iDreamPost
android-app
ios-app

థియేటర్ల ఓపెనింగ్ కి ‘చైనా’ ఫార్ములా

  • Published Apr 01, 2020 | 4:54 AM Updated Updated Apr 01, 2020 | 4:54 AM
థియేటర్ల ఓపెనింగ్ కి ‘చైనా’ ఫార్ములా

కరోనా మూలాలు చైనాలో మొదలయ్యాయన్నది జగమెరిగిన సత్యం. ఏ దేశం నుంచి ఎక్కడికి పాకిందన్నది పక్కన పెడితే ఇప్పుడు ఆ దేశం కోలుకుని మిగిలిన ప్రపంచమంతా తల్లడిల్లుతోంది. క్రమక్రమంగా చైనాలో జనజీవనాన్ని ఓ కొలిక్కి తెస్తున్నారు. కొన్ని చోట్ల థియేటర్లు కూడా మొదలుపెట్టారు. కాకపోతే వాటిలో కొత్త సినిమాలు వేసే ఛాన్స్ లేదు కాబట్టి ప్రస్తుతానికి పాతవాటితో సర్దుతున్నారు. కాకపోతే సీటింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పక్కపక్కనే కూర్చునే ఛాన్స్ లేకుండా సీటింగ్ కెపాసిటీకి మొత్తం టికెట్లు అమ్మకుండా ప్రేక్షకుల మధ్యలో కనీసం ఐదారడుల గ్యాప్ ఉండేలా మధ్యలో ఖాళీ సీట్లు వదలబోతున్నారు . అంటే డిమాండ్ ఉన్నా కూడా మొత్తం హౌస్ ని ఫుల్ చేయరు. ఎలాగూ ప్రపంచవ్యాప్తంగా కొత్త మూవీస్ రిలీజులు ఆగిపోయాయి కాబట్టి కొన్నాళ్ళు ఈ ప్రయోగం వర్క్ అవుట్ అయ్యేలా కనిపిస్తోంది. ఒకవేళ వచ్చే నెల లేదా మేలో సినిమా హాళ్ళు ఓపెన్ చేయాల్సి వస్తే ఇండియాలో ఇదే తరహా ఫార్ములా పాటించే ఆలోచనలో అసోసియేషన్ ఉందట.

జనం సర్దుకుని తిరిగి సినిమాలు చూసే మూడ్ లోకి రావడానికి ఎలాగూ కొంత టైం పడుతుంది. ఆలోగా ఇంతకు ముందు ఫుల్ రన్ పూర్తి చేసుకోలేక అర్ధాంతరంగా డ్రాప్ అయిన భీష్మ, మధ లాంటి సినిమాలను కంటిన్యూ చేస్తారు. పబ్లిక్ రాకపోయినా పర్లేదు. వచ్చిన అరకొర ప్రేక్షకులతోనే కొద్దిరోజులు నడిపించి ఆ తర్వాత మొత్తం సర్దుబాటు అయ్యాక కొత్త విడుదలలు ప్రకటిస్తారు.

దీని వల్ల తొలుత కొంత నష్టం వచ్చినా తర్వాత పరిస్థితి సద్దుమణిగేందుకు ఉపయోగపడుతుంది. కాకపోతే ఎన్ని రోజులు పడుతుందన్నదే భేతాళ ప్రశ్న. ఇండియా అనే కాదు అన్ని దేశాల్లోనూ ఇదే తరహా ఫార్ములానే ఉపయోగించే అవకాశం ఉంది. ఇలా పాత సినిమాలు వేయడం వల్ల గాడి తప్పిన మెయింటెనెన్స్ ని సెట్ చేసుకోవడానికి అవకాశం దక్కుతుంది. టికెట్ బుకింగ్స్ లేక వెలవెలబోతున్న యాప్స్ కు కళ రావాలన్నా మాల్స్, మల్టీప్లెక్సులు ఓపెన్ కావాల్సిందే. అప్పటిదాకా ఈ శ్మశాన నిశ్శబ్దం తప్పదు.