iDreamPost
android-app
ios-app

తిరుపతి ఉప ఎన్నికలు: బీజేపీకి చెక్ పెట్టేందుకు చంద్రబాబు కొత్త వ్యూహం

  • Published Dec 14, 2020 | 4:11 AM Updated Updated Dec 14, 2020 | 4:11 AM
తిరుపతి ఉప ఎన్నికలు: బీజేపీకి చెక్ పెట్టేందుకు చంద్రబాబు కొత్త వ్యూహం

ఏపీలో వైఎస్సార్సీపీకి ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబుకి కొత్త సమస్య వచ్చింది. ఆయన ప్రతిపక్ష స్థానానికి కూడా ఎసరు పెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే అధికారం కోల్పోయి విలవిల్లాడుతున్న బాబు క్యాంప్ కి తాజా పరిణామాలు మింగుడుపడడం లేదు. తెలంగాణాలో కాంగ్రెస్ ను తోసేసి తానే రెండో స్థానానికి చేరుకోవాలన్న బీజేపీ ఆశలు దాదాపుగా నెరవేరినట్టే చెప్పవచ్చు. ఇప్పుడు ఏపీలో కూడా బాబుని నెట్టేసి తాము సెకండ్ ప్లేస్ లో ఉండాలని కమలనాథులు స్కెచ్ వేస్తున్నారు. ఇప్పటికే బలహీనంగా మారుతున్న టీడీపీని దాటడం తమకు పెద్ద కష్టం కాదని భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగా వ్యూహాత్మకంగా అడుగులు వేసేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు సన్నద్దమవుతోంది.

ఓవైపు వైఎస్సార్సీపీని ఎదుర్కోవడంలో విఫలమవుతున్న చంద్రబాబు ఇప్పుడు రెండో వైపు బీజేపీని కూడా ఎలా నిలువరించాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ విషయంలో ఆయన నేరుగా తలపడే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే తన తీరుతో గుర్రుగా ఉన్న మోడీ-అమిత్ షా ద్వయానికి మరింత దూరమయ్యేందుకు ఆయన సిద్ధంగా లేరు. ఓవైపు వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్న తాను వారి పట్ల దూకుడుగా వెళ్లగలిగే అవకాశాలు లేకపోవడంతో దొడ్డిదారి రాజకీయాలకు తెరలేపారు. తనదైన శైలిలో పన్నాగాలు ప్రారంభించారు.

చంద్రబాబు వ్యూహాల్లో భాగంగా తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీకి బ్రేకులు వేసేందుకు కొత్త శక్తులు సీన్ లోకి వస్తున్నాయి. వాస్తవానికి తిరుపతి ఉప ఎన్నికలకు అంత ప్రాధాన్యత లేదు. ఈ నియోజకవర్గంలో మరణించిన వైఎస్సార్సీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ స్థానంలో బరిలో దిగుతున్న డాక్టర్ గురుమూర్తికి దాదాపు తిరుగులేదనే సంకేతాలు వస్తున్నాయి. అయినా బీజేపీ, టీడీపీ మధ్య రెండో స్థానం కోసం గట్టి పోటీగా మారబోతున్నట్టు పరిశీలకు అంచనా. నిజంగానే బీజేపీ అభ్యర్థి, టీడీపీని వెనక్కి నెడితే రాజకీయంగా చంద్రబాబు ఇక్కడ ఓటమి కన్నా ఎక్కువ నష్టం చేస్తుంది. రాష్ట్రంలో టీడీపీ పునాదులకే బీటలు బలపడతాయి. దాంతో వైఎస్సార్సీపీ ఓటమి కన్నా బీజేపీని నిలువరించడం బాబుకి అత్యంత కీలకం. అదే సమయంలో బహిరంగంగా ఎదుర్కోలేని బలహీన స్థితిలో చంద్రబాబు ఉండడంతో బీజేపీకి వ్యతిరేకంగా కొత్త స్కెచ్ వేశారు.

నాలుగేళ్ల క్రితం జడ్జి పదవికి రాజీనామా చేసిన శ్రవణ్ కుమార్ అందుకు అనుగుణంగా ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో బాబు అధికారంలో ఉన్న సమయంలో ఆయన వెంట నడిచిన పలువురు నేతలు ఇప్పుడు శ్రవణ్ కుమార్ తో పాటు సాగుతున్నారు. తాజాగా తిరుపతిలో సమావేశం నిర్వహించి ఇండిపెండెంట్ అభ్యర్థిని బరిలో దింపుతున్నట్టు ప్రకటించారు. నెల్లూరులో సభ నిర్వహించాలని నిర్ణయించారు. తద్వారా ప్రత్యేక హోదా, ఇతర అంశాల్లో బీజేపీని బద్నాం చేసేందుకు బాబు చేయలేని పనిని , వారి అనుంగు వర్గీయులతో చేయించే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది. వాస్తవానికి చంద్రబాబు అక్రమ ఆస్తులపై గతంలో జడ్జి శ్రవణ్ కుమార్ హైకోర్టులో పిల్ వేశారు. ఆ తర్వాత దానిని మరుగునపరిచారు. ప్రస్తుతం చంద్రబాబు నిర్ణయాలను అమలు చేసేందుకు శ్రవణ్‌ కుమార్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా ఉంది. ఇప్పుడు తిరుపతిలో పోటీ విషయంలో కూడా శ్రవణ్ శ్రద్ధ చూపుతున్న తీరు దానికి తార్కాణంగా భావిస్తున్నారు.

బాబు ఎత్తులను గమనిస్తున్న బీజేపీ నేతలు కూడా గుర్రుగా ఉన్నట్టుగా సమాచారం. వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా టీడీపీ అభ్యర్థిని బరిలో దింపుతున్న చంద్రబాబుకి ఆయన మిత్రులతో ఇండిపెండెంట్ ని పోటీ చేయించాల్సిన అవసరం ఏమొచ్చిందనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదిపేందుకు ఇండిపెండెంటె్ ని రంగంలోకి తెస్తున్నారనే అంచనాకు బీజేపీ నేతలు వచ్చారు. గతంలో వచ్చిన రెండో స్థానం నిలబెట్టుకోవాలనే బాబు ప్రయత్నానికి బీజేపీ గట్టి పోటీదారుగా ఉండడంతో తమ పార్టీ ఆశలకు గండికొట్టే లక్యంలో చంద్రబాబు ఉన్నారనే అభిప్రాయంతో బీజేపీ కనిపిస్తోంది. దాంతో ఈ వ్యవహారం ఆసక్తిదాయకంగా మారుతోంది. రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది.