన్నన్ రీమేక్ అయినప్పటికీ దర్శకులు రాఘవేంద్ర రావు తీర్చిదిద్దిన తీరుకి వసూళ్ల వర్షం కురిసింది. నగ్మా గ్లామర్, కీరవాణి పాటలు, మసాలా అంశాలు, అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ వెరసి అప్పట్లో ఇది పైసా వసూల్ మూవీ. దీన్ని సరికొత్త రూపంలో ఈ నెల 21న తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ చేయబోతున్నారు. తమ హీరో పుట్టినరోజు కన్నా బెస్ట్ అకేషన్ వాళ్ళకైనా ఏముంటుంది.

మొత్తానికి ఒకప్పుడు రీ రిలీజుల ట్రెండ్ జోరుగా సాగినట్టు మళ్ళీ ఆ రోజులు రావడం సంతోషమే. అయితే ఎన్నేళ్లు ఈ సందడి కొనసాగుతుందన్నది చూడాలి. వినడానికి బాగానే ఉంటుంది కానీ వీటికి ప్రాక్టికల్ గా చాలా సమస్యలు ఖర్చులు ఉంటాయి. రీ మాస్టరింగ్ తో పాటు క్యూబ్ లో అప్లోడ్ చేయడం, సౌండ్ మొత్తం చెక్ చేయించడం, కలర్ గ్రేడింగ్ ఇలా వ్యయం ఎక్కువగానే ఉంది. ఒకప్పుడంటే బాక్సుల్లో వచ్చే రీళ్లు ఉండేవి కాబట్టి ఒకే ప్రింట్ అరిగిపోయే దాకా ఊళ్లు తిరిగేది. కానీ ఇప్పుడలా కాదు. టెక్నాలజీ పుణ్యమాని మొత్తం మారిపోయింది. ఏది ఏమైనా పాత జ్ఞాపకాల్లోకి టైం ట్రావెల్ చేయించే ఇలాంటి ఓల్డ్ ప్రీమియర్ల జమానా రావడం మంచిదే.