iDreamPost
iDreamPost
దేశ రాజకీయాల్లో మొత్తం ఫార్టీఇయర్స్ అనుభవం ఉన్నది నారా చంద్రబాబునాయుడు ఏం చేసినా తనదైనిశైలి ఉండేలా చూసుకుంటారంటారు. ఇందుకు తగ్గ సూచనలు, సలహాల బృందం నిత్యం ఆయనకు అందుబాటులోనే ఉంటుందట. దీంతో ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం, ప్రజలను ఆకట్టుకోవడంకోసం ప్రణాళికలను సిదం చేసి, అమలు చేస్తుండడమే రాజకీయాల్లో ఇన్నాళ్ళుగా ఆయన అమలు చేస్తున్న ఫార్ములాగా చెబుతుంటారు. ఇది ఎంత వరకు ఆయనకు కలిసొచ్చింది అన్న ప్రశ్నను ప్రక్కన పెడితే.. కొన్ని సార్లు మాత్రం భారీగానే ఎదురుదెబ్బలు తిన్నారన్నది ఆ పార్టీవారే ఒప్పుకుంటుంటారు.
2019 ఎన్నికలల్లో ఓటమి తరువాత పార్టీలో ఏర్పడ్డ తీవ్ర స్తబ్దతను తరిమికొట్టేందుకు పార్లమెంటరీ కమిటీలకు అధ్యక్షుల ఎంపిక చేపట్టారు చంద్రబాబు. ఇందుకోసం సీనియర్లు, యువత సమన్వయంతో ఏర్పాటు చేసినట్టుగా ప్రకటించారు. దీంతో పాటు రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడి పేరుని కూడా లీకులిచ్చారు. చంద్రబాబు ఆయన బృందం నుంచి బైటకు రాకుండా అచ్చెన్నపేరు లీకురూపంలో బైటకొచ్చేందుకు తెలుగుదేశం పార్టీలో ఎటువంటి అవకాశం లేదు. సో ఆయన కోరిక మేరకే లీకులిచ్చారన్న అభిప్రాయం సర్వత్రా ఉంది.
అంత వరకు బాగానే ఉంది. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర అధ్యక్షుడి పేరును ఖరారు చేస్తూ ప్రకటన మాత్రం వెలువడలేదు. దీంతో ఎవరికి తోచిన భాష్యాలు వారు చెప్పుకుంటున్నారు. అచ్చెన్నే వద్దంటున్నాడని, చినబాబు ఇవ్వొద్దంటున్నారని, ఇప్పటి వరకు ఉన్న అధ్యక్షులు కళా వెంకట్రావు తనదారి తాను చూసుకుంటానన్నాడని.. ఇలా రోజుకో పుకారు పుట్టేసి సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారమైపోతోంది. అయితే వీటికి సంబంధించిన ఖండనలు గానీ, మరే విధమైన అభ్యంతరాలు గానీ సదరు నాయకుల నుంచి స్పష్టంగా వెలువడింది లేదు. అసలింతకా అచ్చెన్నకు ఇస్తున్నారా? ఇవ్వడం లేదా? అన్నదానిపై ఆయన వర్గం నేతలు ఆసక్తిగానే ఎదురు చూస్తున్నారు.
చేయబోయే పనిని గురించి గానీ, మానేద్దేమనుకుంటున్న దానిని గురించి గానీ ముందుగానే తన అనుంగు మీడియా ద్వారా లీకులిచ్చి, పార్టీలోనూ, జనంలోనూ ఏ విధమైన రియాక్షనొచ్చిందో తెలుసుకోవడం చంద్రబాబుకు రాజకీయంతో వచ్చిన విద్య అని చెబుతారు. ఇటువంటి ప్రయోగాల ద్వారానే అనేక పనులు చక్కబెట్టుకోవడం గానీ, చేయకుండా మానేయడం గానీ చేసిన సంగతిని గుర్తు చేర్తుచేస్తున్నారు. వాటిని పరిగణనలోకి తీసుకుంటే.. అచ్చెన్నను తన అభిప్రాయసేకరణ ప్రయోగానికి గానీ వినియోగించుకోలేదు కదా? అన్న సందేహాలు కూడా లేకపోలేదు. ఇటువంటి అనేకానేక సందేహాలకు తెరపడాలంటే టీడీపీ అధినాయకత్వమే నోరు తెరవాల్సి ఉంటుంది.