Idream media
Idream media
కరోనా వైరస్ భయాందోళనల మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని తన రాజభవనానికే పరిమితం అయ్యారు. మార్చి 21వ తేదీ నుంచి ఆయన హైదరాబాద్ నుంచి తన రాజకీయం నడుపుతున్నారు. దాదాపు రెండు నెలల తర్వాత గత నెల 25వ తేదీన విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధిత కుటుంబాలను పరామర్శించేందుకంటూ అనుమతి తీసుకుని హైదరాబాద్ నుంచి విమానాలు లేవనే కారణంతో తాడేపల్లి రోడ్డు మార్గాన వెళ్లారు. 26వ తేదీన జూమ్ యాప్‌లో మహానాడుకు ఏర్పాట్లు చేసుకుని, 27, 28వ తేదీత్లో మహానాడు నిర్వహించుకుని 29వ తేదీన మళ్లీ తన కుమారుడు నారా లోకేష్‌తో కలసి హైదరాబాద్ వెళ్లారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన బాధిత కుటుంబాలను మరోసారి పరామర్శిస్తారని టీడీపీ నేతలు ప్రకటనలు చేశారు.
గత నెలలో మహానాడు కోసం ఏపీకి వచ్చిన చంద్రబాబు.. మళ్లీ ఈ నెలలో రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నెల 16వ తేదీన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ తేదీన దాదాపు అసెంబ్లీ ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 19వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనుండడంతో ఓటు వేసేందుకైనా సరే చంద్రబాబు నాయుడు తన రాజభవనాన్ని వదిలి ఏపీకి రావాల్సిన అవసరం ఏర్పడింది. ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. టీడీపీకి బలం లేకపోయినా నాలుగో స్థానానికి ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యను పోటీకి నిలిపింది. దీంతో ఓటింగ్ అనివార్యం కావడంతో ఈ నెల 19వ తేదీ దేశ వ్యాప్తంగా పోలింగ్ నిర్వహించే 18 స్థానాల్లో ఏపీ నుంచి 4 సీట్లు కూడా ఉన్నాయి.
ఈ నెల 16వ తేదీనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు రెండు రోజులు ముందుగానే అంటే.. 14వ తేదీనే ఏపీకి రావాల్సి ఉంటుంది. అసెంబ్లీలో అనుచరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఈ పరిణామాల్లో చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్‌లు ఏపీకి వచ్చేందుకు అనుమతి కోసం డీజీపీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి పాస్‌లు తప్పనిసరని కరోనా నోడల్ అధికారి కృష్ణబాబు నిన్న ఆదివారం స్పష్టం చేశారు. స్పందన వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుంటే డీజీపీ అనుమతితో పాస్‌లు మంజూరు చేస్తారు. అయితే చంద్రబాబు స్పందన వెబ్‌సైట్ నుంచి కాకుండా డీజీపీకి నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
అసెంబ్లీ సమావేశాలు, రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి చంద్రబాబు రావడం దాదాపు ఖాయమే. ఈ నెలాఖరు వరకూ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత.. కనీసం ఈ సారైనా విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధిత కుటుంబాలను చంద్రబాబు పరామర్శిస్తారా..? లేదా..? వేచి చూడాలి.
Read Also : అనితారాణి వ్యవహారంపై సీఐడీ దర్యాప్తునకు సీఎం ఆదేశం