శిద్ధా దెబ్బ.. బాబు ఫ్రస్ట్రేషన్‌ పీక్స్‌కు వెళ్లింది..!

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు పార్టీని వీడుతుండడంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడులో ఫ్రస్ట్రేషన్‌ పీక్స్‌కు వెళుతోంది. ఆయన తనను తాను నియంత్రించుకోలేకపోతున్నారు. పార్టీ మారుతున్న వారిపై ఆగ్రహం, అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు పార్టీని వీడగా.. తాజాగా మాజీ మంత్రి, ప్రకాశం జిల్లాకు చెందిన గ్రానైట్‌ వ్యాపారి శిద్ధా రాఘవరావు పార్టీని వీడడం ఖాయమైంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తీవ్ర అసహనం, అక్కడకు వెళ్లగక్కారు. పార్టీకి ద్రోహం చేసిన వారితో దూరంగా ఉండాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీకి ద్రోహం చేసిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారంటూ శాపనార్థాలు పెట్టారు.

సాధారణ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత టీడీపీ పూర్తిగా చతికిలపడింది. చంద్రబాబు తీరుతో ఇకపై భవిష్యత్‌ ఉండదని భావించిన టీడీపీ తాజా, మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్ధాళి గిరి, కరణం బలరాం, ఎమ్మెల్సీలు పోతుల సుజాత, శివనాథరెడ్డిలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు టీడీపీని వీడారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీలో చేరకపోయినా.. సీఎం జగన్‌ను కలిశారు. మాజీ ప్రజా ప్రతినిధులు మాత్రం సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఎన్నికలు ముగిసిన ఏడాదిలోనే ఈ పరిస్థితి ఉండడంతో చంద్రబాబులో అసహం తీవ్ర స్థాయికి చేరింది.

గత ఎన్నికల్లో 23 సీట్లుకే టీడీపీ పరిమితమైంది. విశాఖ, ప్రకాశం, తూర్పు గోదావరి జిల్లాల్లో గరీష్టంగా నాలుగు చొప్పున సీట్లు వచ్చాయి. ఇందులో ప్రకాశంలో ఇప్పటికే ఒకరు పార్టీని వీడగా.. మరో ఇద్దరు సిద్దంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. విశాఖలో వెలగపూడి రామకృష్ణ మినహా మిగతా ముగ్గురు సైలెంట్‌గా ఉన్నారు. 23 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే ముగ్గురు పార్టీని వదిలిపోగా.. వారి బాటలో మరో 12 లేదా 13 మంది నడుస్తారనే ఊహాగానాలు వెలువడుతున్న క్రమంలో చంద్రబాబులో ఆందోళన నెలకొంది. పార్టీకి పూర్వ వైభవం తేవాలని ప్రయత్నిస్తున్నా.. వయస్సు రీత్యా ఆయనతో తమ రాజకీయ జీవితం ఎక్కువ కాలం సాగదనే ఆలోచనలో టీడీపీ సీనియర్‌ నేతలున్నారు. వారి వారసుల కోసం ఇప్పటి నుంచే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా పార్టీ వీడుతున్న శిద్ధా రాఘవరావు కూడా తన కుమారుడు సుధీర్‌ రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా పార్టీని వీడుతున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.

పార్టీని వీడాలనుకుంటున్న వారికి చంద్రబాబు భవిష్యత్‌పై భరోసా కల్పించలేకపోతున్నారు. తన తర్వాత పార్టీని తన కుమారుడు సమర్థవంతంగా నడిపిస్తాడనే నమ్మకాన్ని వారిలో కల్పించలేకపోతున్నారు. ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవిని కట్టబెట్టినా.. లోకేష్‌ పుంజుకుని పార్టీని నడిపించే శక్తియుక్తులు ఇప్పటికీ సంపాదించలేదు. మంత్రిగా ఉన్న సమయంలో పక్క రాష్ట్రం సీఎం కేసీఆర్‌ కుమారుడు.. కేటీఆర్‌తో లోకేష్‌ను పోల్చుకున్న టీడీపీ శ్రేణులు లోకేష్‌ పనితీరు, మాటతీరు చూసి ఢీలా పడ్డాయి. అందుకే చంద్రబాబు పార్టీ ఏపీ అధ్యక్షుడి బాధ్యతలు తన కుమారుడిని కాదని మాజీ మంత్రి కింజారపు ఎర్రన్నాయుడు కుమారుడు, ప్రస్తుత శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడుకి అప్పగించాలనే ఆలోచనలు చేస్తున్నారు. చంద్రబాబు చేయాలనుకుంటున్న ఈ ప్రయోగం ఆయన పార్టీకి ఏ మేరకు లాభిస్తుందో, నేతలు పార్టీని వీడకుండా చేయగలుగుతుందా..? లేదా..? వేచి చూడాలి.

Show comments