iDreamPost
iDreamPost
తాజాగా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖతో ఆయన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం ఇంతేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జగన్ రాసిన లేఖలో పెంచిన పెట్రోలు, డీజల్ ధరలు తగ్గించాలంటూ లేఖ రాశాడు. పైగా పెంచిన పెట్రోలు, డీజల్ ధరలు తగ్గించేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని చెప్పటమే విచిత్రంగా ఉంది. తన హయాంలో పెట్రోలు, డీజల్ ధరలు ఏ విధంగా తగ్గించింది తెలుసుకుని స్పూర్తిగా తీసుకోవాలని ఓ ఉచిత సలహా ఇవ్వటం కూడా నవ్వులపాలవుతోంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పెట్రోలు, డీజల్ ధరల పెరగటానికి రాష్ట్రప్రభుత్వానికి సంబంధం లేదు. ఇంధన ధరలు పెంచటం, తగ్గించటం పూర్తిగా కేంద్రప్రభుత్వ పరిధిలోని అంశం అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే పెట్రోలు, డీజల్ ధరల్లో రాష్ట్రం పరిధిలో విధించే కొన్ని అదనపు పన్నులుంటాయి. ఇపుడు తెలుసుకోవాల్సిందేమంటే కేంద్రం పెంచుతున్న పెట్రోలు, డీజల్ ధరలపై రాష్ట్రప్రభుత్వం ఎటువంటి అదనపు పన్నులు వేయటం లేదు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అదనపు పన్నులను వేయలేదు.
గడచిన 15 రోజులుగా వరుసగా పెట్రోల్, డీజల్ ధరలు పెరుగుతుండటంతో ఇతర రాష్ట్రప్రభుత్వాలు కూడా ఒకటే గోల చేస్తున్నాయి. ధరల పెరుగుదల విషయంలో దేశమంతా కేంద్రంపై గోల చేస్తుంటే చంద్రబాబు మాత్రమే జగన్ ను తప్పుపడుతున్నాడు. తాను అధికారంలో ఉన్నపుడు జనాల సమస్యలను, బాధలను ఏరోజూ చంద్రబాబు పట్టించుకోలేదన్న విషయం అందరికీ తెలిసిందే. కేంద్రం ధరలు పెంచేయగానే అప్పట్లో చంద్రబాబు కూడా ఇక్కడ అదనపు పన్నులు పెంచేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. 2015లో రాజధాని సెస్ పేరుతో అదనపు వాట్ కూడా పెట్రోలు, డీజల్ ధరలపై విధించిన విషయం బహుశా చంద్రబాబు మరచిపోయాడేమో. అంతెందుకు పెట్రోల, డీజల్ ధరల విషయాన్ని ప్రస్తావిస్తు ’ఏపిలో కన్న కర్నాటకలోనే ధరలు తక్కువ కాబట్టి ఇక్కడే పెట్రోలు, డీజల్ పట్టించుకోండి’ అంటూ కర్నాటక సరిహద్దుల్లోని పెట్రోలు బంకుల్లో ప్రత్యేకంగా బోర్డులు పెట్టిన విషయం గుర్తుండే ఉంటుంది.
ధరలు తగ్గించమని చంద్రబాబు లేఖ రాయాల్సింది నరేంద్రమోడికి. అలాంటిది పెట్రోలు, డీజల్ ధరలపై జగన్ కు లేఖ రాయటాన్ని అందరూ నవ్వుకుంటున్నారు. నరేంద్రమోడికి లేఖరాసే ధైర్యం లేక చివరకు తన అజ్ఞానాన్ని చంద్రబాబు ఇలా బయటపెట్టుకుంటున్నాడా ? అనుకుంటున్నారు.