ట్రంప్ ఒత్తిడి తలొంచిన డ్రాగన్ దేశం.. వైరస్ మూలాలపై విచారణకు ఓకే

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి చివరకు డ్రాగన్ దేశం చైనా తలొంచాల్సొచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి మూలాలపై విచారణ చేయాల్సిందేనంటూ ట్రంప్ చేసిన డిమాండ్ ను మొదట్లో చైనా కొట్టేసింది. వైరస్ కు పుట్టినల్లైన చైనాలో ఎక్కడి నుండి వైరస్ మొదలైందనే విషయంలో విచారణ చేయాల్సిందేనంటూ ట్రంప్ మొదటి నుండి చేస్తున్న డిమాండ్ కు ప్రపంచదేశాలు కూడా మద్దతు పలికాయి. అయితే ఎన్ని దేశాలు డిమాండ్ చేసిన చైనా చాలా కాలం లెక్క చేయలేదు.

అయితే అమెరికా డిమాండ్ కు ప్రపంచంలో పెరిగిపోతున్న మద్దతు కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహించాల్సొచ్చింది. సోమ, మంగళవారాలు ఇదే విషయమై సుదీర్ఘంగా చర్చించిన సభ్యదేశాలు మంగళవారం సాయంత్రం ఓటింగ్ లో పాల్గొన్నాయి. యూరోపియన్ యూనియన్ ప్రతిపాదించిన ఓటింగ్ కు 130 సభ్యదేశాలు అనుకూలంగా ఓట్లేశాయి. దాంతో చైనా ఎంత వ్యతిరేకించినా ఉపయోగం కనబడలేదు. ఫలితంగా వైరస్ మూలాలపై తొందరలోనే ఓ కమిటి విచారణ మొదలవ్వటం ఖాయమని తేలిపోయింది.

చైనాలో వూహాన్ ల్యాబ్ నుండే వైరస్ బయటకు వచ్చిందని ఒక వాదనుండగా వూహాన్ లోని జంతు మార్కెట్ లోని గబ్బిలాల నుండే వైరస్ సోకిందని మరో వాదన కూడా వినబడుతోంది. అమెరికాతో పాటు మరికొన్ని దేశాలు చైనా ఉద్దేశ్యపూర్వకంగానే వైరస్ ను ప్రపంచం మీదకు వదిలిందంటూ ఆరోపణలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే చాలా దేశాలు వైరస్ వల్ల జరిగిన నష్టానికి చైనానే పరిహారం చెల్లించాలంటూ అంతర్జాతీయ న్యాయస్ధానంలో కేసులు కూడా వేశాయి.

వైరస్ సోకిన విషయంలో ట్రంప్ ఇటు చైనాపై ఒత్తిడి పెడుతునే అటు డబ్ల్యూహెచ్ఓ పైన కూడా బాగా ఒత్తిడి పెట్టాడు. తాత్కాలికంగా నిలిపేసి నిధులను శాస్వతంగా నిలిపేస్తానంటూ బెదిరించటం ఇందులో భాగమే. ఇంతకాలం చైనాకు డబ్ల్యూహెచ్ఓ మద్దతిస్తోందనే అపప్రద నుండి బయట పడటానికి కూడా డబ్ల్యూహెచ్ఓ నానా అవస్తలు పడుతోంది. ఇందులో భాగంగానే అసెంబ్లీలో చర్చ పెట్టడం, ఓటింగ్ నిర్వహించటానికి అంగీకరించింది.

వైరస్ కారణంగా అన్నీ కోణాల నుండి ఒకేసారి మొదలైన ఒత్తిడిని చైనా కూడా తట్టుకోలేకపోయింది. ఫలితంగానే వైరస్ మూలలపై విచారణ చేయటానికి, దర్యాప్తుకు డ్రాగన్ దేశం అంగీకరించింది. ఇదే విషయమై చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాట్లాడుతూ ప్రపంచదేశాలు చేస్తున్నఆరోపణలు తప్పని నిరూపించేందుకైనా తాము డబ్ల్యూహెచ్ఓ అసెంబ్లీ తీర్మానాన్ని అంగీకరిస్తున్నట్లు ప్రకటించటం గమనార్హం. మొత్తానికి వైరస్ మూలాలపై తొందరలోనే అసలు గుట్టు బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి. చూద్దాం ఏమి జరుగుతుందో.

Show comments