వాతావరణం చల్లగా మారినా సరే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు నాటకీయంగా వేడెక్కాయి.. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ తో రాజకీయ వేడి రాజుకుంది. ఈఎస్ఐ కుంభకోణం అవినీతి ఆరోపణలపై అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడుకి మద్దతుగా టీడీపీ నాయకులు నిరసనలు తెలియజేస్తున్నారు.
తాజాగా చింతమనేని ప్రభాకర్ ఏలూరులో అచ్చెన్నాయుడు అరెస్ట్ కి నిరసనగా నిరసన వ్యక్తం చేశారు. తన కార్యకర్తలతో కలిసి ఏలూరులో నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నం చేస్తుండగా పోలీసులు రంగ ప్రవేశం చేసి చింతమనేని ప్రభాకర్ ని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని నినాదాలు చేశారు. చింతమనేనితో పాటు ఆయన అనుచరులని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాకీల రాజ్యం నడుస్తుందని చింతమనేని తెలిపారు.
కాగా ఏలూరులో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కానీ చింతమనేని ప్రభాకర్ పార్టీ కార్యకర్తలు మరియు అనుచరులతో నిరసన వ్యక్తం చేయడంతో ప్రజలు పెద్దమొత్తంలో గుమిగూడే అవకాశం ఉండడంతో చింతమనేనిని అరెస్ట్ చేశారు.