iDreamPost
android-app
ios-app

విశాఖ ఎల్‌జి పాలిమర్స్‌లో లీకైన విష వాయువు

విశాఖ ఎల్‌జి పాలిమర్స్‌లో లీకైన విష వాయువు

ముగ్గురు మృతి-అనేకమందికి అస్వస్థత

విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జి పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమ నుంచి లీకైన రసాయన వాయువు సుమారు మూడు కిలోమీటర్ల​ మేర వ్యాపించడంతో అక్కడి స్థానిక ప్రజలు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. కానీ లీకైన రసాయన గాలిని పీల్చడంతో కొందరికి చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. మరికొందరు అస్వస్థతకు గురై అపస్మారకస్థితిలో రహదారిపై పడిపోయారు.

రసాయన వాయువు వ్యాపించడంతో కొందరు ప్రజలు భయాందోళనలతో తలుపులు వేసుకొని ఇళ్లలోనే ఉండిపోగా, మరికొందరు స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ నాయుడు తోట పరిసరాల్లో ఇల్లు ఖాళీ చేసి మేఘాద్రి గడ్డ డ్యామ్ వైపు పరుగులు తీశారు. దీంతో సైరన్‌లు మోగించి ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. పరిశ్రమ పరిసర ప్రాంతాల ప్రజలను ఇళ్ల నుంచి తరలిస్తున్నారు.

రసాయన వాయువు పీల్చి అపస్మారక స్థితిలో పడిపోయిన బాధితులను అధికారులు అంబులెన్సులో హాస్పిటల్ కి తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌, విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌.కె.మీనా సంఘటన సంభవించిన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో వాయువు లీకయ్యింది అని అధికారులు గుర్తించారు. రసాయన వాయువు లీకేజీని అరికట్టడానికి అధికారులు, తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు, వైద్య సిబ్బంది ఆర్‌.ఆర్‌. వెంకటాపురం ప్రాంతానికి చేరుకుని ప్రజలను సంఘటన స్థలానికి దూరంగా వెళ్లాలని అప్రమత్తం చేస్తున్నారు.

గాలిలో వ్యాపించిన విషవాయువును పీల్చడంతో ఇప్పటికే ముగ్గురు మృతిచెందగా చాలామంది అపస్మారక స్థితికి చేరుకున్నారు. కొందరు బాధితులకు వాంతులు అవుతుండడంతో 24 అబులెన్సుల ద్వారా బాధితులను దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు తరలిస్తున్నారు. బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రైవేట్ వాహనాలు, బస్సుల ద్వారా స్థానికులను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా మూతపడిన కంపెనీని తిరిగి ఓపెన్ చేసేందుకు ప్రయత్నం చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని యాజమాన్యం వెల్లడించింది. కాగా విష వాయువులు పీల్చిన కొందరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది..ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ కలెక్టర్ ను ఆదేశించారు. అధికారులు, సిబ్బంది లీకైన రసాయన వాయువును అదుపు చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.