Idream media
Idream media
గడిచిన సంవత్సరంలో తన జీవితంలో బాధాకరమైన ఏడాదని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జూమ్ యాప్ ద్వారా ఈ రోజు ప్రారంభమైన మహానాడులో ఆయన మాట్లాడారు. 38 ఏళ్లలో ఎన్నడూ ఎదుర్కొని సమస్యలను గడచిన ఏడాదిలో ఎదుర్కొన్నామని చంద్రబాబు వాపోయారు. రాజకీయంగా చాలా ఒడిదుడుకులు వచ్చాయన్నారు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మంది జైలుకు పోయారని, మరికొంత మందిని జైలుకుపోయే పరిస్థితి తీసుకొచ్చారని వైసీపీ సర్కార్‌పై విమర్శలు చేశారు.
38 సంవత్సరాలుగా పార్టీ జెండాను భుజాలు అరిగిపోయేలా కార్యకర్తలు మోశారని, వారందరికీ పాదాభివందనాలు చేస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ప్రలోభపెట్టినా, బ్లాక్‌మెయిల్ చేసి సరెండర్ చేసుకోవాలని చూసినా.. పార్టీపై అచెంచల విశ్వాసంతో ముందుకు వెళుతున్నారని కొనియాడారు. 38 ఏళ్లలో 22 ఏళ్లు అధికారంలో ఉన్నామని, ఈ సమయంలో ప్రజలకు ఎంతో మేలు చేశామని చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ ఆత్మ గౌరవం నినాదం ఇస్తే.. తాను ఆత్మ విశ్వాసం నినాదం ఇచ్చానని చెప్పారు. ఈ రెండింటితో ముందుకు వెళ్లామన్నారు. కరోనా సమయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు చేసిన సేవ మరిచిపోలేమన్నారు. ప్రస్తుతం కరోనా సమయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు చాలా క్రమశిక్షణతో ఉండాలని కోరారు. భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు. లేదంటే చాలా ప్రమాదం వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు.