Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఈ రోజు గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్‌ను కలిశారు. వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందంటూ ఫిర్యాదు చేశారు. వివిధ అంశాలతో ఏకంగా 14 పేజీల భారీ లేఖను అందించారు. ఏడాది పరిపాలనలో వైసీపీ ఇలా వ్యవహరించిందంటూ అందులో పేర్కొన్నారు.
తమ నేతలను అక్రమంగాఅరెస్ట్‌లు చేసి వేధిస్తున్నారని, రాజ్యాంగ సంస్థలను విచ్ఛిన్నం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దళితులు, బీసీలపై దాడులు చేస్తోందని వాపోయారు. పనిలో పనిగా వైసీపీ నేతల వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయని కూడా ఫిర్యాదు చేశారు. మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌లను దూషించారని గవర్నర్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం, పోలీసులు వైఫల్యం చెందారని బాబు వాపోయారు. ఏడాది కాలంలో ఇసుక, భూ సేకరణ, మద్యం విక్రయాల్లో అక్రమాలకు పాల్పడ్డారని.. తన సుదీర్ఘ లేఖలో చంద్రబాబు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
చంద్రబాబు ఫిర్యాదులు క్లుప్తంగా చూస్తే.. అచ్చెం నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిల అరెస్ట్, నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వ్యవహారం, మత్తు డాక్టర్ సుధాకర్, నిన్న జరిగిన మండలి వ్యవహారం, ఏడాది కాలంగా ఆయన విమర్శలు చేస్తున్న ఇసుక, మద్యం చుట్టూనే తిరిగాయి. ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్ అయిన అచ్చెం నాయుడు వ్యవహారాన్ని బీసీలపై దాడిగా చంద్రబాబు అభివర్ణించారు. మత్తు డాక్టర్ సుధాకర్ విషయాన్ని దళితులపై దాడిగా చూపించారు.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చంద్రబాబు అండ్ కో బురద జల్లేందుకు ప్రయత్నిస్తోదన్న విషయం వారు వ్యవహరించిన తీరును బట్టి అర్థం అవుతోంది. తనకున్న మీడియా బలంతో చంద్రబాబు నిత్యం ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆయన ప్రెస్‌మీట్ పెట్టని రోజులు ఈ ఏడాదిలో వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. కరోనా వల్ల ప్రెస్‌మీట్లకు అవకాశం లేకపోయినా హైదరాబాద్‌లోని తన బంగ్లా నుంచి జూమ్ యాప్ ద్వారా ప్రతి రోజు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఒక సారిపెట్టుబడులు పోతున్నాయంటూ, మరోసారి కంపెనీలు ఏవీ రాలేదంటూ దుష్ప్రచారం చేశారు. టీడీపీ నేతల తీరు రాబోయే రోజుల్లోనూ కొనసాగే అవకాశం ఉంది.
తాము నిప్పులా బతికామని, నీతివంతమైన రాజకీయాలు చేశామని చెబుతూ తమపై చేస్తున్న ఆరోపణలు రుజువు చేయాలని సవాళ్లు విసిరిన చంద్రబాబు.. ఆ పని ప్రభుత్వం చేస్తుంటే అక్రమ కేసులు, వేధింపులు అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అగ్రిగోల్డ్ స్కాం, అమరావతి భూ కుంభకోణం, విశాఖ భూ స్కాం, తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై సాగుతున్న దర్యాప్తుల నుంచి ప్రజల దృష్టిని మరలించేందుకు బాబు అండ్ టీం చేయని ప్రయత్నం అంటూ లేదు.
బీజేపీ, ప్రధాని మోడీతో సత్సంబంధాలు ఉంటే చంద్రబాబు పరిస్థితి మరోలా ఉండేది. ఈ రోజు గవర్నర్‌కు ఇచ్చిన లేఖ నేరుగా ప్రధానికే ఇచ్చేవారు. పలుమార్లు వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదులు చేసేవారు. ప్రధానితోపాటు రాష్ట్ర పతిని కూడా కలిసి ఫిర్యాదులు చేసేవారంటే అతిశయోక్తికాదు. కానీ ఆ అవకాశం చంద్రబాబుకు లేకుండా పోయింది. 2014 ఎన్నికల్లో తమ మద్ధతుతో గెలిచి, నాలుగేళ్లు కేంద్రంలో అధికారం పంచుకుని 2019 ఎన్నికలకు ఏడాది ఉందనగా బాబు చేసిన రాజకీయం బీజేపీ నేతలను అనునిత్యం గుర్తు చేస్తూనే ఉంది. పైగా మోడీని టార్గెట్ చేసుకుని చేసిన వ్యక్తిగత విమర్శలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాను దూషించడంతో పాటు తన బావమరిది, సినీ నటుడు బాలయ్యతో హిందీలోనూ తిట్టించడం బీజేపీ నేతలు మరువలేకపోతున్నారు.
మోడీపై వ్యక్తిగత విమర్శలు, దూషణలు చేయకపోయినా.. పరిస్థితి మరోలా ఉండేది. ఈ పాటికి బీజేపీకి దగ్గరై పలుమార్లు ఢిల్లీ పర్యటనకు శ్రీకారం చుట్టేవారు. కానీ ఆ అవకాశం చంద్రబాబు కోల్పోయారు. ఏడాది కాలంలో ఒక్కసారి కూడా చంద్రబాబు ఢిల్లీ వెళ్ళలేదంటే ఆ పార్టీ నేతలు కూడా నమ్మలేకుండా ఉన్నారు.