Idream media
Idream media
మూడు సార్లు.. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తికి.. తన హయాంలో ప్రజల కోసం ఫలానా పథకం ప్రవేశపెట్టాను, ఫలానా విధంగా మేలు చేశాను అని చెప్పుకునేందుకు ఒక్క పని లేదంటే అతిశయోక్తిగా ఉంది. అయినా ఇది నిజమే. ఎందుకంటే తన హాయంలో ప్రజల కోసం ప్రవేశపెట్టానని ఒక్క పథకం కూడా చెప్పని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పెట్టిన పథకాలను ఈ రోజు జరిగిన జూమ్ మహానాడులో ఏకరవు పెట్టారు.
‘‘ఎన్టీఆర్ రెండు రూపాయలకు కిలో బియ్యం, మద్యపాన నిషేధం.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజురియంబర్స్‌మెంట్.. చంద్రబాబు ప్రవేశపెట్టిన ఒక్క పథకం టక్కున చెప్పండి‘‘ అని తరచూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తుంటాయి. ఈ పశ్నకు జవాబు.. ఏమీ లేవు.. అని చంద్రబాబే ఈ రోజు తన ప్రశంగంలో తేల్చేశారు.
రెండు దఫాలు 9 ఏళ్లు, మరో ఐదేళ్లు వెరసి 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు.. ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన పథకాలను వల్లెశారు తప్పా.. తన హాయంలో ప్రవేశపెట్టిన ఒక్క పథకం పేరు కూడా చెప్పలేకపోయారు. ఎన్టీఆర్ రైతులకు 50 రూపాయలకే హార్స్ పవర్ ఇవ్వబట్టే.. ఈ రోజు ఉచిత విద్యుత్ విద్యుత్ వచ్చిందన్నారు. రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ఇప్పటికీ కొనసాగుతుందన్నారు(తాను 5.25 రూపాయలు చేసిన విషయం ఈ తరం యువతకు తెలియదనుకున్నారేమో). గుడిసెల స్థానంలో పక్కా ఇళ్లు కట్టించారు అంటూ ఎన్టీఆర్ అమలు చేసిన పథకాలను చెప్పుకొచ్చారు.
తాను చేసిన పని ఎన్నడూ సూటిగా చెప్పుకోలేని చంద్రబాబు.. ఎప్పటి లాగే ఈ రోజు కూడా ఆవు వ్యాసం వినిపించారు. హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టానన్నారు. సైబరాబాద్ కట్టానన్నారు. ఐటీ, బయో టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చానన్నారు. వస్తున్నా మీ కోసం పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి మేలు చేసేలా కార్యక్రమాలు చేశామన్నారు కానీ ఆ కార్యక్రమాలేవో మాత్రం చెప్పలేదు. ఒకటి రెండు ప్రాజెక్టులు మినహా మిగతావన్నీ ఎన్టీఆర్, తాను ప్రారంభించామన్నారు కానీ తాను ప్రారంభించిన ప్రాజెక్టులేవో మాత్రం చెప్పలేదు. ప్రపంచమంతా తిరిగి పెట్టుబడులు ఆహ్వానిచామని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు తాజా స్పీచ్‌తో ఆయన ప్రజల కోసం పెట్టిన ఒక్క పథకం చెప్పండి.. అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి సమాధానం దొరికనట్లే. ఇకపై ఆ పోస్టులు పెట్టాల్సిన అవసరం వారికి ఉండకపోవచ్చు. ఇప్పటి వరకూ సమాధానలు చెప్పేందుకు నానా తంటాలు పడిన బాబు అభిమానులకు కూడా ఊరట దక్కుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.